మూర్తీభవించిన సంస్కారం

Dec 8 2021 @ 00:40AM

రోశయ్య గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులలోనే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉదయం ఏడు గంటలకు ఒక టివి ఛానెల్‌ ఆయనతో ఒక ప్రత్యక్ష చర్చను నిర్వహించింది. ఆ చర్చలో పాల్గొన్నప్పుడు ‘మీరు పాతకాలపు నాయకులు కదా, ప్రస్తుత రాజకీయాలలో మాఫియా ప్రభావం చాలా పెరిగింది దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు’ అని అడిగాను. ‘హరగోపాల్‌ గారు, ఈ మాఫియా సంస్కృతి ఒక్కరోజులో వచ్చింది కాదు, ఇది రెండు దశాబ్దాలుగా క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. నేను ఎంతకాలం ఈ పదవిలో ఉంటానో తెలియదు, కొంతకాలం కొనసాగితే దానిని మార్చడానికి నావంతు కృషి చేస్తాను’ అని చాలా గౌరవంగా సమాధానం చెప్పారు. నేను ఇంటికి తిరిగి వస్తూనే ఒక ఎనిమిది, పదిమంది మాఫియా లాంటివారే మా ఇంటికి వచ్చారు. ఏం పనిమీద వచ్చారు అని అడిగితే ముఖ్యమంత్రినే ఆ ప్రశ్న అడిగిన మిమ్మల్ని చూడడానికి వచ్చాం అని అన్నారు.


మరో సందర్భంలో కేసీఆర్‌ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు పొత్తూరి వెంకటేశ్వరరావు, డాక్టర్‌ గోపాల్‌కిషన్‌, చుక్కా రామయ్య, నేను రోశయ్యను కలిశాం. మీరు కేసిఆర్‌ను కలిస్తే బావుంటుంది అని పొత్తూరి సలహా ఇస్తే, ‘నేను వెళ్తే ఆయన కలవడానికి నిరాకరిస్తే ముఖ్యమంత్రి పదవికి అవమానకరంగా ఉంటుంది’ అన్నారు. దానికి బదులుగా పొత్తూరి, ‘మీకెందుకు అవమానంగా ఉంటుంది. మీరు చేసే ఈ ప్రయత్నాన్ని ప్రజలు హర్షిస్తారు’ అనడంతో వెళ్తానని అన్నారు. సలహాను గౌరవించే ఒక సంస్కారం ఆయనలో కనిపించింది.


మరో సందర్భంలో రవీంద్రభారతిలో ప్రభుత్వ ఎన్‌జిఒ నిర్వహించిన సభలో నేను ఆయన పక్కనే కూచున్నప్పుడు, ‘హరగోపాల్‌ గారూ చూసారా మా పార్టీకి సంబంధించిన వాళ్లు ఎవ్వరూ రాలేదు. ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయి ఉంటే ఆయన కళ్లల్లో పడాలని గుంపులు గుంపులుగా వచ్చేవారు’ అని వాపోయారు. సభలో మాట్లాడినప్పుడు మీడియానుద్దేశించి, ‘వేదిక మీద ఎవరైనా ఏ కారణం వల్లనైనా చేతులు పైకి లేపితే రోశయ్య గారిని కొట్టబోతున్న దృశ్యమని మీరు రేపు పత్రికల్లో రాస్తే ఏం చేయగలను’ అని చురకలు వేశారు.


రోశయ్య ముఖ్యమంత్రిగా తాను బలహీనుడిననే భావించారు కాని పదవిలో ఉన్నంతకాలం చాలా హుందాగానే పనిచేశారు. తెలంగాణ ఉద్యమం విస్తృతంగా జరగడానికి ఆయన ఉదారదృక్పథం కూడా కొంతవరకు తోడ్పడింది.


రోశయ్యనే కాకుండా పౌరహక్కుల ఉద్యమంలో భాగంగా నాకు తెలిసి ఎన్‌టిఆర్‌ మొదలుకుని కిరణ్‌కుమార్‌ రెడ్డి దాకా ప్రతి ముఖ్యమంత్రిని ఏవో ప్రజల సమస్యలు చర్చించడానికి కలవాల్సి వచ్చేది. ముఖ్యమంత్రిని కలవాలనే ఒత్తిడి ప్రజల నుంచి ప్రజాసంఘాల నుంచి ఉండేది. కొన్ని సందర్భాల్లో సమస్యలు పరిష్కారమయ్యేవి మరికొన్ని సందర్భాల్లో అలాగే ఉండిపోయేవి. కానీ కలిసిన ప్రతి ముఖ్యమంత్రి సమయం ఇచ్చేవారు, చాలా గౌరవించి మాట్లాడేవారు రోశయ్య కూడా ఆ సంస్కృతిని కొనసాగించారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉండేవారు ప్రజాసంఘాలను, ప్రజాస్వామ్యవాదులను కలవడం చాలా అవసరం. వాళ్లెవరూ తమ వ్యక్తిగత సమస్యలను చర్చించరు, చర్చించకూడదు కూడ. నాయకులు ప్రజలను ప్రత్యక్షంగా కలిస్తే, వాళ్ల సమస్యలకు సానుకూలంగా స్పందిస్తే ప్రజాస్వామ్య సంస్కృతి సుసంపన్నమవుతుంది.

ప్రొ. జి. హరగోపాల్‌

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.