బల ప్రదర్శనగా ఉద్యోగుల 'ఛలో విజయవాడ' : సజ్జల

ABN , First Publish Date - 2022-02-04T00:48:16+05:30 IST

ఉద్యోగుల 'ఛలో విజయవాడ' కార్యక్రమం బల ప్రదర్శనగానే ఉందని ప్రభుత్వ సలహాదారుడు

బల ప్రదర్శనగా ఉద్యోగుల 'ఛలో విజయవాడ' : సజ్జల

అమరావతి: ఉద్యోగుల 'ఛలో విజయవాడ' కార్యక్రమం బల ప్రదర్శనగానే ఉందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులు సమస్యను మరింత జఠిలం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎంతవరకు చేయగలదో అంతవరకు చేశామన్నారు. ఉద్యోగులను అనేకసార్లు చర్చలకు పిలిచామని, వారు రాలేదన్నారు. ఈ రోజు ర్యాలీలో ఎక్కువ మంది ఉపాధ్యాయులే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులతో చర్చలకు ద్వారాలు ఎప్పుడూ తెరచే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సభలో ఉద్యోగ సంఘాల నేతల ఉపన్యాసాలు పరిస్థితిని మరింత జఠిలం చేసేందుకు ఉపకరిస్తాయన్నారు. కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా మంచి పీఆర్సీ ఇచ్చామన్నారు. ఉన్న పరిస్థితుల్లో ది బెస్ట్ పీఆర్సీ ఇచ్చామన్నారు.  గత రెండున్నర ఏళ్లలో ఉద్యోగులకు లబ్ది సహా ఉద్యోగ భద్రత కల్పించామని ఆయన పేర్కొన్నారు. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టి మెరుగ్గా వేతనాలు ఇస్తున్నామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేలు ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు.  ఉపాద్యాయులు ఎప్పట్నుంచో ఎదుర్కొంటోన్న సమస్యలను ఈ ప్రభుత్వమే పరిష్కరించిందన్నారు. సీఎం దృష్టికి ఏది వచ్చినా  వెంటనే  సమస్యలను పరిష్కరిస్తూ వచ్చారన్నారు. 


23 శాతం ఫిట్‌మెంట్ 

పది వేల కోట్లు భారం పడుతున్నా 23 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని ఆయన తెలిపారు.  ఫిట్‌మెంట్ 14.29 దాటని పరిస్థితుల్లో 23శాతం ఫిట్‌మెంట్‌ను సీఎం  ఇచ్చారన్నారు. సాధించిన ఫిట్‌మెంట్‌ను నాయకులు, ఉద్యోగ సంఘాల నేతలు  తమ క్రెడిట్‌గా తీసుకోవట్లేదన్నారు. తమను ప్రభుత్వం చులకనగా  చూస్తున్నారని  ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యానించడం సరికాదన్నారు.  పీఆర్సీతో  గతంలో ఉన్నట్లు వేతనంలో విపరీతంగా పెరుగుదల ఉండదన్నారు.  ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో అలా కోరుకోవడం అత్యాశే అవుతుందన్నారు.  నాడు -నేడులో పాఠశాలు  బ్రహ్మాండంగా  తయారవుతున్నాయని ఉపాధ్యాయులకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు.  పాఠశాలు బాగుపడితే తమకే మంచిదనే ఉపాధ్యాయులకు తెలియదా అని ఆయన నిలదీశారు. అంగన్‌వాడీలను కలిపాక ఎస్జీటీల నుంచి పదోన్నతులు వస్తాయన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసిందన్నారు. సీఎంను పట్టుకుని నష్టం జరిగిందని మాట్లాడుతున్నవారు ఇవన్నీ చూడరా అని ఆయన ప్రశ్నించారు. సమ్మెతో  ఉద్యోగ సంఘాలు ఏం సాధిస్తారో తెలియడం లేదన్నారు. ఇంత జరిగినా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్దంగా ఉన్నట్లు సీఎం చెప్పారని ఆయన పేర్కొన్నారు. సమస్యలు ఉంటే ప్రభుత్వంతో ఉద్యోగులు పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వం కర్కశంగా కర్కోటంగా ఉండదన్నారు. ఉద్యోగులు కూల్‌గా ఆలోచించి చర్చలకు రావాలన్నారు.


సమ్మెకు వెళితే ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు

సమ్మె వస్తే ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. సమ్మెకు వెళితే ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉద్యోగ భద్రత ఎలా క్రియేట్ చేసిందో చూడాలని మరోసారి అప్పీల్ చేస్తున్నామన్నారు. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి సిద్దంగా ఉన్నామన్నారు. ముందుగా సీఎంతో కాకుండా మంత్రుల కమిటీతో చర్చలు జరపాలని ఆయన సూచించారు. ఉద్యోగులు తమ వేతనాలు పెరగాల్సినంత పెరగలేదని అంటే అది వేరే విషయమన్నారు. ఉద్యోగుల వ్యాఖ్యలు పీఆర్సీతో సంబంధం లేకుండా పొలిటికల్ వైపు వెళ్తున్నట్లుందని ఆయన అన్నారు. ఎవరితోనో కొట్లాడుతున్నట్లుగా ఉద్యోగ సంఘాల నేతల వ్యాఖ్యలున్నాయన్నారు.  వేతనాలు అకౌంట్లలో పడ్డాక జీవోలు రద్దు చేయాలనడం అర్థం లేని డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల మూడు డిమాండ్లకు అర్థం లేదన్నారు. ఉద్యమంలో రాజకీయ పార్టీలు ఎంటరైతే సంబంధం లేని రాజకీయ శక్తులు వస్తాయని, అడ్డదారులు వద్దని కోరుతున్నామన్నారు. ఉద్యమం పక్కదారి పడుతుందని, అలా వెళ్లవద్దని కోరుతున్నామన్నారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు  బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడటం సరికాదన్నారు. ఉద్యోగుల గొంతు నొక్కే పని ఏదీ ప్రభుత్వం  చేయలేదన్నారు. కోవిడ్ ఉందనే 'చలో విజయవాడ'కు అనుమతి ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. 



Updated Date - 2022-02-04T00:48:16+05:30 IST