నెత్తిన పెద్ద గుదిబండగా విద్యుత్ ఛార్జీలు

ABN , First Publish Date - 2021-09-13T22:17:22+05:30 IST

రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలతో ప్రజల నెత్తిన పెద్ద గుదిబండ పెట్టినట్లుగా

నెత్తిన పెద్ద గుదిబండగా విద్యుత్ ఛార్జీలు

జంగారెడ్డిగూడెం: రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలతో ప్రజల నెత్తిన పెద్ద గుదిబండ పెట్టినట్లుగా ఉందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జెట్టి గురునాధరావు అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ సోమవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ, ఏలూరు సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ కార్యాలయంలో సూపరింటెండింట్ ఇంజనీర్‌కు డీసీసీ అధ్యక్షుడు జెట్టి గురునాధరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు రాజనల రామ మోహన్ రావు వినతిపత్రం అందజేశారు. అనంతరం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఎస్ఇ ఆఫీస్ ఎదుట నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేసినప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచనని, పెంచిన చార్జీలు తగ్గిస్తానని వాగ్దానం చేశారన్నారు.


ప్రజలను నమ్మించి  అధికారంలోకి వచ్చిన తర్వాత  ట్రూఆప్ సర్దుబాటు చార్జీల పేరిట సుమారు 3,669 కోట్ల రూపాయలను ప్రజల వద్ద నుంచి వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 2020లో రెండుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్నారు.  దీంతో ప్రజలపై 2800 కోట్ల భారం పడిందన్నారు. 2021 ఏప్రిల్‌లో కొత్త టారిఫ్ ఆర్డర్‌తో 2,600 కోట్లు అదనపు ఆర్థిక భారం, ప్రజలపై ఇప్పుడు సర్దుబాటు చార్జీల పేరుతో కలిపి సుమారు 900 కోట్ల రూపాయల భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రజల నెత్తిన పెద్ద గుదిబండ పెట్టినట్లుగా ఉందన్నారు. వెంటనే విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 




అనంతరం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు  మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్  పన్నుల రూపంలో ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. దీంతో అధిక ఛార్జీలతో ప్రజలు సతమతమవుతున్నారని ఆయన ఆరోపించారు. దీనికి తోడు విద్యుత్ చార్జీలు పెంచటం ప్రజలపై పెనుభారం అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


కార్యక్రమంలో ఏలూరు రూరల్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పు మురళి కృష్ణ, గౌడ రంగబాబు, మిద్దె వెంకటేశ్వరరావు, వేల్పుల వెంకటేశ్వర రావు, నల్లగట్ల మాణిక్యాలరావు సేవాదళ్ సుబ్బారావు మీడియో కోఆర్డినేటర్ సతీష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్ ముప్పిడి శ్రీనివాసరావు, నులకాని నాగబాబు, శీలం రాజు, జీడి కంటి రామారావు, మద్దిపాటి శ్రీను, భగవాన్, జ మీరు, దున్న శివ, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-13T22:17:22+05:30 IST