ఉద్యోగాగ్రహం

ABN , First Publish Date - 2022-01-20T06:32:33+05:30 IST

రివర్స్‌ పీఆర్సీపై ఉద్యోగులు భగ్గుమన్నారు.

ఉద్యోగాగ్రహం
ఎన్జీవో కార్యాలయం వద్ద జీవో ప్రతులను దహనం చేస్తున్న ఉద్యోగులు

రివర్స్‌ పీఆర్సీపై ఉద్యోగుల నిరసన

జీవో ప్రతులు దహనం

నేడు కలెక్టరేట్‌ ముట్టడికి ఫ్యాప్టో పిలుపు 

జాక్టో ఆధ్వర్యంలో సబ్‌కలెక్టరేట్‌ల ముట్టడి

సమ్మె బాటలో ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి 


రివర్స్‌ పీఆర్సీపై ఉద్యోగులు భగ్గుమన్నారు. తమ ప్రయోజనాలను కాలరాసే నిర్ణయాలపై తిరుగుబావుటాను ఎగరవేశారు. చీకటి జీవోలను రద్దు చేసేవరకు ఉద్యమించాల్సిందేనని నిర్ణయించారు. తమకు అన్యాయాన్ని చేసే పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేసి, నిరసనను ప్రకటించారు. సమ్మెకు వెళతాం అంటూ అల్టిమేటం జారీ చేశారు. నగరంలో బుధవారం ఉదయం నుంచి ఉద్యమ సెగ రగులుతూనే ఉంది. గురువారం ఉద్యోగ సంఘాల ప్రత్యక్ష ఆందోళనలతో ఇది మరింత తీవ్రతరం కానున్నది. దీనికితోడు విజయవాడలో జరుగుతున్న ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతిల రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ బాడీ సమావేశాలు కూడా సమ్మె బాటలో ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నాయి. 


(విజయవాడ, ఆంధ్రజ్యోతి) : పెరిగిన ధరలకు అనుగుణంగా మెరుగైన ప్రయోజనాలను ఆశిస్తున్న ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చిన ‘రివర్స్‌’ షాక్‌ పై మండిపడుతున్నారు. కొత్తగా ఏమీ ఇవ్వకపోగా, కొనసాగుతున్న ప్రయోజనాలకు కూడా కోత పెడుతూ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోను రద్దు చేసే వరకూ ఉద్యమించాల్సిందేనని నిర్ణయించుకున్నారు. ఉద్యోగుల ఆగ్రహంతో ఉద్యోగ సంఘాల నేతలు సైతం కదిలారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఉద్యోగ సంఘాలు సమావేశాలు నిర్వహించాయి. విజయవాడలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న కార్యవర్గ సభ్యులంతా ఉద్యోగుల ఆవేదనను, ఆందోళనను నేతల ముందుంచారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిందేనని పట్టుబట్టారు. 1980, 1990 దశకాల్లో జరిగిన పోరాటాలను గుర్తు చేస్తూ, అంతకు మించిన ఉద్యమాన్ని సాగించాలని సూచించారు. అందుకు భిన్నంగా ప్రభుత్వంతో రాజీపడినా, చర్చలకు వెళ్లినా.. అది ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్టే అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పోరాటం తప్ప మరో ప్రత్నామ్నాయం లేదని చెప్పారు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, వెనకడుగు వేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఉద్యమ కార్యాచరణ దిశగా కదిలాయి. 


ఉమ్మడి పోరుకు సై

విజయవాడ వేదికగానే రెండు ప్రధాన జేఏసీలు సమావేశమై, ఉమ్మడి కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయించాయి. ఇదే సందర్భంలో ఇప్పటివరకు వేర్వేరుగా పని చేస్తున్న మిగిలిన ఉద్యోగ సంఘాలు కూడా కలిసి పని చేసేందుకు బీజం పడింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి పీఆర్సీ సాధన సమితి పేరుతో అన్ని సంఘాలూ కలిసి పని చేయాలనే పిలుపు రావటం, ఈ ప్రతిపాదనను అన్ని జేఏసీలూ స్వాగతించటంతో ఐక్య పోరాటాలకు మార్గం సుగమమయింది.


నేడు కలెక్టరేట్‌ ముట్టడి : ఫ్యాప్టో పిలుపు

ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై పునరాలోచన, హెచ్‌ఆర్యే పాత స్లాబుల కొనసాగింపు, సీపీఎస్‌ రద్దు తదితర నిర్ణయాలపై గురువారం కలెక్టరేట్‌ ముట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాఫ్టో) పిలుపునిచ్చింది. ఫ్యాఫ్టో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక. ఎస్టీయూ, బీటీఏ, యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ - 257, ఏపీటీఎఫ్‌ - 1938, హెచ్‌ఎంయే, డీటీఎఫ్‌, ఎస్సీ, ఎస్టీయూఎస్‌, ఏపీపీటీయే, ఎస్‌యే అసోసియేషన్‌లు అన్నీ ఫ్యాప్టో నేతృత్వాన జత కట్టాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ కంటే ముందుగానే ఇవి కార్యాచరణకు పిలుపునిచ్చాయి. గురువారం జరిగే కలెక్టరేట్‌ ముట్టడిలో నాలుగు వేల మందికి పైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగ సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. దీంతో ఇరు జేఏసీల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర పే రివిజన్‌ స్కేల్స్‌ అమలు ఆలోచనను విరమించుకుని రాష్ట్ర పే కమిషన్‌ను యథాతథంగా కొనసాగించాలని, అశుతోష్‌ మిశ్రా రిపోర్టును బహిర్గతం చేయటంతో పాటు దానిని తప్పకుండా అమలు చేయాలని, అశుతోష్‌ మిశ్రా ఇచ్చిన రిపోర్టుకు  భిన్నంగా అధికారుల కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు సమర్థనీయం కాదని, తక్షణం ఈ ప్రతిపాదనలను రద్దు చేయాలని ఫ్యాఫ్టో నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.


నేడు జాక్టో ఆధ్వర్యంలో నిరసనలు

పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ జాక్టో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో గురువారం జిల్లావ్యాప్తంగా  సబ్‌కలెక్టర్‌ కార్యాలయాలు, ఆర్డీవో ఆఫీసుల ఎదుట ఆందోళనలు జరగనున్నాయి. జాక్టో సంఘాలైన పీఆర్టీయూ, ఎస్‌ఎల్‌టీయే, వైఎస్‌ఆర్‌టీఎఫ్‌, ఎస్సీ, ఎస్టీ టీఎఫ్‌, ఎంఎస్‌పీటీయే, ఏపీ యూఎస్‌, ఆర్జేయూపీ, ఏపీటీజీ, ఆర్టీయూ, ఎన్టీయే సంఘాలు ఈ ఆందోళనల్లో పాలుపంచుకోనున్నాయి. జాక్టో ఆందోళనలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది.


సమ్మె బాటలో ఉద్యోగ సంఘాలు 

ప్రభుత్వ మెడలు వంచాలంటే సమ్మెకు సిద్ధం కావలసిందేనని ఉద్యోగ సంఘాల నుంచి డి మాండ్‌ రావటంతో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతిలు గురువారం నగరంలో అత్యవసర ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ సమావే శాల్లో సమ్మె కార్యాచరణపై చర్చించనున్నారు. సమ్మె నోటీసు ఇవ్వటానికి 15 రోజుల సమయం అవసరం. నోటీసు ఇచ్చిన నాటి నుంచి 15 రోజుల ఉద్యమ కార్యాచరణపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. 


రోడ్డెక్కిన ఆర్‌ అండ్‌ బీ ఉద్యోగులు

విజయవాడ సిటీ, జనవరి 19 : పీఆర్సీ నివేదికను నిరసిస్తూ ఆర్‌ అండ్‌ బీ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఎంజీ రోడ్డులోని ఆర్‌ అండ్‌ బీ ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులు  బుధవారం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. గతంలో 27 శాతం పెంచిన ఐఆర్‌లో నాలుగు శాతం తగ్గించి, ప్రభుత్వ ఫిట్‌మెంట్‌ 23 శాతం చేయడం దురదృష్టకరమని జేఏసీ అధ్యక్షుడు మునికేశవులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జీవోలను రద్దు చేసి, ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్యేలను పెంచేంతవరకు తమ పోరాటం ఆపేదిలేదని పునరుద్ఘాటించారు. సంఘ కార్యదర్శి విజయకుమార్‌, ఉపాధ్యక్షుడు మహేష్‌, వెంకటరవి, మహిళా విభాగం నాయకురాళ్లు అనుపమ, దేవి, ఉద్యోగులు ఈ నిరసనలో పాల్గొన్నారు.



Updated Date - 2022-01-20T06:32:33+05:30 IST