చక్రం తిప్పిన పెద్దాయన

ABN , First Publish Date - 2022-06-30T05:54:01+05:30 IST

ఏలూరు కార్పొరేషన్‌ సమీపంలోని శనివారపుపేట, వెంకటాపురం, తంగెళ్లమూడి, సత్రంపాడు, చొదిమెళ్ల, పోణంగి, కొమడవోలు గ్రామాలను ఈ ఏడాది జనవరిలో విలీనం చేశారు.

చక్రం తిప్పిన పెద్దాయన

ఏలూరు కార్పొరేషన్‌లో 121 పోస్టుల సృష్టి

అనధికార నియామకాలకు సిద్ధం

ఒక్కో ఉద్యోగం రూ.3 లక్షలు.. మొత్తం రూ.3.60 కోట్లు

లక్షన్నర చొప్పున కోటీ 80 లక్షలు వసూళ్లు.. గుప్పుమన్న ఆరోపణలు

త్వరలోనే నూతన ఉద్యోగుల జాబితా విడుదల


ఒక్క ఉద్యోగిని నియమించుకోవాలన్నా నోటిఫికేషన్‌ వేయాలి. అలాంటి 121 మంది నియామకాలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్‌ లేదు. దరఖాస్తులు లేవు. అధికా రులు పరీక్షలు నిర్వహించి, ఇంటర్వ్యూలు చేయ లేదు. వీరిని డైరెక్ట్‌గా నియమించేసే ప్రక్రియకు ఏలూరు నగర పాలక సంస్థలో ఓ ‘పెద్ద’ తల తెర తీసింది. ఫైల్స్‌ చకచకా మూవ్‌ చేశారు. ఒక్కో ఉద్యోగానికి మూడు లక్షల చొప్పున మూడు కోట్ల 60 లక్షలకు బేరం కుదిర్చారట ! అడ్వాన్స్‌గా ఒక్కొక్కరి నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారన్న ఆరోపణలు ఇప్పుడు నగరంలో గుప్పుమంటున్నాయి. దీనిపై ఆంధ్రజ్యోతి పరిశీలనాత్మక కథనం.. 


(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

ఏలూరు కార్పొరేషన్‌ సమీపంలోని శనివారపుపేట,  వెంకటాపురం, తంగెళ్లమూడి, సత్రంపాడు, చొదిమెళ్ల, పోణంగి, కొమడవోలు గ్రామాలను ఈ ఏడాది జనవరిలో విలీనం చేశారు. అక్కడ పనిచేసే ఉద్యోగులను కార్పొ రేషన్‌లోకి తీసుకుంటూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. కానీ, వందలాది మందికి ఆరు నెలలుగా జీతాలు అందించలేదు. దీనిపై పలుమార్లు మేయర్‌ నూర్జహాన్‌, అప్పటి కమిషనర్‌ చంద్రశేఖర్‌ తదితరులను అడిగినా స్పందన లేదు. చివరకు ఉద్యో గులు రోడ్డెక్కడంతో జీతాలందించేందుకు నగర పాలక సంస్థ అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి జీతాలపై ప్రత్యేక తీర్మానం ప్రతిపాదించి, ఆమోదించింది. ఇంత వరకు బాగానే సాగింది. ఆ తర్వాత వ్యవహారమే రచ్చ రేపుతోంది. విలీన గ్రామాల్లో పనిచేసే 431 మంది ఉద్యోగుల్లో చాలా మంది వయో భారంతో పనిచేయలేక రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్నారని అధికారులు భావించారు. వీరి స్థానంలో నూతన నియామ కాలకు ప్రతిపాదనలు పెట్టారు. అయితే ఇవి పూర్తిగా తనకు అనుకూలంగానే జరగాలని కార్పొరేషన్‌లోని ఓ ‘పెద్ద తల’ తీర్మానం చేసి, హుకుం జారీ చేసింది. ఈ ప్రకారం.. అనుకు న్నదే తడవుగా ఉద్యోగ నియామకానికి 121 మందిని సిద్ధం చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలకు బేరం కుదిర్చి, అడ్వాన్సుగా లక్షన్నర వసూలు చేశారనే ఆరోపణలు గుప్పు మంటున్నాయి. నియామకాల జాబితా త్వరలోనే విడుదల కాబో తున్న తరుణంలో కార్పొరేషన్‌లో వాటాల కోసం కొందరు బుసలు కొడుతున్నారు. దీంతో ఆ పెద్ద మనిషి ఒక్కొక్కరికీ నచ్చజెబుతూ, బుజ్జగిస్తూ.. కథ ముందుకు నడిపిస్తున్నారు. 


మెప్మాలో ఆరుగురు ?

ఈ అనధికారిక నియామ కాల కోసం మెప్మా ఆరుగురు నూతన ఉద్యోగుల్ని సీవోలుగా చూ పించింది. వీరికి శిక్షణ ఇవ్వాలని కొందరు అధికారులు కింది స్థాయి ఉద్యోగులను ఆదేశించారు. దీంతో విషయం బయట కుపొక్కడంతో నియామకాలను ప్రశ్నిస్తూ కార్మిక సంఘాల యూనియన్‌ నాయకులు రంగంలోకి దిగారు. ఆరుగురు ఉద్యోగులను ఎలాంటి నోటిఫికేషన్‌, ఎంపిక విధానం లేకుం డా సీవోలుగా ఎలా తీసుకుంటారని అధికారులను నాయకు లు నిలదీశారు. ఇప్పటికే సీనియారిటీ క్రమంలో పలువురు ఉద్యోగులు డిగ్రీలు పూర్తి చేసి పదోన్నతులు లేక ఎదురు చూస్తున్నారని మెప్మా పీడీకి తెలిపారు. సీనియర్లను కాదని, కార్పొరేషన్‌కు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను ఎలా నియమిస్తారనే ప్రశ్నించారు. దీనిపై ఉన్నతాధికారులతో మా ట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన పీడీ ఆ ఆరుగురి నియామకాలను తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టారు. ఇప్ప టికే ఆ ఉద్యోగుల పేర్లను 121 మంది నూతన ఉద్యోగుల జాబితాలో చేర్చినట్లు యూనియన్‌ నాయకులు ఆరోపిస్తున్నా రు. ఏదైనా జాబితా విడుదల తర్వాతే ప్రశ్నిస్తామని కార్మిక సంఘం నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే పారిశుధ్య విభాగంలో కొందరిని ఇలా అనధికారికంగా చేర్చారని తెలు స్తోంది. వీటిపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు రాకుండా మస్తర్లు వేసే ఉద్యోగుల డ్యూటీలను అధికారులు తరచూ మారుస్తూ ఉంటారని ప్రచారం జరుగుతోంది. గతంలో పని చేసే వారి వివరాలను గుర్తించలేని విధంగా ఇలా చేస్తున్నా రు. పలుచోట్ల ఖాళీలు ఉన్న సంఖ్య కంటే అధికంగానే నూత న ఉద్యోగుల్ని నియమించారనే విమర్శలూ ఉన్నాయి.  


విజి‘లెన్స్‌’ పెట్టాలి

అక్రమ నియామకాలపై విజిలెన్స్‌ అధికారులు విచారణ జరిపించాలని పలువురు నాయకులు కోరుతున్నారు. నగర కార్పొరేషన్‌ పరిధిలో నానాటికీ అక్రమాలు పెరిగిపోతున్నాయని, వీటిని ఉపేక్షిస్తే కార్పొరేషన్‌కు ప్రజల్లో గౌరవ మర్యాదలు బురదలో కలిపిపోతాయని ప్రతిపక్ష, విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. పార్టీల తరఫున త్వరలోనే   విజిలెన్స్‌ అధికారులను కలిసి దర్యాప్తు చేయాలని కోరనున్నట్టు తెలిపారు. 


ఇద్దరూ కలిసే..నా

ఈ అక్రమ నియామకాల్లో మరో నియోజకవర్గ పెద్ద ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. పాము, ముంగిసల్లా ఉండే ఆ రెండు పెద్ద తలలు ఈ నియామకాల వ్యవహారంలో ఒక్కటయ్యారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. నగర పాలక సంస్థలో ఏ చిన్న వ్యవహారం జరిగినా నోరెత్తే ఆయన నియామకాలపై పెదవి విప్పకపోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. 

Updated Date - 2022-06-30T05:54:01+05:30 IST