అంతా ‘బ్లాక్‌’

Dec 7 2021 @ 23:50PM
కలెక్టరేట్‌లోని ట్రెజరీ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

అన్ని వర్గాలలో పెల్లుబికిన అసంతృప్తి సెగ

50 శాఖలకు పైగా ఉద్యమ బాట

ఏలూరు, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): నివురుగప్పిన నిప్పులా వున్న ఉద్యోగులు గళం విప్పారు. ఏ కార్యాలయంలో చూసినా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చా లని, తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని మంగళవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి తలపెట్టిన ఉద్యమానికి జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. అన్ని వర్గాల ఉద్యోగుల్లో రెండున్నరేళ్లుగా నెలకొన్న అసంతృప్తి తారస్థాయికి చేరిందన్న సంకేతాలు నిరసన మొదటి రోజే బహిర్గతమయ్యాయి. క్షేత్రస్థాయి ఉద్యోగులు సహా జిల్లా స్థాయి అధికారుల వరకూ అన్నిస్థాయిల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. కలెక్టరేట్‌కు సైతం నిరసన సెగలు తప్పలేదు. కలెక్టర్‌, జేసీలు మినహా మిగిలిన అధికారులందరూ ఆందోళనలో భాగస్వామ్యమయ్యారు. 


అన్ని వర్గాల ఉద్యోగులు ఒక్కటై

పీఆర్‌సీ నివేదిక విడుదల చేసి తక్షణం అమలు చేయాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని, పెండింగులో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, పక్కదారి పట్టించిన జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ నిధులు రూ. 1600 కోట్లను వెంటనే సమకూర్చాలని, వైద్య శాఖలో జీవో 64, 143 రద్దు చేసి, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా పరిగణించాలని, ఆర్‌టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రావాల్సిన రాయితీలు, హక్కులు కల్పించాలని, విద్యా శాఖలో ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలని, ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని, పెండింగులో వున్న వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగు ఉద్యోగులు, సకాలంలో పింఛను ఇవ్వాలని పెన్షనర్లు.. ఇలా జిల్లాలోని అన్నివర్గాల ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. ఏలూరులో నగరపాలక సంస్థ తాగునీటి సరఫరా ఉద్యోగులు తెల్లవారు జామునే నల్ల బ్యాడ్జీలు ధరించి పంపుల చెరువు దగ్గర విధులకు హాజరయ్యారు. ఏలూరు పీటీడీ డిపో దగ్గర ఆర్టీసీ ఉద్యోగులు, కలెక్టరేట్‌లో ట్రెజరీ ఉద్యోగులు సహా పలు శాఖల ఉద్యోగులు, ఏలూరు సహా మున్సిపల్‌ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, డీఈవో కార్యాలయం, అన్ని ఎంఈవో కార్యాలయాలు జిల్లాలోని ఎనిమిది సబ్‌ ట్రెజరీ కార్యాలయాలు, అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాల యాలు, 8 ఆర్టీసీ డిపోలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని 18 సీడీపీవో కార్యాలయాలు, ఏలూరు జిల్లా ఆసుపత్రి సహా అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రా లు, పే అండ్‌ అకౌంట్స్‌, సేల్స్‌ ట్యాక్స్‌, కమర్షియల్‌ టాక్స్‌, సాంఘిక సంక్షేమ శాఖ, ఫిషరీస్‌, జడ్పీ అట వీ శాఖ, ఐటీఐ, వయోజన విద్య, కార్మిక శాఖ, ఎక్సైజ్‌, రవాణా, దేవదాయ శాఖ కార్యాలయాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు ఎగశాయి. వీరితోపాటు ప్రభుత్వరంగ సంస్థలైన అగ్రోస్‌, నెడ్‌కాప్‌, హౌసింగ్‌ సంస్థలతోపాటు మిగిలిన విభాగాల ఉద్యోగులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని న్యాయమైన డిమాండ్లు తీర్చాలని నినాదాలు చేశారు. 

 

గ్రామాల్లో సైతం సెగలు

వైద్య, ఆరోగ్య శాఖల సిబ్బంది ఆందోళనలో భాగం కావడంతో గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం నిరసన ప్రభావం కనిపించింది. ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌, పండిత పరిషత్‌, పీఆర్‌టీయూ, హెడ్‌ మాస్టర్స్‌ అసోసియేషన్‌ సంఘాల పిలుపు మేరకు ఉపాధ్యాయులందరూ ఒక్కతాటిపైకి రావడంతో గ్రామాల్లోను నిరసన వాతావరణం కనిపించింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. పెద వేగి, అనంతపల్లి, చాగల్లు, చింతలపూడి, పెనుమంట్ర, నిడదవోలు సహా అనేక గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది ఆందోళనలో పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది జిల్లాలోవున్న 128 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 

ఇదీ ఉద్యమ కార్యాచరణ

 ఏడో తేదీ నుంచి తొమ్మిది వరకు ఉద్యో గులందరూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు

 10వ తేదీ మధ్యాహ్న భోజన సమ యంలో ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ డిపోల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన

 13న తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు, ప్రద ర్శనలు, సమావేశాల నిర్వహణ

 16వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ధర్నాలు

 21వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఏలూరులో ధర్నా

 జనవరి 3వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఏలూరులో ప్రాంతీయసదస్సుముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి

హరనాథ్‌, పే అండ్‌ అకౌంట్స్‌ సంఘం రాష్ట్ర అధ ్యక్షుడు 

ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని చూసి ఉద్యోగులంతా ప్రభుత్వానికి ఎంతో సహకరించారు. వేతనాలు, పెన్షన్‌లు వారాలకు వారాలు ఆలస్యమైనా ప్రభుత్వాన్ని నిలదీయలేదు. ప్రభుత్వం తీరుతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఉద్యోగులకు న్యాయబద్దంగా రావాల్సిన ప్రయోజనాలను సకాలంలో కల్పించకపోగా రిటైర్డ్‌ ఉద్యోగులకు అందాల్సిన వీటిని దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ నిధులు 1600 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించింది. తక్షణం వీటిని చెల్లించాలి. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని సత్వరమే సమస్య పరిష్కరించాలి. 

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి 

– సీహెచ్‌ శ్రీనివాస్‌, ఇరిగేషన్‌ ఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు

ఏళ్ల తరబడి చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదు. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బం దికి రావాల్సిన ప్రయోజనాలను నిలిపివేశారు. డీఏలు ఆపేశారు. పీఆర్‌సీ నివేదికలను బయటపెట్టడం లేదు. ఇలాంటి తీరు కారణంగా ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఉద్యమించక తప్పని పరిస్థితిని ప్రభుత్వమే కల్పించింది. 


ప్రాణాలకు తెగించి పనిచేశారు

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌  అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమోహన్‌

భీమవరం, డిసెంబరు 7 : మున్సిపాలిటీలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మునిసిపల్‌ ఉద్యోగులు ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమోహన్‌ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఉద్యోగులు ప్రాణాలకు తెగించి పనిచేశారన్నారు. త్వరలో పదవీ విరమణ కాబోతున్న చాలా మంది ఉద్యోగులకు నష్టం కలగకుండా చూడాలన్నారు. సచివాలయ సిబ్బంది రెండేళ్లపాటు సర్వీసు పూర్తిచేసుకున్న నేపథ్యంలో స్కేల్‌ ఆ్‌ఫ్‌ పేలోకి తీసుకురావాలి.మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల సబార్డినేట్‌ సర్వీసెస్‌  ఉద్యోగులకు పేస్కేల్‌లో ఉన్న వ్యత్యాసాలను తొలగించి సూరింటెండెంట్‌ స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎఐ పాషా, భీమవరం జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు వేండ్ర ప్రసాద్‌, డి.మావుళ్ళు, జి.మురళీధరరావు, అశోక్‌, రాజేంద్రకుమార్‌ పాల్గొన్నారు. 


భీమవరం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగులు


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.