రూ.1.55 లక్షల కోట్ల విలువైన ఆస్తులు.. మీరు ఏం చెబితే అదే చేస్తా.. సోషల్ మీడియాలో అపరకుబేరుడి సంచలనం

ABN , First Publish Date - 2021-11-08T00:40:08+05:30 IST

ఎలాన్ మస్క్.. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత! ఈ టెక్ ఆంత్రప్రెన్యూర్ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

రూ.1.55 లక్షల కోట్ల విలువైన ఆస్తులు.. మీరు ఏం చెబితే అదే చేస్తా.. సోషల్ మీడియాలో అపరకుబేరుడి సంచలనం

ఇంటర్నెట్ డెస్క్: ఎలాన్ మస్క్.. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత! ఈ టెక్ ఆంత్రప్రెన్యూర్ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టెక్నాలజీ రంగంలో అద్భుతాలు సృష్టిస్తూ ఎలాన్ ఎంతగా పాపులర్ అయ్యారో.. చిత్ర విచిత్రమైన ట్వీట్లు పెడుతూ అంతే స్థాయిలో సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందారు. తాజాగా నెటిజన్ల నుంచి సలహా కోరుతూ ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. 


‘‘డబ్బున్న వాళ్లు ట్యాక్సులు చెల్లించట్లేదన్న వార్త ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి.. టెస్లాలో నాకున్న వాటాలో పది శాతం షేర్లను అమ్మేద్దామనుకుంటున్నా..  ఈ నిర్ణయానికి మీరు మద్దతిస్తారా..’’ అంటూ ఆయన పెట్టిన పోస్ట్ చేస్తున్న హల్‌చల్ అంతాఇంతా కాదు. నెటిజన్లు తమ అభిప్రాయాలను చెప్పేందుకు వీలుగా మస్క్ ప్రస్తుతం ఓ పోల్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే..ఆ పది శాతం షేర్ల విలువ మన కరెన్సీలో చెప్పుకోవాలంటే అక్షరాలా దాదాపు రూ.1.55 లక్షల కోట్లు. దీంతో..నెటిజన్లలో ఇది సహజంగానే ఆసక్తి రేపుతోంది. కోట్ల మంది ఈ పోలింగ్‌ ద్వారా తమ అభిప్రాయాల్ని చెబుతున్నారు. 


ఆ ట్వీట్‌కు కారణమేంటంటే..

అమెరికాలో ఆదాయంపై పన్ను ఉంటుంది. ఇది అన్ని దేశాల్లోనూ ఉన్నదే. ఇక స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే..ఓ కంపెనీకి చెందిన షేర్ల విలువ పెరిగే కొద్దీ అందులో పెట్టుబడి పెట్టిన వారందరూ ధనవంతులైపోతారు. అయితే.. ఈ సొమ్మంతా కాగితాల మీద అంకెల రూపంలోనే ఉంటుంది. ఆ షేర్లను మార్కెట్ విలువకు అమ్మినప్పుడు మాత్రమే బ్యాంకు అకౌంట్లో డబ్బులు పడతాయి. ఈ లావాదేవీలతో వచ్చిన లాభంపై పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే..అనేక దేశాల్లోని అపరకుబేరులందరూ ఇలా షేర్లను అమ్మకుండా దాచి పెట్టుకుని పన్నుల నుంచి తప్పించుకుంటున్నారనే వాదన ఇటీవల అమెరికాలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇక ఎలాన్ మస్క్ కూడా..తన జీతం కింద లేదా ఇతర భత్యాల రూపంలో తన సంస్థల నుంచి పైసా కూడా పుచ్చుకోరు. ఆయన సొమ్మంతా షేర్ల రూపంలోనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. నెటిజన్లు ఏది చెబితే అది చేస్తానంటూ తేల్చి చెప్పారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. 



Updated Date - 2021-11-08T00:40:08+05:30 IST