సినిమాలో శృంగారం ఓ భాగం... అంతే! శృంగార చిత్రాల్లో నటించే తారల జీవితాల్లో? ఆ చిత్రాలూ ఓ భాగమంతే! అవే జీవితం కాదు!ఎందుకంటే .. వెండితెరపై కనిపించేదంతా నిజం కాదు! శృంగార తారల వెండితెర జీవితం వెనుక విషాద గమనాలు, గమకములు ఎన్నో ఎన్నెనో!ఆ తెర వెనుక జీవితాలను తెర మీదకు తెస్తే? శృంగార తారల భావోద్వేగమాయే... బాక్సాఫీస్ దగ్గర కాసులు గలగలలాడే!
షకీలా... దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు! మలయాళ ప్రేక్షకులకు మహా సుపరిచితురాలు. ఒకానొక సమయంలో మలయాళ చిత్ర పరిశ్రమలో షకీలా చిత్రాలు విడుదల అవుతున్నాయంటే... అక్కడి అగ్ర కథానాయకులు సైతం ఆందోళన చెందిన సందర్భాలు ఉన్నాయని చిత్రసీమ వర్గాలు చెబుతుంటాయి. శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన షకీలా జీవితం ఆధారంగా తెరకెక్కిన హిందీ సినిమా ‘షకీలా’. టైటిల్ పాత్రలో రిచా చద్దా నటించారు. క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ వెండితెరకెక్కిన శృంగార తారల జీవితాలెన్ని? తెరకెక్కితే బావుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నవి ఎన్ని? అసలు, శృంగార తారల జీవిత చిత్రాలు (బయోపిక్స్) వస్తున్న నేపథ్యంలో వచ్చిన వివాదాలేమిటి?
‘ద డర్టీ పిక్చర్’... దుమ్ము దులిపింది!
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘ద డర్టీ పిక్చర్’. నటిగా విద్యా బాలన్‌కు పేరొచ్చింది. నిర్మాతగా ఏక్తా కపూర్‌కు నిర్మాణ వ్యయం కంటే ఎన్నోరెట్లు లాభాలు తెచ్చి పెట్టింది. ఓ హీరోతో సిల్క్ స్మిత సహ జీవనం, తర్వాత గొడవలు వంటివి చిత్రంలో చూపించారు. సిల్క్ పాత్ర కోసం విద్యా బాలన్ 12 కిలోల బరువు పెరిగారు. సన్నివేశాల్లో లీనమై నటించారు. ప్రోస్థెటిక్ మేకప్ వలన నాలుగైదు గంటలు ఏమీ తినకపోవడంతో సెట్లో స్పృహ తప్పిపడ్డారు. అందుకు తగ్గ ఫలితం లభించింది. అయితే, ఈ విజయాన్ని పక్కన పెడితే... వివాదాలూ అదే స్థాయిలో వచ్చాయి. ‘ద డర్టీ పిక్చర్’ మీద సిల్క్ స్మిత సొదరుడు, ఆమె బంధువులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో సినిమా పోస్టర్ అభ్యంతరకరంగా ఉందని ఒకరు కేసు కూడా పెట్టారు. ‘ఖతార్’లో ఈ సినిమాపై నిషేధం విధించారు. టీవీలో చిత్రాన్ని ప్రదర్శించే విషయంలోనూ కొంత వాగ్వాదాలు జరిగాయి.
బయోపిక్‌లోనూ సన్నీయే!
నీలి చిత్రాల్లో నటించిన చరిత్ర శృంగార తార సన్నీ లియోన్‌ది! వాటిని వదిలేసి హిందీ చిత్రసీమకి వచ్చారు. అయితే... గతం ఆమెను వదల్లేదు. ఈ నేపథ్యంలో సిఖ్ కుటుంబంలో జన్మించిన కరణ్‌జిత్ కౌర్ నీలి చిత్రాల ప్రపంచంలోకి ఎలా వెళ్లింది? పోర్న్‌స్టార్ సన్నీ లియోన్‌గా ఎందుకు మారింది? అక్కడి నుంచి నటిగా బాలీవుడ్‌కి ఎలా వచ్చింది? వ్యక్తిగత జీవితంలో తల్లితండ్రుల మరణం ఆమెపై ఏ విధమైన ప్రభావం చూపింది?. ఈ విధంగా సన్నీ లియోన్ ప్రయాణాన్ని ‘కరణ్‌జిత్ కౌర్ - ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్’ పేరుతో వెబ్ సిరీస్‌గా చేశారు. రెండు సీజన్లు వచ్చాయి. విశేషం ఏంటంటే... బయోగ్రఫీలో సన్నీ లియోన్‌గా సన్నీయే నటించడం! ఈ వెబ్ సిరీస్ టైటిల్లో ‘కౌర్’ పదాన్ని ఉపయోగించడంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
షకీలా వర్సెస్ షకీలా!
మలయాళంలో ఒకప్పుడు షకీలా సినిమాలు విడుదలైన సమయాల్లో గొడవలు జరిగేవట! ఈ ఏడాది షకీలా బయోపిక్ రైట్స్ విషయంలో గొడవ జరిగింది. రిచా చద్దా ప్రధాన పాత్రలో కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ ‘షకీలా’ తీశారు. ఇది హిందీ సినిమా. మలయాళంలో సరయు ప్రధాన పాత్రలో ‘షకీలా’ టైటిల్‌తో జూన్‌లో ఓ టీజర్ విడుదలైంది. దాంతో రైట్స్ ఎవరివి? అనే చర్చ మొదలైంది. చివరికి మలయాళ ‘షకీలా’ షార్ట్ ఫిల్మ్ అని తేలింది. అది యూట్యూబ్‌లోనూ విడుదలైంది. టైటిల్ తప్ప దానికి, షకీలా జీవితానికి ఎటువంటి సంబంధం లేదు. దాంతో ఇప్పుడు క్రిస్మస్కి వస్తున్న రిచా చద్దా ‘షకీలా’లో ఏం చూపిస్తారోననే ఆసక్తి మొదలైంది. మలయాళ హీరోల ప్రస్తావన ఉంటుందా? లేదా? అనేది మరింత ఆసక్తి పెంచుతున్న అంశం!
‘శ్రీదేవి బంగ్లా’లో ఏముంది?
శ్రీదేవి అతిలోక సుందరి. ఆమె శృంగార తార కాదు. ఆమె జీవితంపై బయోపిక్ రాలేదు. కానీ, ‘శ్రీదేవి బంగ్లా’లో ఏముంది? - అనే ప్రశ్న ప్రేక్షక లోకం మదిలో ఉంది. ఎందుకంటే... బాత్‌టబ్‌లో పడి మరణించిన ఓ కథానాయిక శ్రీదేవిగా టీజర్లో ప్రియా ప్రకాశ్ వారియర్‌ను చూపించడంతో ‘శ్రీదేవి బంగ్లా’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. శ్రీదేవి మరణంపై కొందరిలో అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో, వాటికి ఆజ్యం పోసేలా టీజర్ ఉందనే మాటలు వినిపించాయి. తర్వాత ట్రైలర్లో ‘పాలసీలో నామినీగా ఎవరి పేరు ఉంది’ డైలాగ్ అనుమానాలను మరింత పెంచేలా ఉంది. దీనిని అనధికారిక శ్రీదేవి బయోపిక్‌గా కొందరు చూస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ‘శ్రీదేవి బంగ్లా’పై బోనీ కపూర్ కుటుంబం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. రాణీ ముఖర్జీ లేదా బిపాసా బసు ప్రధాన పాత్రధారిగా రేఖ బయోపిక్ తెరకెక్కిండానికి సుమారు పదేళ్ల క్రితం సన్నాహాలు జరిగాయి. కానీ, ఎందుకో ఆ ప్రయత్నం మధ్యలో ఆగింది. తెలుగులో కథానాయిక సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన ‘మహానటి’ మంచి విజయం సాధించింది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా కథానాయిక, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ‘తలైవి’గా తెరకెక్కిస్తున్నారు. సినిమా కథానాయికలు, శృంగార తారల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రేక్షకులు అనుకుంటారు. అందువల్ల, బయోపిక్స్‌కి మంచి ఆదరణ దక్కుతోంది.