రోజూ ఆఫీసులో దైవప్రార్థన చేయాలంటూ కంపెనీ ఆదేశాలు.. దీన్ని వ్యతిరేకించిన ఉద్యోగులను తొలగించడంతో..

ABN , First Publish Date - 2022-07-01T03:05:50+05:30 IST

రోజూ ఆఫీసులో ప్రార్థన చేయాలన్న కంపెనీ ఆదేశాలను పాటించనందుకు తమను తొలగించారంటూ ఇద్దరు ఉద్యోగులు కోర్టుకెక్కరారు.

రోజూ ఆఫీసులో దైవప్రార్థన చేయాలంటూ కంపెనీ ఆదేశాలు.. దీన్ని వ్యతిరేకించిన ఉద్యోగులను తొలగించడంతో..

ఎన్నారై డెస్క్: రోజూ ఆఫీసులో ప్రార్థన చేయాలన్న కంపెనీ ఆదేశాలను పాటించనందుకు తమను తొలగించారంటూ ఇద్దరు అమెరికా ఉద్యోగులు కోర్టుకెక్కారు. దేవుడిపై నమ్మకం లేని తమతో ఇలా ప్రార్థన చేయించడం సబబు కాదని ఫిర్యాదు చేశారు. అమెరికాలోని నార్త్‌కెరోలినా(North carolina) రాష్ట్రంలోగల ఆరోరా ప్రో కంపెనీలో ఈ ఉదంతం వెలుగు చూసింది. ప్రతిరోజు కంపెనీలో జరిగే ప్రార్థనాకార్యక్రమానికి ఉద్యోగులు హాజరుకావాలంటూ యజమాని ఒత్తిడి చేస్తున్నట్టు జాన్ మెక్‌గాహా, మెకెన్జీ శాండర్స్ ఆరోపించారు. ప్రార్థనలు చేయని వారిని ఉద్యోగం నుంచి తీసేస్తామంటూ కంపెనీ ఓనర్ బహిరంగంగానే హెచ్చరించే వారని వాపోయారు. దాదాపుగా రెండేళ్లుగా ఈ వ్యవహారం సాగుతోందని చెప్పారు. బైబిల్‌లోని సూక్తులను పఠించడం, ప్రార్థనలు చేయడం నిత్యకృత్యంగా మారిందన్నారు. 


ఉద్యోగులందరూ ఓ వలయాకారంలో నిలబడి ప్రేయర్ చేయాల్సి వచ్చేదని చెప్పారు. ఇదంతా తమకు అనుమానాస్పదంగా తోచిందన్నారు. తాను దేవుడిని నమ్మనని జాన్ తెలుపగా.. దేవుడికి సంబంధించి ఏ వివరాలు మానవులకు తెలిసే అవకాశం లేదనేది తన నమ్మకమని మెకెన్జీ చెప్పారు. తమ నమ్మకాల రీత్యా ప్రార్థనల నుంచి మినహాయింపు కోరగా కంపెనీ ఓనర్ తిరస్కరించారని మండిపడ్డారు. ఆ తరువాత కొద్ది రోజులకే తమను ఉద్యోగాల నుంచి తొలగించారన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కోర్టులో కేసు వేశారు. 

Updated Date - 2022-07-01T03:05:50+05:30 IST