నిరీక్షణ ఇంకెన్నేళ్లు?

ABN , First Publish Date - 2022-01-25T06:46:19+05:30 IST

‘మూడు దశాబ్దాల నిరీక్షణ ఇది. క్రమబద్ధీకరణ కోసం ఇంకెన్నేళ్లు నిరీక్షించాలి?

నిరీక్షణ ఇంకెన్నేళ్లు?
‘వేడుకోలు‘ సభలో మాట్లాడుతున్న ఏపీజీఈఏ జేఏసీ చైర్మన్‌ సూర్యనారాయణ

క్రమబద్ధీకరణ ఎన్నికల హామీలకే పరిమితమా?

మా సమస్య పరిష్కారం ప్రభుత్వానికి భారం కాదు

మూడు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి.. స్పందించండి

సీఎంకు ఎన్‌ఎంఆర్‌, టైమ్‌స్కేల్‌, ఫుల్‌టైమ్‌, పార్ట్‌ టైమ్‌, కంటింజెంట్‌, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగుల వేడుకోలు 

ప్రత్యేక ఆహ్వానితులుగా పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు

చట్టసభల్లో ప్రస్తావిస్తామని హామీ 

సంఘీభావం ప్రకటించిన జేఏసీ నేతలు


‘మూడు దశాబ్దాల నిరీక్షణ ఇది. క్రమబద్ధీకరణ కోసం ఇంకెన్నేళ్లు నిరీక్షించాలి? రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా, ప్రభుత్వ ప్రయోజనాలు అందవు. మా సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు హామీలు ఇస్తారు. అధికారంలోకి వచ్చాక కేబినెట్‌ కమిటీలు.. ఉన్నతాధికారుల కమిటీలు వేస్తారు. కోర్టు తీర్పులను సాకుగా చూపుతారు. మాది న్యాయమైన డిమాండ్‌ అని మీకు తెలియదా? పెన్షన్‌, కారుణ్య నియామకాలు, హెల్త్‌ కార్డులు వంటివి పొందుతామనే ఆశతోనే కదా రెగ్యులరైజ్‌ చేయాలని అడుగుతున్నాం. దీని వల్ల ప్రభుత్వానికి ఏ విధమైన భారమూ ఉండదు. తక్షణమే మమ్మల్ని రెగ్యులరైజ్‌ చేయండి. ఇది మా వేడుకోలు..’ అంటూ విజయవాడ వేదికగా ఎన్‌ఎంఆర్‌, టైమ్‌స్కేల్‌, ఫుల్‌టైమ్‌, పార్ట్‌ టైమ్‌, కంటింజెంట్‌, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యపై చట్టసభల వేదికగా గళం వినిపించేందుకు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలను ఆహ్వానించారు. పీఆర్సీ అనుబంధ అంశం కావటంతో నాలుగు జేఏసీల అగ్రనేతలను కూడా ఆహ్వానించారు. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వంతో జరిపే చర్చల్లో వీరి సమస్యను ప్రస్తావిస్తామని జేఏసీ నేతలు హామీ ఇచ్చారు. - ఆంధ్రజ్యోతి, విజయవాడ


దగా పడిన ఉద్యోగులు 

ఎన్‌ఎంఆర్‌, టైమ్‌స్కేల్‌, ఫుల్‌టైమ్‌, పార్ట్‌ టైమ్‌, కంటింజెంట్‌, కన్సాలిడేటెడ్‌ విధానంలో పనిచేస్తున్న నాలుగు వేల మంది ఉద్యోగులు తమను రెగ్యులర్‌ చేయాలని మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. వీరి సమస్యల పరిష్కారానికి సుప్రీం తీర్పు అడ్డుగా ఉంది. రాజకీయపార్టీలు ఇవేమీ తెలుసుకోకుండానే ఎన్నికలకు ముందు హామీలు ఇస్తారా? - కె.ఆర్‌.సూర్యనారాయణ, ఏపీజీఈఏ జేఏసీ చైర్మన్‌ 


కమిటీలు వేసినా పరిష్కారం లేదు

సమస్య పరిష్కారం కోసం కేబినెట్‌ కమిటీలు వేశారు. ఉన్నతాధికారుల కమిటీలు వేశారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. ఉద్యోగ, ఆరోగ్య భద్రత, రెగ్యులరైజ్‌ వంటి 71 అంశాలపై జేఏసీలు ఇచ్చిన కార్యాచరణలో  వీరి సమస్యను పేర్కొన్నాం. చర్చల్లోనూ మాట్లాడతాం. - వైవీ రావు, ఏపీ పీటీడీ ఈయూ అధ్యక్షుడు


రూపాయి భారం పడదు 

ప్రభుత్వం అనుకుంటున్న కాంట్రాక్టు కార్మికులు వేరు. మేము చెప్పే ఉద్యోగులు వేరు. వీరికి ఇప్పటికే ప్రభుత్వం పే డీఏలు ఇస్తోంది. వీరిని రెగ్యులరైజ్‌ చేయటం వల్ల ప్రభుత్వంపై పడే భారం ఏమీ లేదు. మేం చెబుతున్న అంశాలను పరిగణన లోకి తీసుకుని న్యాయబద్ధమైతేనే సమస్యను పరిష్కరించండి. - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌


ఎదుగూ, బొదుగూ లేదు 

ఒకప్పుడు సర్పంచులు డబ్బులు తీసుకుని రెగ్యులరైజ్‌ చేయిస్తున్నా రనే ఉద్దేశంతో 212 జీవోను తీసుకువచ్చారు. దీని ప్రకారం ఐదు, పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారిని రెగ్యులరైజ్‌ చేయాలి. 30 ఏళ్లు గడిచినా చేయలేదు. చర్చల్లో ప్రస్తావిస్తాం. - బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్‌


బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తాం 

ఇలాంటి ఉద్యోగులు యూనివర్సిటీల్లో కూడా ఉన్నారు. బేసిక్‌, డీఏలు వర్తింపులో ఉండి కూడా రెగ్యులైజేషన్‌ కాకపోవటం బాధాకరం. ఉమాదేవి వర్సెస్‌ కర్నాటక కేసులో 2/94 యాక్ట్‌ కంటే ముందున్న వారిని రెగ్యులరైజ్‌ చేయమని ఆదేశాలు ఉన్నాయి. ప్రభుత్వం తక్షణం సమస్యను పరిష్కరించాలి. వీరి సమస్యలను బడ్జెట్‌ సమావేశాల్లో లేవనెత్తుతాం. - కె.ఎస్‌.లక్ష్మణరావు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ 


జీవన్మరణ సమస్య

1988-1993 మధ్య రెగ్యులర్‌ పోస్టుల ఖాళీలు భర్తీ చేయకపోవటంతో ఎన్‌ఎంఆర్‌, టైమ్‌స్కేల్‌, ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌, కంటింజెంట్‌, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగులను నియమించారు. పదేళ్ల కాలపరిమితిలో ఐదు, పది రోజుల తేడాతో మిగిలి పోయిన ఐదు వేల మంది ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులను చవి చూస్తున్నారు. - సురేష్‌, రాష్ట్ర సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకుడు


పరిష్కారానికి కృషి జరగాలి

ఏ ప్రభుత్వమూ వీరి సమస్యను పరిష్కరించలేదు. వీరికి ఇంకా నాలుగైదేళ్ల సర్వీసు కూడా లేదు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలం శాసనమండలిలో గట్టిగా ప్రస్తావిస్తాం. మండలి బయట కూడా ఈ కృషి జరగాలి. నాలుగు జేఏసీల నాయకత్వం ప్రభుత్వంతో వీరి సమస్యలను ప్రస్తావించాలి. - షేక్‌ సాబ్జీ, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ


మూడు దశాబ్దాలుగా అన్యాయం

మూడు దశాబ్దాలుగా ఈ ఉద్యోగులు అన్యాయానికి గురవుతున్నారు. పెన్షన్లు, హెల్త్‌ కార్డులు తదితర ప్రయోజనాల కోసమే రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతు న్నారు. వీరి డిమాండ్లలో న్యాయం ఉంది.  - పాండురంగ ప్రసాద్‌, ఏపీటీఎఫ్‌ కార్యదర్శి 


పదో పీఆర్సీలోనే నివేదిక 

పదవ పీఆర్సీలోనే వీరిని రెగ్యులరైజ్‌ చేయాలని నివేదిక ఇచ్చాం. ఇప్పటి వరకు అమలు జరగలేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎలాగూ రెగ్యులరైజ్‌ చేయాలి. వారితో పోల్చుకుంటే వీరు చాలా తక్కువ మంది ఉన్నారు. - కె.శివారెడ్డి, ఏపీ ఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి

Updated Date - 2022-01-25T06:46:19+05:30 IST