ఉద్యోగుల సమరభేరి

ABN , First Publish Date - 2022-01-27T04:59:19+05:30 IST

పీఆర్సీ సాధన ఉద్యమంలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఉద్యోగుల సమరభేరి
పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో లాడ్జీసెంటర్లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఉద్యోగుల నిరసన

జిల్లావ్యాప్తంగా భారీ ర్యాలీలు

అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, జనవరి 26: పీఆర్సీ సాధన ఉద్యమంలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రం ఇచ్చారు. ఈసందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న విధానాలను ముక్తకంఠంతో ఖండించారు. గుంటూరు నగరంలో తాలుకా కార్యాలయం నుంచి వందలాదిగా ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొని లాడ్జిసెంటర్‌ వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం సెంటర్లోని అంబేద్కర్‌ విగ్రహానికి డిమాండ్లతో కూడిన మెమోరాండం సమర్పించారు. తెనాలిలో రజక చెరువు సర్కిల్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ రైల్వేస్టేషన్‌ వరకు కొనసాగింది. ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు. పీఆర్సీ చీకటి జీవోలను రద్దు చేసేంతవరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేదే లేదని నాయకులు సందర్భంగా తేల్చి చెప్పారు. వినుకొండ తాలూకా పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో నరసరావుపేట రోడ్డులోని బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పీఆర్సీ సాధన సమితి సత్తెనపల్లి తాలుకా యూనిట్‌ ఆధ్వర్యంలో పట్టణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేసి వినతిపత్రాన్ని అందించారు. పొన్నూరు పట్టణంలోని ఐలాండ్‌ సెంటర్‌లో నిరసన నిర్వహించారు. ప్రభుత్వ జీవోలకు వ్యతిరేకంగా నినిదాలు చేశారు. నరసరావుపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పీఆర్సీ సాధన సమితి చిలకలూరిపేట ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం, గాంధీ పార్కు ఎదురుగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందించారు.

నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు..

నిరసనల్లో భాగంగా గురువారం నుంచి నాలుగు రోజుల పాటు జిల్లా కలెక్టర్‌ కార్యలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు జరుగుతాయని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. దీక్షల్లో ఉద్యోగులతో పాటు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, ఔట్‌ సోర్సింగ్‌, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు.   


Updated Date - 2022-01-27T04:59:19+05:30 IST