అంత చులకనా..!

ABN , First Publish Date - 2022-06-24T06:40:10+05:30 IST

ప్రభుత్వ శాఖల్లో అదో కీలకమైన డిపార్టుమెంట్‌. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు మహిళా ఉద్యోగులు బదిలీల కోసం విజ్ఞప్తి లేఖలు పెట్టుకొన్నారు.

అంత చులకనా..!

బదిలీల విజ్ఞప్తి దరఖాస్తులు ఇద్దరు మహిళా ఉద్యోగుల దరఖాస్తు

వారిపై నోరు పారేసుకొన్న అధికారి 

గుంటూరు, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల్లో అదో కీలకమైన డిపార్టుమెంట్‌. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు మహిళా ఉద్యోగులు బదిలీల కోసం విజ్ఞప్తి లేఖలు పెట్టుకొన్నారు. ఎక్కడైతే వారికి వైద్యం అందుబాటులో ఉంటుందో ఆ సమీప ప్రాం తానికి బదిలీపై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకొన్నారు. ఆ లేఖలు చూస్తూనే సంబంధిత అధికారి కోపాద్రిక్తుడయ్యారు. వెంటనే వారిపై మీ వలన ఈ ఆఫీసుకు ఎలాంటి ఉపయోగం లేదు.. దీర్ఘకాలిక సెల వులు పెట్టుకోవడానికి తప్పా మీరు ఎందుకు పనికి రారు అంటూ దుర్బాషలాడారు. దాంతో వారు తీవ్ర అవమానభారంతో ఆ అధికారి ఛాంబర్‌ నుంచి వెనక్కు వచ్చేశారు. అదే అధికార పార్టీ నేతల సిఫార్సు లేఖలతో బదిలీ కోసం వస్తే వారికి ప్రాధాన్యం ఇస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. 

ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో ప్రభుత్వం జారీ చేసిన మార్గ దర్శకాలు ఏ కోశాన అమలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. బదిలీల్లో ఎవరికైతే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చిం దో వాటిని అమలు చేసే విషయంలో కొంతమంది అఽధికారులు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నారు. మంత్రులు/ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో వెళితే వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వీఐపీ మాదిరిగా పరిగ ణిస్తోన్నారు. ఎలాంటి సిఫార్సులు లేకుండా బదిలీల కోసం విజ్ఞప్తులు పెట్టుకొంటున్న వితంతు ఉద్యోగినులు, దీర్ఘకాలిక వ్యాఽఽధి గ్రస్థుల విషయంలో ఉదాశీనంగా వ్యవహరించాల్సింది పోయి వారికి మన స్థాపం కలిగించే విధంగా ప్రవర్తిస్తుండటంపై మహిళా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


పౌరసరఫరాల శాఖలో వివాదం


జిల్లాల విభజన సమయంలో సీఎస్‌డీటీల బదిలీలు పౌరసరఫరాల శాఖలో ఇష్టారాజ్యంగా జరిగాయి. నిబంధనల ప్రకారం ఆ శాఖలో రెవెన్యూ డిపార్టుమెంట్‌కు చెందిన డిప్యూటీ తహసీల్దార్లు ఉంటారు. వారిని సర్దుబాటు తప్పనిసరిగా నోడల్‌ ఆఫీసర్‌ హోదాలో కలెక్టర్‌ చేయాల్సి ఉంటుంది. అలాంటిది అప్పట్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సీఎస్‌డీటీల బదిలీలు చేశారు. ఇప్పుడు సాధారణ బదిలీలకు అనుమతి రావడంతో రెవెన్యూ శాఖకి నివేదించారు. దీనిపై రెవెన్యూ అధికారులు మండిపడుతున్నారు. 


28న మూడు జిల్లాల కలెక్టర్ల భేటీ


ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటైన కమిటీ ఈ నెల 28న భేటీ కానున్నది. కమిటీలో జిల్లా కలెక్టర్‌  వేణుగోపాల్‌రెడ్డితో పాటు బాపట్ల కలెక్టర్‌ విజయ, పల్నాడు కలెక్టర్‌ శివశంకర్‌ ఉన్నారు. కమిటీ సమావేశమై బదిలీలకు సంబంధించి శాఖల వారీగా వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని రాజకీయ సిఫార్సు లేకుండా విజ్ఞప్తులు పెట్టుకొన్న ఉద్యోగులు కోరుతున్నారు. 

Updated Date - 2022-06-24T06:40:10+05:30 IST