ఉద్యోగ సంఘాల ర్యాలీలు

ABN , First Publish Date - 2022-01-27T06:34:10+05:30 IST

కోతల పీఆర్‌సీ వద్దని, న్యాయమైన పీఆర్సీని ఇవ్వాలని, చీకటి జీవోలను రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

ఉద్యోగ సంఘాల ర్యాలీలు
ఆదోనిలో ర్యాలీ నిర్వహిస్తున్న ఉద్యోగులు

ఆదోని(అగ్రికల్చర్‌), జనవరి 26: కోతల పీఆర్‌సీ వద్దని, న్యాయమైన పీఆర్సీని ఇవ్వాలని, చీకటి జీవోలను రద్దు చేయాలని  ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. బుధవారం పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీవోస్‌ కార్యాలయం నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులు  భారీగా ర్యాలీగా తరలివచ్చారు. అక్కడి నుంచి   డా. బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు వచ్చి  వినతిపత్రం అందజేశారు. పీఆర్‌సీ సాధన సమితి ఏపీఎన్జీవోస్‌ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘ నాయకుడు నాగరాజు, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యాసిన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన  11వ వేతన సవరణ ప్రకటించడం మధ్యంతర భృతి కంటే తక్కువగా ఉండడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. నాయకులు భాస్కర్‌, నాగేంద్రప్ప, గాదిలింగ, శ్రీనివాసులు, వీరచంద్రయాదవ్‌, ఎస్‌.రమేష్‌, సుధాకర్‌, రసీద్‌ పాల్గొన్నారు. 


 ఆంధప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయంగా ఉండవలసిన పీఆర్‌సీలో కోత పెట్టడం తగదని ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ సహాయ కార్యదర్శి రాజశేఖర్‌రావు అన్నారు.  


ఆలూరు: రివర్స్‌ పీఆర్‌సీ జీవోలను వెనక్కి తీసుకుని మెరుగైన పీఆర్‌సీని ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని  ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు అన్నారు.  బుధవారం ఆలూరు ఎంఆర్‌సీ నుంచి ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు కాశీమ్‌, నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రిలో ఎలాంటి మార్పు రావడం లేదన్నారు.    కార్యక్రమంలో మస్తాన్‌రావు, బసవరాజు, ఉరుకుందప్ప, రవి, శంకర్‌, సురేష్‌బాబు, శేఖర్‌, మంగయ్య, శిక్షరావు, విద్యార్థి సంఘాలు, రిటైర్డ్‌ ఉద్యోగులు గోవిందప్ప, ఆనంద్‌రావు, నరసన్న, హీరాలాల్‌ పాల్గొన్నారు. 


మంత్రాలయం: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల డిమాండ్లను నెరవేర్చాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు రామన్న మాట్లాడుతూ పీఆర్‌సీని పదేళ్లకు పెంచుతామని ప్రకటించి డీఏలు ఇవ్వకపోవడం, ఇంటి అద్దె అలవెన్సులో కోతలు పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 


ఎమ్మిగనూరు: ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ చీకటి జీవోలను రద్దుచేయాలని పీఆర్సీ సాధన సమితి తాలుక కన్వీనర్‌ మద్దిలేటి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం పీఆర్సీ సాధన సమితి రాష్ట్రకమిటీ పిలుపు మేరకు ఎమ్మిగనూరులో సమితి తాలుకా కమిటీ ఆధ్వర్యంలో డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కృష్ణ, నాగమణి, ఎల్లప్ప, ప్రసన్నరాజు, ఖాసీంజీ, ఏపీ వీరన్న మాట్లాడుతూ అశితోష్‌ మిశ్రా కమిషన్‌ను బహిర్గతం చేయాలని కోరారు. నాయకులు మోహన్‌, వేణుగోపాల్‌ ఆచారి, వరప్రసాద్‌, బలరాముడు, జోసఫ్‌, శివరామిరెడ్డి, హరిత, తిరుమల రెడ్డి, బజారి, ప్రభు పాల్గొన్నారు.


ఎమ్మిగనూరు టౌన్‌: నూతన పీఆర్సీ జీవోను రద్దు చేసి పాత పద్ధతిలోనే పీఆర్సీ ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకులు బాలరాజు, సత్యన్న డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ విగ్రహనికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఎల్లప్ప, గిడ్డయ్య, శివ, ఉరుకుందు, రాజాహ్మద్‌ పాల్గొన్నారు. 


డోన్‌: రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీపై ఇచ్చిన జీవోలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని జేఏసీ డోన్‌ తాలుకా చైర్మన్‌ క్రిష్ణమోహన్‌, ప్రేమ్‌ కుమార్‌, సుబ్బారెడ్డి, ఎన్‌ఎస్‌ బాబు నరసింహులు ఉద్ఘాటించారు. బుధవారం పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా ఇచ్చిన పీఆర్‌సీ జీవోలను రద్దు చేసేలా ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించారు. జేఏసీ నాయకులు రామ్మూర్తి, లక్ష్మయ్య, వెంకటరమణ, భాస్కర్‌, ఇక్బాల్‌, షమివుల్లా, వెంకటేశ్వర్లు, పెన్షనర్లు మౌలాలి, గాలయ్య, ఆర్టీసీ నాయకులు ఐవీ రెడ్డి, రమణ, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు. 


పత్తికొండటౌన్‌: పత్తికొండ పట్టణంలో బుధవారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. స్థానిక ఆర్‌అండ్‌బీ గేస్ట్‌హౌస్‌ నుంచి పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పట్టణ వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహిస్తూ అంబేడ్కర్‌ సర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉద్యమాలను అణిచివేసే రీతిలో వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఏజేసీ చైర్మన్‌ సాయిబాబా, ఎస్టీయూ నాయకుడు రామ్మోహన్‌రెడ్డి, ఎపీటీఎఫ్‌ నాయకులు సంజీవ పాల్గొన్నారు. 


కోడుమూరు: ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పీఆర్‌సీని రద్దు చేయాలని పీఆర్‌సీ రాష్ట్ర సాధన సమితి కమిటీ సమన్వయకర్త హెచ్‌.తిమన్న డిమాండ్‌ చేశారు. స్థానిక కొత్త బస్టాండ్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు.  సాధన సమితి, ఎస్టీయూ నాయకులు వెంకటేశ్వర్లు, విక్టర్‌, మురళీధర్‌, శ్రీనివాసులు, యూటీఎఫ్‌ నాయకులు నీలకంఠ, రామేశ్వరరెడ్డి, నవీన్‌పాటి, ఎన్‌జీవో నాయకులు సుధాకర్‌, ఆంజనేయులు, ఉపాధ్యాయులు ఉమాదేవి, శ్యామలాదేవి పాల్గొన్నారు.


Updated Date - 2022-01-27T06:34:10+05:30 IST