ఉద్యమ సెగ చూపిస్తాం

ABN , First Publish Date - 2022-01-24T06:24:15+05:30 IST

ఉద్యోగులతో పెట్టుకున్న ముఖ్యమంత్రులెవరూ మళ్లీ అధికారంలోకి రాలేకపోయారు.

ఉద్యమ సెగ చూపిస్తాం
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు విద్యాసాగర్‌

ఉద్యోగులతో పెట్టుకుంటే అధికారం కల్ల! 

రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాయొద్దు

ప్రజల్లో దురభిమానం కలిగిస్తారా? 

ఉద్యోగ, కార్మికులే మీకు బుద్ధి చెబుతారు

సమ్మె వరకు రానివ్వొద్దు

సత్వరమే సమస్యలు పరిష్కరించండి 

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు 


‘ఉద్యోగులతో పెట్టుకున్న ముఖ్యమంత్రులెవరూ మళ్లీ అధికారంలోకి రాలేకపోయారు. భారీ మెజారిటీతో గెలిచిన ఇందిరాగాంధీ, జయలలిత, ఎన్టీఆర్‌లు కూడా ఉద్యోగులతో పెట్టుకుని ఏమయ్యారో అందరికీ తెలుసు. రాజ్యాంగపరంగా ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిందే. కడుపు మండి పోరాటం చేస్తున్న ఉద్యోగుల మీద ప్రజల్లో దురభిప్రాయం కలిగించే ప్రయత్నం చేయడం హేయం. వలంటీర్ల ద్వారా కరపత్రాలు పంపిణీ చేయటం అంతకంటే సిగ్గుచేటు. ఈ ప్రభుత్వ అహంకారాన్ని దించగలిగే శక్తి ఉద్యోగులకు, కార్మికులకే ఉంది. సమ్మె వరకు రాకుండానే ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. లేద ంటే ఉద్యమ సెగ ఏమిటో చూపిస్తాం.’ అని ఉద్యోగ, ప్రజాసంఘాల నేతలు ఉద్ఘాటించారు. సోమవారం చీఫ్‌ సెక్రటరీకి సమ్మె నోటీసు ఇస్తున్న నేపథ్యంలో, ఆదివారం నగరంలోని ఎన్జీవో భవన్‌లో ఏపీఎన్జీవో అసోసియేషన్‌ పశ్చిమ కృష్ణా నేతృత్వంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో పాటు వివిధ ప్రజా సంఘాలు, లారీ ఓనర్ల సంఘం, ఇతర అసంఘటిత రంగ సంఘాలు సైతం పాల్గొని ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపాయి. రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తల అభిప్రాయాలు వారి మాటల్లోనే..  - ఆంధ్రజ్యోతి, విజయవాడ 


రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లోపించింది 

ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. ముఖ్యమంత్రి జగన్‌ కూడా దీనికి మినహాయింపు కాదు. ప్రజాస్వామ్య విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల తరఫున ఉద్యోగ సంఘాల ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. పీఆర్‌సీ నివేదిక బహిర్గతం చేయకపోవటం దుర్మార్గం. బహిర్గతం చేయకుండానే ఫిట్‌మెంట్‌ ప్రకటించడం చరిత్రలో ఎప్పుడూ లేదు. సోషల్‌ మీడియాలో ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రచారం చేయించటం, ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించటం బాధాకరం. ఉద్యోగుల సత్తా ఏమిటో ప్రభుత్వానికి చూపి డిమాండ్లను పరిష్కరించుకోవాలి. ఉద్యోగులను అణగదొక్కాలని చూసిన వారంతా భ్రష్టు పట్టిపోయారు. - కె.ఎస్‌.లక్ష్మణరావు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ 


సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు జీతాలు పెంచాలని ఆందోళన బాట పడితే ఉన్న జీతాల్లో కోత విధించారు. కొత్త జీవోలతో ఉద్యోగులకు తీవ్రమైన నష్టం కలుగుతోంది. రాజ్యాంగం కల్పించిన ఉద్యోగుల హక్కులను కాలరాయవద్దు. ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగం కాబట్టి.. వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. రాత్రికి రాత్రి జారీ చేసిన జీవోలను రద్దు చేయాలి. జీతాల బిల్లులు ట్రెజరీ ఉద్యోగులే పెట్టాలి. పీఆర్‌సీ సాధన సమితి పిలుపు మేరకు ఈ నెల 25న జిల్లావ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నాం. ఉద్యోగులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. - విద్యాసాగర్‌, ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు


తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఇది 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ పీఆర్‌సీలు ఊరికే ఇవ్వలేదు. ఉద్యోగులందరం కలిసి పోరాడి సాధించుకున్నాం. రాష్ట్రానికి తెలంగాణ కంటే తక్కువ ఆదాయం వస్తోందని ఏపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. పన్నుల పేరుతో ప్రజల నుంచి ప్రభుత్వం బాగానే వసూలు చేస్తోంది. ఉద్యోగుల సమస్యలు తీర్చాలంటే నవరత్నాల పథకాలు ఆపేయాలని సీఎం అంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి. - పాండురంగ ప్రసాద్‌, ఏపీటీఎఫ్‌ నాయకులు


హక్కును హరించారు 

చేసిన తప్పును సరిదిద్దుకోకుండా ముఖ్యమంత్రి మరోమారు తప్పు చేస్తున్నారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కరపత్రాలు పంచడం ఏ రాజనీతి? ఉద్యోగ సంఘాల శక్తిని, హక్కులను సీఎం జగన్‌ హరించారు. ఉద్యోగులు, కార్మికులతోనే జగన్‌ అహంకారాన్ని దించడం సాధ్యం. మీ అంతం, పంతం అణగదొక్కే సమయం ముందుంది. - ఓబులేసు, రాష్ట్ర ఏఐటీయూసీ కార్యదర్శి 


పెంచకపోగా కోత విధిస్తారా?

ప్రతి పీఆర్సీలోనూ ఉద్యోగులు అదనంగా రావాలని కోరుకుంటారు. 11వ పీఆర్సీలో అదనంగా రాకపోగా, ఉన్నవి కూడా పోయే పరిస్థితి ఏర్పడింది. ఫిట్‌మెంట్‌కు సంబంధించి ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత మిగిలిన అంశాలను సీఎస్‌తో మాట్లాడుకోవాలని చెప్పారు. సీఎస్‌ను కలిసిన సందర్భంలో హెచ్‌ఆర్యేలో ఎలాంటి కోత విధించవద్దని కోరాం. అప్పుడు సరేనని చెప్పిన సీఎస్‌ రాత్రికి రాత్రి జీవోలు జారీ చేయించారు. హెచ్‌ఆర్యే కోత వల్ల ఉద్యోగులు నష్టపోయారన్నది యదార్థం. కరోనా కాలంలోనూ, అంతకుముందు ఉన్న పరిస్థితుల కారణంగా ప్రభుత్వానికి ఎంతగానో సహకరించాం. ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళన తప్ప మరో మార్గం లేదు. - కె.శివారెడ్డి, ఏపీ ఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి 


ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి

ప్రజలు, ఉద్యోగుల నడుమ ప్రభుత్వం తగాదా పెడుతోంది. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం అసత్య ప్రచారాలకు పూనుకుంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఉద్యోగులు వ్యతిరేకమనే సందేశాన్ని ప్రజలకు పంపుతోంది. ప్రజలకు విజయవంతంగా పథకాలు అందుతున్నాయంటే అది ఉద్యోగుల కృషి వల్లనే అని ప్రభుత్వం గుర్తించాలి. ప్రజలు కూడా వాస్తవం గ్రహించాలి. ఉద్యోగుల ఇబ్బందులను కూడా అర్థం చేసుకోవాలి. ఉద్యోగ వర్గాలు, ప్రజా సంఘాలు కలిసి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. - శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యదర్శి 


పెనం మీద నుంచి పొయ్యిలోకి

ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఈహెచ్‌ఎస్‌ కార్డుతో ఒక్క ఆసుపత్రిలో కూడా ఆర్టీసీ ఉద్యోగులను చేర్చుకోవటం లేదు. వైద్యం అందక ఆర్టీసీ ఉద్యోగులు అనేకమంది చనిపోయారు. పీఆర్‌సీ తో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు గణనీయంగా తగ్గిపోతాయి. ప్రభుత్వంలో విలీనం వల్ల ఒక పీఆర్సీని ఆర్టీసీ ఉద్యోగులు కోల్పోతున్నారు. దీనికి తోడు పదేళ్లకు పీఆర్‌సీ ఇస్తే అత్యధికంగా నష్టపోయేది ఆర్టీసీ ఉద్యోగులే. ఇలాంటి రివర్స్‌ పీఆర్సీలను ఇప్పటి వరకు చూడలేదు. - శ్రీనివాసరావు, ఏపీ పీటీడీ ఈయూ జిల్లా కార్యదర్శి 


ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తీరలేదు 

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా పీఆర్సీ ఇస్తారని ఆశించాం. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు 19 శాతం ఐఆర్‌ తేడా ఉంది. గతంలో నాలుగేళ్లకు ఒకసారి ఆర్టీసీలో వేతన సవరణ ఉండేది. ఇప్పుడు పదేళ్లకు వేతన సవరణ అంటే ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుంది. అర్ధరాత్రి జీవోల వల్ల ఆర్టీసీ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ 16 నుంచి 8 శాతానికి తగ్గిపోతోంది. ఆర్టీసీ ఉద్యోగులం సమ్మెలో పాల్గొని రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తాం. - సుజాత, ఏపీ పీటీడీ ఎన్‌ఎంయూ నాయకురాలు 


చావు ఖర్చుల్లోనూ ప్రభుత్వం మిగుల్చుకోవాలని చూస్తోంది

పెన్షనర్లు గతంలో సాధించుకున్న అదనపు క్వాంటం పెన్షన్‌ ను కోల్పోతున్నారు. 70 ఏళ్లకు పది శాతం, 75 ఐదు ఏళ్లకు 15 శాతం అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌ను ప్రభుత్వం ఈ పీఆర్‌సీ జీవోల ద్వారా తీసివేసింది. డెత్‌ రిలీఫ్‌గా ఒక నెల జీతం ఇస్తుండగా, దానిని రూ.20 వేలకు పరిమితి చేసింది. ఉద్యోగుల చావు ఖర్చుల్లోనూ ప్రభుత్వం మిగుల్చుకోవాలని చూస్తోంది. ఇది దుర్మార్గం. - విష్ణువర్థన్‌, పెన్షనర్ల సంఘం నేత 


ఘర్షణాత్మక వైఖరి తగదు 

సీపీఎస్‌ రద్దుకు సంబంధించి జేఏసీలకు స్పష్టంగా చెప్పాం. పీఆర్సీ ముఖ్యమే. కాదనటం లేదు. కానీ పీఆర్‌సీ రద్దుకు సంబంధించి కూడా ప్రభుత్వంతో ఆందోళనకు జేఏసీలకు మద్దతు పలుకుతున్నాం. అన్ని కార్యక్రమాలకు మా వంతు సహకారం అందిస్తాం. ఈ ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరిని తీసుకు వచ్చింది. - వాసు, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం 

రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - 2022-01-24T06:24:15+05:30 IST