కేబినెట్‌లో ఏలూరు ఊసేలేదు

ABN , First Publish Date - 2022-04-11T01:09:18+05:30 IST

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు మూడు మంత్రి పదవులు వరించినా కొత్తగా పునర్విభజనలో ఏర్పడిన ఏలూరుకు మాత్రం మొండి చెయ్యి చూపించారు.

కేబినెట్‌లో ఏలూరు ఊసేలేదు

ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు మూడు మంత్రి పదవులు వరించినా కొత్తగా పునర్విభజనలో ఏర్పడిన ఏలూరుకు మాత్రం మొండి చెయ్యి చూపించారు. ఇప్పటికే ఏలూరు నుంచి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆళ్ల నాని కొనసాగారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో నానితో పాటు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. చివరకు వీరి ముగ్గురిలో ఏ ఒక్కరికి చోటు దక్కకపోగా ఏలూరు జిల్లాకు మంత్రిగా ఎవరూ లేకుండా పోయారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి మెప్పు పొందేందుకు తుది వరకు అందరూ ప్రయత్నించినా చివరకు ఏ ఒక్కరికి అవకాశం దక్కకుండా పోయింది. ఏలూరులో ఆళ్ళ నానికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన వర్గీయుల్లో అసంతృప్తి నెలకొంది. మంత్రి వర్గంలో తిరిగి చోటు దక్కుతుందని భావించి నాని వర్గీయులంతా సంబరాలు చేసుకునేందుకు బాణసంచా సిద్ధం చేశారు. కాని మంత్రివర్గ జాబితాలో తమ నేత పేరు లేకపోవడంతో వీరంతా తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కూరుకు పోయారు. ఆదివారం ఉదయం నుంచి పోలవరం ఎమ్మెల్యే బాలరాజును అనేకమంది కలిసి అభినందనలతో ముంచెత్తారు. కొందరు కార్యకర్తలు సంతోషం పట్టలేక మంత్రివర్గంలో ఏ శాఖ కేటాయించబోతున్నారంటూ కూడా బాలరాజు నుంచి ఆరా తీసే ప్రయత్నం చేశారు. సుదీర్ఘకాలం పాటు పోలవరం ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచినా గిరిజన వర్గానికి చెందిన తమ నాయకుడు బాలరాజుకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడాన్ని వైసీపీ కేడర్‌ తీవ్ర అసంతృప్తికి గురైంది.

Updated Date - 2022-04-11T01:09:18+05:30 IST