ఉద్యోగుల వేదన

Nov 27 2021 @ 23:59PM
కలెక్టర్‌కు సమస్యలు వివరిస్తున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు

ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలపై వినతులు

రెగ్యులర్‌ చేయాలని, వేతనాలు ఇవ్వాలని గ్రీవెన్స్‌ సెల్‌లో వేడుకోళ్లు


ఏలూరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో శనివారం చేపట్టిన ఉద్యోగుల గ్రీవెన్సుకు అర్జీదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాకు తమ గోడు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 13 శాఖల ఉద్యోగులు తమ సమస్యలు విన్నవించారు. సర్వీసులను రెగ్యులర్‌ చేయాలని పలువురు కాంట్రాక్టు, సచివాలయ ఉద్యోగులు, వేతనాలు చెల్లించాలని ఎక్సైజ్‌ శాఖ పరిధిలోని స్పెషల్‌ పోలీస్‌ అధికారులు, పదోన్నతులు కల్పించాలని రెవెన్యూ ఉద్యోగులు అధికారులను వేడుకున్నారు. ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 2019లో అప్పటి కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు శ్రీకారం చుట్టారు. ఉద్యోగుల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీలు వచ్చినప్పటికీ పరిష్కారమైనవి కొన్నే కావడంతో గ్రీవెన్సుకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. స్థానిక సంస్థల ఎన్నికలు, కొవిడ్‌ కారణంగా ఇప్పటి వరకూ గ్రీవెన్స్‌ పెట్టలేదు. సమస్యలు పెరగడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కలెక్టరేట్‌కు వస్తుండడంతో ఉద్యోగుల గ్రీవెన్స్‌కు కలెక్టర్‌ ఆదేశించారు. జేసీ సూరజ్‌ గానోరె, డీఆర్‌వో డేవిడ్‌రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


రెవెన్యూ సీనియర్లకు పదోన్నతి ఇవ్వాలి

ఎల్‌.విద్యాసాగర్‌, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు

జిల్లాలో రెవెన్యూ సీనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 14 మందికి మూడేళ్ల క్రితమే డిప్యూటీ తహసీల్దారులుగా పదోన్నతి రావాల్సి ఉన్నా ఇవ్వలేదు. సెప్టెంబరులోనే కలెక్టర్‌కు ఈ విషయంపై విన్నవిస్తే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. మంగళవారం జరిగే జిల్లాస్థాయి జాయింట్‌ స్టాఫ్‌ మీటింగ్‌ నాటికి వీరికి పదోన్నతులు ఇవ్వాలని కోరాం. 


పదోన్నతులు కల్పించాలి

ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం

జిల్లాలో ఖాళీగావున్న అటెండర్‌, నైట్‌ వాచ్‌మెన్‌, డ్రైవర్‌ పోస్టులను అర్హులైన గ్రామ రెవెన్యూ సహాయకులకు పదోన్నతి కల్పించి భర్తీ చేయాలి. గ్రేడ్‌–2 వీఆర్‌వోలుగా పదోన్నతి కల్పించాలి. కనీస వేతనం 21 వేలు చేసి, నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. 


మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్‌ ఇవ్వాలి

నల్లా అప్పారావు, ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

కాటంనేని భాస్కర్‌ కలెక్టర్‌గా ఉన్న సమయంలో కాంట్రాక్టు వైద్య సిబ్బందికి వారి నివాసాలకు దూరంగా పోస్టింగులు ఇచ్చారు. కొందరైతే వంద కిలోమీటర్లకుపైగా ఉండాల్సి వస్తోంది. వీరి బదిలీ ఎలాంటి అవకాశం ఇవ్వ లేదు. మ్యూచువల్‌ బదిలీ అవకాశం కల్పించాలని కోరు తున్నాం. ఎందరో డీఎంహెచ్‌వోలకు విన్నవించినా పరి స్థితిలో మార్పులేదు. డిప్యుటేషన్‌కు సమీప ఉద్యోగులనే తీసుకోవాలి. 


  సర్వీసు రెగ్యులర్‌ చేయాలి 

సచివాలయ ఉద్యోగులు

ఉద్యోగంలో చేరి రెండేళ్లు పూర్తయింది. ప్రభుత్వం చెప్పి నట్లు మమ్మల్ని పూర్తిస్థాయి ఉద్యోగులుగా తీసుకోవాలి. ఇప్పటి వరకూ అలాంటిదేమీ లేదు. ఇకనైనా మమ్మల్ని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి పేస్కేలు అమలు చేయాలి.


  పని భారం తగ్గించండి 

 గ్రేడ్‌– 2 వీఆర్‌వోలు

గ్రేడ్‌–2 వీఆర్‌వోలపై పని భారం ఎక్కువగా ఉంటోంది. ఏలూరు నగర పరిధిలో 62 సచివాలయాలకు వీఆర్‌వోలు 31 మందే ఉన్నాం. ఒక్కొక్కరు రెండు, మూడు సచివా లయాల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. దీంతో భారం, ఒత్తిడి బాగా పెరిగింది. ఈ అదనపు బాధ్యతలను తొలగించాలి. మా సెలవుల బాధ్యత సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, తహసీల్దారులకు అప్పగించారు. దీంతో మేము ముగ్గురి అనుమతి ఉంటేనే సెలవు పెట్టేందుకు వీలవు తోంది. అందుకే మమ్మల్ని పూర్తిగా తహసీల్దారు పరిధిలోకి తీసుకువెళ్లాలి. సెలవు మంజూరు చేసే అధికారం తహసీల్దారుకే ఉండాలి. బయోమెట్రిక్‌ హాజరు పేరుతో కోతలు లేకుండా చూడాలి.


ఎనిమిది నెలలుగా జీతాల్లేవు

స్పెషల్‌ పోలీస్‌ అధికారులు

ఎక్సైజ్‌ శాఖ పరిధిలో స్పెషల్‌ పోలీస్‌ అధికారులుగా పనిచేస్తున్న మాకు ఎనిమిది నెలలుగా జీతాల్లేవు. అధికా రులను అడిగినా ప్రయోజనం ఉండడం లేదు. జీతాల పంపిణీ డీఐజీ కార్యాలయ పరిధిలో ఉందని చెబుతున్నారు. కలెక్టర్‌గారే న్యాయం చేయాలి. వేధిస్తున్న ఆడిట్‌ అధికారులు

ఇంటి అప్పలకొండ, రిటైర్డ్‌ ఉద్యోగి 

1986 ఫిబ్రవరిలో జడ్పీ హైస్కూల్‌ ల్యాబ్‌ అసిస్టెం టుగా చేరా. 1986 జూలై 1న నిర్ణయించిన పీఆర్‌సీలో రికార్డు అసిస్టెంట్లకు పేస్కేలు రూ.780 ఇచ్చారు. ల్యాబ్‌/లైబ్రరీ అసిస్టెంట్‌ అయినప్పటికీ అటెండరు పేస్కేలు రూ.740 ఇచ్చారు. దీనిపై ఏపీ ట్రిబ్యునల్‌కు వెళ్లగా 2010లో నాకనుకూలంగా తీర్పు వచ్చింది. దీని ప్రకారం వేతనం పెరగాలి. 2010 జూన్‌లో నేను రిటైరయ్యా. పెరిగిన పేస్కేలు ప్రకారం పదవీ విరమణ ప్రయోజనాలు అందాలి. కానీ ఇప్పటి వరకూ ఇది అమలు కాలేదు. 2019లో ఏర్పాటు చేసిన ఉద్యోగుల గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయగా జడ్పీ అధికారులు స్పందించి వేతన సవరణ, బకాయిల చెల్లింపునకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆడిట్‌ అధికారులు ఇప్పటి వరకు వేధిస్తూనే ఉన్నారు. 11 ఏళ్లుగా రావాల్సిన వేతన బకాయిలు ఆగిపోయాయి. ఎన్నిసార్లు తిరిగినా వారు ఇప్పటికీ నిర్లక్ష్యంగానే సమాధానం చెబుతున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.