తిరుగుబాటు

ABN , First Publish Date - 2022-01-19T06:11:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన ర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుగుబాటు
ఏలూరులో నిరసన ర్యాలీ

  •  చీకటి జీవోలపై ఉద్యోగ, ఉపాధ్యాయుల మండిపాటు
     23 శాతం ఫిట్‌మెంట్‌.. హెచ్‌ఆర్‌ఏ తగ్గింపుపై ఆగ్రహం
    జిల్లావ్యాప్తంగా నిరసనల వెల్లువ.. జీవో ప్రతుల దహనం
     వైఎస్‌ఆర్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ సైతం గొంతు కలిపింది
     అదనపు పెన్షన్‌ రేట్లతగ్గింపుపై పెన్షనర్ల ఆగ్రహం
    రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లు ఎవరడిగారని ప్రశ్న
    పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌




ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 18 :
రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన ర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జీవోల వల్ల హెచ్‌ఆర్‌ఏ తగ్గుదల, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్‌లో తగ్గింపు, మొత్తం మీద జీతాల్లో కోత తదితర అంశాలపై స్పష్టత రావడంతో తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ మూకుమ్మడిగా ప్రతిస్పందించారు. పీఆర్సీ జీవోల వల్ల వాటిల్లే నష్టంపై వేగంగా స్పందించిన ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఏలూరు జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో నిరసన ప్రదర్శనతో జీవో ప్రతులను దహనం చేశారు. ఈ నిరసనలో ఫ్యాప్టో సభ్య సంఘాల జిల్లా నాయకులతోపాటు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు. ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో అధికార పార్టీ అనుబంధ సంఘమైన వైఎస్‌ఆర్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా నాయకత్వం గొంతు కలపడం గమనార్హం. అప్రజా స్వామికంగా ఫిట్‌మెంట్‌ను 23 శాతం ప్రకటించడమే కాకుండా జీవోలను జారీ చేయడంపై ఫ్యాప్టో వ్యతిరేకిస్తుందని ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్‌ ఆదినారాయణ, పీబీవీఎన్‌ఎల్‌ నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఆర్‌ఏకు సంబంధించి ఇప్పటికే ఇస్తున్న స్లాబ్‌లను తగ్గిస్తూ జీవో ఇవ్వడం వల్ల పీఆర్సీలో జీతాలు పెరగకపోగా తగ్గిపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్‌ రేట్లను తగ్గించడంపై మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఈ జీవోలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరసనలో భాగంగా జిల్లావ్యాప్తంగా మంగళవారం అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యారు. ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ నుంచి జడ్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నిరసనలో ఫ్యాప్టో సభ్య సంఘాల నాయకులు జి.కృష్ణ, బీఏ సాల్మన్‌రాజు, పీవీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పి.ఆంజనేయులు ఆధ్వర్యంలోని ఉపాధ్యాయ బృందం జిల్లా  పరిషత్‌ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ను కలుసుకుని పీఆర్సీని వ్యతిరేకిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ జీవోలను వ్యతిరేకిస్తున్నట్టు వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన    కార్యదర్శి జి.సుధీర్‌, జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు         స్టీవెన్‌, వెంకట్రావు, రామ్మోహన్‌రావులు తెలిపారు.


62 వద్దే వద్దు.. 60 చాలు


మూల వేతనాన్ని రివిజన్‌ చేసి జీతాలను పెంచాల్సింది పోయి పీఆర్సీని పే రివర్స్‌ కమిషన్‌గా దిగజార్చిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్‌ ఆర్‌.ఎస్‌.హరనాధ్‌ విమర్శించారు. ఇంత ఘోరమైన పీఆర్సీని ఎప్పుడూ చూడలేదన్నారు. హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లను మార్చడం వల్ల పోలవరం, కొరుటూరు వంటి మారుమూల గ్రామాల్లో ఇచ్చే ఇంటి అద్దె భత్యాన్నే పట్టణ ప్రాంతాలకు ఎనిమిది శాతంగా ఇకపై ఇస్తారని వివరించారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆ మేరకు ఆర్టీసీ సిబ్బందిని, ఉపాధ్యాయులను కలుపుకుని సమ్మెకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కొవిడ్‌ అత్యవసర వైద్యసేవల దృష్ట్యా వైద్యులను సంప్రదించి సమ్మెలో కలిసేందుకు సంప్రదింపులు జరుపుతామన్నారు. 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినందున 2024లో ఈ ప్రభుత్వానికి కచ్చితంగా గుణపాఠం చెబుతామన్నారు. రిటైర్మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల ఉద్యోగ విరమణ వయసు చాలునన్నారు.

Updated Date - 2022-01-19T06:11:00+05:30 IST