మీ స్ఫూర్తితో ప్రశ్నిస్తాం

ABN , First Publish Date - 2022-01-27T06:54:47+05:30 IST

‘భీమ్‌.. నీవు అందించిన రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం కలుగుతోంది.

మీ స్ఫూర్తితో ప్రశ్నిస్తాం
విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు

ఈ ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించు..

అంబేడ్కర్‌ విగ్రహానికి ఉద్యోగుల వినతి

రాజ్యంగ హక్కులను పరిరక్షించమంటే అణిచివేస్తారా?

పీఆర్సీ నివేదికను అపహాస్యం చేశారు

ప్రభుత్వ తీరుపై పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీ నేతల ఆగ్రహం


  (ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ‘భీమ్‌.. నీవు అందించిన రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం కలుగుతోంది.  హక్కులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే దుర్మార్గంగా అణిచివేయాలని చూస్తోంది. రాజ్యాంగబద్ధమైన అశుతోష్‌ మిశ్రా నివేదికను అపహాస్యం చేసింది. నీ స్ఫూర్తితో ప్రశ్నిస్తాం.. ఈ ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించమని కోరుతున్నాం..’ అంటూ ఉద్యోగులు రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు అందచేశారు. విజయవాడ ఆర్టీయే కార్యాలయ ఆవరణలో బుధవారం ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు విద్యాసాగర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీ అగ్రనేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రాలను సమర్పించిన అనంతరం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం కుట్ర పూరితంగా సీఎఫ్‌ఎంఎస్‌, హెచ్‌ఆర్‌ఎంఎస్‌ అంటూ జీతాల విడుదల విషయంలో గందరగోళం సృష్టిస్తోందని, పాత జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడానికి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు. ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం తన బాధ్యతను మరిచి పోయిందన్నారు. ఏపీజీఈఏ కార్యదర్శి కృష్ణయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయట పెట్టాలన్నారు. 13 లక్షల మంది ఉద్యోగుల సమస్య కాబట్టి ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకు వేసి చర్చలకు పిలవాలని కోరారు. ఏపీ పీటీడీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు మాట్లాడుతూ, ఉద్యోగుల ఐక్య ఉద్యమాన్ని చూసైనా ప్రభుత్వ పెద్దలకు జ్ఞానం కలగాలన్నారు. ఏపీటీఎఫ్‌ నేత హృదయరాజు మాట్లాడుతూ, అశుతోష్‌ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అవమానపరిచిందన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు మాట్లాడుతూ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో అందరూ జాగృతం కావాలన్నారు. యూటీఎఫ్‌ అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పాలకులు తాత్కా లికంగా చట్టాలను అమలు చేయకపోవచ్చేమో కానీ, దీర్ఘకాలంలో ప్రజలే గెలుస్తారని అన్నారు. 


తాడోపేడో తేల్చుకుంటాం

 మచిలీపట్నంలో ఉద్యోగుల ర్యాలీ


మచిలీపట్నం టౌన్‌, జనవరి 26 : చీకటి జీవోలు రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, తాడోపేడో తేల్చుకుంటామని ఏపీ జేఏసీ చైర్మన్‌ ఉల్లి కృష్ణ అన్నారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు బుధవారం ధర్నాచౌక్‌ నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు 200 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి ఏపీ జేఏసీ చైర్మన్‌ ఉల్లి కృష్ణ, అమరావతి జేఏసీ చైర్మన్‌ నెల్సన్‌పాల్‌, ఏపీజీఏ చైర్మన్‌ పి.రాము, ఏపీజీఎఫ్‌ఏ చైర్మన్‌ కర్రా సునీల్‌, జేఏసీ కన్వీనర్‌ దారపు శ్రీనివాస్‌ తదితరులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉల్లి కృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ఉదాసీన వైఖరి అవలంభిస్తోందన్నారు. తూర్పు కృష్ణా జేఏసీ కన్వీనర్‌ దారపు శ్రీనివాస్‌ మాట్లాడుతూ, గురువారం నుంచి నాలుగు రోజుల పాటు ధర్నాచౌక్‌ వద్ద రిలే దీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోల రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకూరి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవోల సెక్రటరీ సాయికుమార్‌, ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శోభన్‌బాబు, ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు నాగరాజు, లెనిన్‌బాబు, ఉద్యోగ సంఘాల నేతలు ఎ.వెంకటేశ్వర రావు, రాజేంద్రప్రసాద్‌, కె.గౌరి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-27T06:54:47+05:30 IST