ఉద్యోగుల గుండె‘కోత’

ABN , First Publish Date - 2022-01-19T07:00:17+05:30 IST

ఉద్యోగుల గుండె‘కోత’

ఉద్యోగుల గుండె‘కోత’

రివర్స్‌ పీఆర్సీపై ఆగ్రహం.. ఆందోళనలకు సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు

నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌ మోసమని మండిపాటు

ఈ జీవోలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

నల్ల బ్యాడ్జీలతో నిరసనలు.. జీవో ప్రతుల దహనం

రెండు రోజుల్లో ఉద్యమ కార్యాచరణ.. సమ్మెకైనా సిద్ధం

ఉద్యోగ, ఉపాధ్యాయుల హెచ్చరిక



(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

‘రివర్స్‌ పీఆర్సీ’పై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు భగ్గుమన్నారు.  ఇప్పటికే ఐఆర్‌కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ప్రకటించడంపై రగులుతున్న ఉద్యోగులు... హెచ్‌ఆర్‌ఏకు కోత, సీసీఏ ఎత్తివేత, క్వాంటమ్‌ పెన్షన్‌లో మార్పులు చేస్తూ జారీ అయిన ‘చీకటి’ జీవోలను అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. చరిత్రలోనే ఇలాంటి దుర్మార్గమైన పీఆర్సీని తాము చూడలేదని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే రెండు రోజుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీలు, పలు ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్త సమ్మెకు కూడా వెనుకాడబోమని తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా, తాలుకా, మండల కేంద్రాల్లో పీఆర్సీ జీవో ప్రతులను తగలబెట్టారు. 


20న కలెక్టరేట్ల ముట్టడి, 28న చలో విజయవాడ: ఫ్యాప్టో

ఫిట్‌మెంట్‌పై పునరాలోచన చేయాలని, హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబులు కొనసాగించాలని, ఉద్యోగుల ప్రయోజనాలను హరించేలా ఇచ్చిన జీవోలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ 20న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాల్లో ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) చైర్మన్‌ సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు, సెక్రటరీ జనరల్‌ చేబ్రోలు శరత్‌ చంద్ర, కోచైర్మన్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు మంగళవారం పిలుపునిచ్చారు. 28న నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కాగా ఫ్యాప్టో ఉద్యమాలకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్స్‌ స్కీం ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.అప్పలరాజు, కె.పార్థసారథి తెలిపారు. రివర్స్‌ పీఆర్‌సీ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసే ఉద్యమానికి సంపూర్ణ మద్దతిస్తామని పేర్కొన్నారు. పీఆర్‌సీలో హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు ఉపసంహరించుకోకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని వైఎస్సార్‌ టీఎఫ్‌ ప్రకటించింది. ఫిట్‌మెంట్‌ 27 శాతం చేయాలని, పీఆర్‌సీ ఐదేళ్లకోసారి వేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ జోవోలు రద్దు చేయాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు భూపతిరాజు రవీంద్రరాజు, ఎం.అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. 


ఉద్యమమే శరణ్యం: ప్రభుత్వోద్యోగుల సంఘం

ఉద్యోగుల ప్రయోజనాలను కాలరాసే జీవోల జారీ నేపథ్యంలో.. ఇక ఉద్యమమే శరణ్యమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు అన్నారు. కార్మిక సంఘాల నియమావళి ప్రకారం సమ్మె నోటీసుకనీసం 15 రోజులు ముందే ఇవ్వాలని, అంత సమయం లేదు కాబట్టి తక్షణం ఉద్యమానికి శ్రీకారంచుట్టాల్సిన అవసరం ఉందన్నారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు బుధవారం విజయవాడలో అత్యవసరంగా సమావేశం అవుతున్నామని, ఈ సందర్భంగా ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈలోగా ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పీఆర్సీని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఏపీఎ్‌సఆర్‌టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు లేవని, ప్రభుత్వం జారీచేసిన జీవోల వల్ల ఉద్యోగులకు ఒనగూరిన ప్రయోజనాలు కూడా శూన్యమని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు వైవీ రావు అన్నా రు. ప్రభుత్వం తీరు మారాలన్నా, ఉద్యోగులకు ప్రయోజనాలు కలగాలన్నా సమ్మె చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. 


జిల్లాల్లో నిరసనల సెగ..

పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయు లు ఉద్యమించారు. పాత హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లను కొనసాగించి, ఫిట్‌మెంట్‌ను కనీసం 30 శాతానికి పెంచకపోతే 2024 ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ కార్యాలయాల ముందు పీఆర్సీ నివేదిక ప్రతులను దహనం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులను నట్టేట ముంచిందని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. రివర్స్‌ పీఆర్సీ వద్దే వద్దంటూ కడప జిల్లాలో ఉపాధ్యాయ సంఘ నేతలు నిరసన తెలిపారు. అనంతపురం జిల్లాలో 800కిపైగా స్కూళ్లలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 


జగన్‌ పీఆర్సీ.. రాజ్యాంగ విరుద్ధమే!

సీఎస్‌ కమిటీ చట్టంముందు నిలవదు!: ఉద్యోగులు

జగన్‌ ప్రభుత్వం తమకిచ్చిన పీఆర్‌సీ రాజ్యాంగ విరుద్ధమేనని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడి రాష్ట్రంలో ఆర్టికల్‌ 360 అమల్లోకి వచ్చినప్పుడు మాత్రమే జీతాలు తగ్గించాలని స్పష్టంగా ఉందని చెబుతున్నారు. అయినా వేతనాలు కూడా ఇవ్వకుండా.. ఖజానాకు వచ్చే డబ్బులన్నిటినీ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలను జగన్‌ పెద్ద మిస్టరీగా మార్చారని ఆరోపిస్తున్నారు. చట్టబద్ధత ఉన్న పీఆర్‌సీ నివేదికను పక్కనపడేసి.. ఒక జీవో ద్వారా తమ వేతనాలు తగ్గించడం చట్టపరంగా చెల్లుబాటు కాదని వాదిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా దానికి చట్టసభల ఆ మోదం కావాలని.. అలాంటి ఆమోదాలేవీ లేకుండానే ఏర్పాటైన సీఎస్‌ కమిటీ చేసిన సిఫారసులకు ఎలాంటి విలువా ఉండబోదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. వేతన సవరణ కమిషన్‌ విధానాన్ని ఆపేసి, కొత్తగా సీఎస్‌ కమిటీని అమల్లోకి తేవడానికి కూడా చట్ట సభల ఆమోదం తప్పనిసరని.. అందుచేత సీఎస్‌ కమిటీ అనేది చట్టం ముందు నిలవబోదని అంటున్నారు.

Updated Date - 2022-01-19T07:00:17+05:30 IST