అతడి నెల జీతం రూ.43 వేలు.. పొరపాటున రూ.1.4 కోట్లు అకౌంట్లోకి వేసిన కంపెనీ.. రిజైన్ చేసి షాకిచ్చిన ఉద్యోగి..!

ABN , First Publish Date - 2022-06-30T13:29:47+05:30 IST

మన ఎకౌంట్ లోకి భారీ మొత్తం జమైందని కల వచ్చిందనుకోండి.. రోజూ వచ్చే బోరింగ్ మెసేజ్ లతో పాటు మన బ్యాంక్ ఖాతాకు రావాల్సిన జీతం కంటే చాలా ఎక్కువ మొత్తం వచ్చి చేరిందనే అనుకోండి..

అతడి నెల జీతం రూ.43 వేలు.. పొరపాటున రూ.1.4 కోట్లు అకౌంట్లోకి వేసిన కంపెనీ.. రిజైన్ చేసి షాకిచ్చిన ఉద్యోగి..!

సాధారణంగా రోజూ మనకు పలు కంపెనీల నుంచి పదుల సంఖ్యలో మెసేజ్‌లు వస్తూ మనకు చిరాకు తెప్పిస్తాయి. రోజూ వచ్చే బోరింగ్ మెసేజ్‌లతో పాటు.. రావాల్సిన జీతం కంటే భారీ మొత్తంలో డబ్బు మన బ్యాంకు ఖాతాలో జమైనట్టు ఫోన్‌కు సందేశం వస్తే.. అంత అద్భుతం మన జీవితంలో జరిగినందుకు ముందు నమ్మలేకపోయినా తర్వాత మళ్ళీ మళ్ళీ మెసేజ్ ను చూసుకుని ఆశ్చర్యపోతాం. ఆ తర్వాత నిజమే అని నిర్ధారించుకుంటాం. ఆ ఇదంతా నిజ జీవితంలో ఎక్కడ జరుగుతుందని కొట్టిపారేయకండీ. నెల జీతానికి పని చేసే ఓ ఉద్యోగి జీవితంలో ఇదే జరిగింది. దీంతో సదరు ఉద్యోగి తన జాబ్‌కు రిజైన్ చేసి.. సంస్థకు షాకిచ్చాడు. అసలు విషయం ఏంటంటే..


ఓ సదరు ఉద్యోగి జీవితంలో అలాంటి సంఘటనే నిజమైంది.. జీతం పడిందని ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను చెక్ చేసుకున్న అతనికి షాక్ తగిలింది.. ఆ మెసేజ్ చూడగానే నమ్మలేనట్టు వెనక్కు వెళ్ళి సున్నాలన్నీ మళ్లీ మళ్లీ లెక్కచూసుకుని అవాక్కయ్యాడు. నమ్మలేకపోయాడు. ఒకటికి నాలుగు సార్లు బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకున్నాడు. చివరకు అది నిజమేనని నిర్ధారించుకున్న తర్వాత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. కారణం.. తనకు రావాల్సిన నెల జీతం రూ. 43 వేల రూపాయలు అయితే.. ఏకంగా రూ. 1.42 కోట్లు బ్యాంకు ఖాతాలో జమయింది. 


దక్షిణ అమెరికా ఖండంలో చిలీ దేశం కన్సార్సియో ఇండస్ట్రియల్‌ డే అలిమెంటోస్‌ అనే ప్రముఖ మైనింగ్‌ సంస్థ లో నెలకు రూ. 43 వేల రూపాయల జీతానికి ఓ ఉద్యోగి పనిచేస్తున్నాడు. అయితే అకౌంట్స్‌ విభాగం లో జరిగిన చిన్న పొరపాటు కారణంగా మే నెలకు సంబంధించి అతడి ఖాతాలో  జీతానికి బదులుగా రూ.1.42 కోట్లు జమ అయ్యాయి. ప్రతీ నెలా తనకు రావాల్సిన జీతం కంటే ఎన్నో ఎక్కువ రెట్లు తన బ్యాంక్ లో జమ కావడంతో ఒక్కసారిగా ఆ ఉద్యోగి షాక్  అయ్యాడు. వెంటనే అకౌంట్స్‌ విభాగానికి తనకు 286 రెట్లు అధికంగా జీతం పడిందంటూ నిజాయితీగా తెలియపరిచాడు. రికార్డులు చెక్ చేసిన అకౌంట్స్‌ విభాగం తప్పును గుర్తించింది. అధికంగా జమ అయిన సొమ్మును వెంటనే కంపెనీ ఖాతాకు పంపాలంటూ కోరింది.


అంత డబ్బు ఊరికే ఖాతాలోకి వచ్చి చేరడంతో అప్పటివరకూ అతడిలో ఉన్న నిజాయితీ కాస్తా పక్కదారి పట్టేసింది. అసలు ఎందుకు డబ్బు తిరిగి కంపెనీకి ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేసేసాడు. రెండు రోజులైనా ఆ ఉద్యోగి తిరిగి ఇవ్వాల్సిన డబ్బు ఆ కంపెనీ ఖాతాలో మళ్లీ జమ కాలేదు. దీంతో మరోసారి సదరు ఉద్యోగితో టచ్‌లోకి వెళ్లేందుకు అకౌంట్స్ సిబ్బంది ప్రయత్నించారు. కానీ ఫోన్‌, మెసేజ్‌లకు అతను అందుబాటులోకి రాలేదు. ఇంటికి వెళ్లి చూడగా అతను అక్కడ లేడని తెలిసింది. మరోవైపు ఆఫీసుకు తన రిజైన్‌ లెటర్‌ కూడా పంపేసాడు. చేసేది లేక ఆ ఉద్యోగి తిరిగి ఇవ్వాల్సిన మొత్తాన్ని తమ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయలేదనీ, సిబ్బంది పొరపాటు వల్ల ఖాతాలో జమ అయిన డబ్బుతో అతగాడు ఉడాయించాడని ఆ కంపెనీ గ్రహించింది. దీంతో డబ్బును రికవరీ చేయడానికి ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది. అతడిపై కేసు పెట్టి న్యాయపోరాటం చేస్తోంది. చూడాలి మరి.. ఆ డబ్బు తిరిగి ఆ కంపెనీకి మళ్లీ వస్తుందో లేదో అన్నది.. 

Updated Date - 2022-06-30T13:29:47+05:30 IST