సమరమే!

ABN , First Publish Date - 2021-12-07T07:06:10+05:30 IST

తమ సమస్యలపై స్పందించని ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు.

సమరమే!
పెన్షనర్ల సమావేశంలో మాట్లాడుతున్న జేఏసీ నేత విద్యాసాగర్‌

నేటి నుంచి పోరు బాటలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు

నాలుగు రోజుల పాటు నల్లబ్యాడ్జీలతో నిరసనలు

కలెక్టర్‌కు, విజయవాడ సబ్‌ కలెక్టర్‌కు జేఏసీ నోటీసులు

ఆందోళనలకు ఏపీ ట్రెజరీ సర్వీస్‌ అసోసియేషన్‌ మద్దతు 

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీపీటీడీ ఈయూ మద్దతు 


తమ సమస్యలపై స్పందించని ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ డిమాండ్ల సాధనకు సంఘటితంగా సమరశంఖం పూరించారు.  ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి మంగళవారం నుంచి ఉద్యమ కార్యాచరణను అమలు చేయనున్నాయి. జిల్లాలో లక్ష మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఉద్యోగులు శాంతియుతంగా నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన సాగించనున్నారు. జిల్లావ్యాప్తంగా 98కి పైగా శాఖలకు చెందిన ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు.. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

  ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి రెండేళ్లకు పైగానే సమయం ఇచ్చారు. కొత్త ప్రభుత్వం.. కరోనా కష్టాలు.. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తమ సమస్యలను పరిష్కరించమని గట్టిగా అడగలేకపోయారు. చాలా కాలం సంయమనం పాటించారు. ఐదు డీఏలు ఇవ్వకపోయినా మాట్లాడలేదు. జీపీఎఫ్‌ డబ్బులను ప్రభుత్వం వాడుకున్నా అదేమని ప్రశ్నించలేదు. సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పి చేయకపోయినా, వేతన సవరణలో జాప్యం జరుగుతున్నా గట్టిగా నిలదీయలేదు. చివరాఖరికి ఒకటో తేదీనే రావలసిన జీతం రాకపోవటంతో ఆగ్రహించారు. ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీల నేతృత్వంలో మంగళవారం నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. 


సబ్‌ కలెక్టర్‌కు నోటీసు 

 జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి ఉద్యమ కార్యాచరణలో పాల్గొంటున్నట్టు విజయవాడ సబ్‌ కలెక్టర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌కు జేఏసీ ఐక్యవేదిక నోటీసును అందజేసింది. ఏపీ రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి డి.శ్రీనివాస్‌, ఏపీఎన్జీవో సిటీ అధ్యక్షుడు పి.స్వామి, జేఏసీ ఐక్యవేదిక నాయకులు బత్తిన రామకృష్ణ, సీహెచ్‌ అప్పారావు, ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి, రవీంద్ర, సంపత్‌, బాజీ, రవి, సతీష్‌ తదితరులు ఉదయం సబ్‌ కలెక్టర్‌ను కలిసి, తమ ఉద్యమ కార్యాచరణ గురించి వివరిస్తూ నోటీసును అందజేశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసమే ఆందోళన బాట పడుతున్నట్టు చెప్పారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం సబ్‌ కలెక్టరేట్‌ ఆఫీసులోని ఉద్యోగులందరినీ కలిసి పోరాటంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. 


ఉద్యమానికి కదిలిరండి : విద్యాసాగర్‌

 రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల (పెన్షనర్ల) న్యాయమైన డిమాండ్లను వెంటనే ఆమోదించేలా, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావల్సిన అవసరం ఉందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే నిరసన కార్యక్రమాలకు పెన్షనర్లు హాజరై జయప్రదం చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నగరంలోని గాంధీనగర్‌లోని తాలూకా కార్యాలయ ఆవరణలోని భవనంలో సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హజరయిన విద్యాసాగర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ సమస్యలను ఎన్ని పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందన్నారు. పీఆర్‌సీ అమలు, డీఏల మంజూరు, సీపీఎస్‌ రద్దు వంటి సమస్యలపై కమిటీలు వేసి కాలయాపన చేయడం బాధాకరం అన్నారు. ప్రభుత్వం ఇకపైనా స్పందించి, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన బాట చేపట్టామని, ఈ నిరసన కార్యక్రమాల్లో పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. పెన్షనర్ల జిల్లా అధ్యక్షుడు కె.దాలినాయుడు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌, ఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు రాజుబాబు తదితరులు పాల్గొన్నారు.


ఉద్యమంలోకి ఏపీ పీటీడీ ఉద్యోగులు 

ఉద్యోగ సంఘాల ఉద్యమానికి ఏపీ పీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌, ఏపీ ఎన్‌ఎంయూఏ సంయుక్తంగా మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాక అనేక సమస్యలు వెన్నాడుతున్నాయని, వీటిన్నింటిపై చీఫ్‌ సెక్రటరీకి నోటీసు ఇచ్చామన్నారు. తమ ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొంటారని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు చెప్పారు. 


ఏపీ ట్రెజరీ ఉద్యోగుల మద్దతు  

జేఏసీ ఆందోళనకు ఏపీ ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శోభన్‌బాబు, కిరణ్‌కుమార్‌ సంపూర్ణ మద్దతు తెలిపారు. తమ ఉద్యోగులంతా ఈ ఆందోళనలో పాలు పంచుకుంటారని చెప్పారు. 


కలెక్టర్‌కు ఉద్యమ నోటీసు

మచిలీపట్నం టౌన్‌ : ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అమరావతి ఐక్య వేదిక పక్షాన కలెక్టర్‌ నివాస్‌కు సోమవారం ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక పక్షాన తూర్పు కృష్ణా ఎన్జీవోల సంఘ అధ్యక్షుడు ఉల్లి కృష్ణ ఉద్యమ నోటీసును అందజేశారు. సోమవారం జిల్లా ఆసుపత్రికి వచ్చిన కలెక్టర్‌కు ఉల్లి కృష్ణ డిమాండ్‌ల నోటీసును అందజేశారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను ఆమోదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు బి.ఎన్‌. పాల్‌బాబు, తూర్పు కృష్ణా ఎన్జీవోల కార్యదర్శి సాయిబాబు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ యాకుబ్‌ పాల్గొన్నారు.



Updated Date - 2021-12-07T07:06:10+05:30 IST