‘మహా’ నిరసన

ABN , First Publish Date - 2022-01-26T07:00:31+05:30 IST

రివర్స్‌ పీఆర్సీపై ఆగ్రహంతో ఉద్యోగ దండు విజయవాడలో కదం తొక్కింది.

‘మహా’ నిరసన
మహా నిరసన ర్యాలీలో కదం తొక్కిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు

విజయవాడ నగరంలో కదంతొక్కిన ఉద్యోగ సైన్యం 

సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘీభావం 


రివర్స్‌ పీఆర్సీపై ఆగ్రహంతో ఉద్యోగ దండు విజయవాడలో కదం తొక్కింది. ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణా నేతృత్వంలో మంగళవారం విజయవాడలో తలపెట్టిన నిరసన ర్యాలీ దిగ్విజయమైంది. ఉదయం పాత బస్టాండ్‌ నుంచి మహా నిరసన ర్యాలీ ప్రారంభమైంది. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీజీఈఏ, ఏపీజీఈఎఫ్‌ జేఏసీల సభ్య ఉద్యోగ సంఘాలు, ఫ్యాప్టో నేతృత్వంలోని అసోసియేషన్లు ఈ మహా నిరసన ర్యాలీలో పాల్గొన్నాయి. పీఆర్టీయూ కూడా ఈ ధర్నాలో పాలుపంచుకుంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని సరి చేయాలని, పీఆర్సీపై ఇచ్చిన చీకటి జీవోలను రద్దు చేయాలని నినదిస్తూ, మంగళవారం ఉద్యోగ, కార్మిక సంఘాలు నగరంలో కదం తొక్కాయి. కార్యక్రమం ఆసాంతం పోలీసులు డ్రోన్లతోనూ, హ్యాండీక్యామ్‌లతోనూ నిరసన ర్యాలీని చిత్రీకరించారు. పాతబస్టాండ్‌ దగ్గర నుంచి ర్యాలీ ముందు భాగాన ఏపీఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు విద్యాసాగర్‌, రాష్ట్ర యూటీఎఫ్‌ అధ్యక్షుడు ఎన్‌ వెంకటేశ్వర్లు, ఏపీపీటీడీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ అధ్యక్షుడు సుందరయ్య తదితరులు అగ్రభాగాన నిలిచారు. సీఐటీయూ నేతృత్వంలో భారీ సంఖ్యలో కార్మికులు ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలిపారు. ఎన్జీవో నేత సాగర్‌ వీరిని ర్యాలీలోకి సాదరంగా ఆహ్వానించారు. యూటీఎఫ్‌ నేతృత్వంలో మరో ర్యాలీ వచ్చి, ప్రధాన ర్యాలీలో కలిసింది. పాత బస్టాండ్‌ నుంచి ధర్నాచౌక్‌ వరకు దారి పొడవునా వివిధ సంఘాల నేతలు వచ్చి, ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూనే ఉన్నారు.

Updated Date - 2022-01-26T07:00:31+05:30 IST