అక్రమాలకు చెక్‌ పడేనా..?

ABN , First Publish Date - 2021-11-17T06:26:35+05:30 IST

ఉపాధి హామీ పథకం కేంద్రం చేతుల్లోకి తీసుకుంటున్నట్లు క్షేత్రస్థాయిలో పరిణామాలను బట్టి తెలుస్తోంది.

అక్రమాలకు చెక్‌ పడేనా..?

కేంద్రం చేతుల్లోకి ‘ఉపాధి’..!

అక్రమాలకు చెక్‌ పడేనా..?

రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని సాఫ్ట్‌వేర్‌ మార్పు

కేంద్రం ఆధీనంలోని ‘నరేగా’ అమలు

ఈనెల 22 నుంచి కొత్త దాని ద్వారా నిధుల విడుదల

అనంతపురం వ్యవసాయం, నవంబరు 16: ఉపాధి హామీ పథకం కేంద్రం చేతుల్లోకి తీసుకుంటున్నట్లు క్షేత్రస్థాయిలో పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఉపాధి కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ స్థానంలో కేంద్రం సొంత సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయనున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ఉపాధి అక్రమాలకు కొత్త సాఫ్ట్‌వేర్‌ ద్వారా కళ్లెం పడేనా అనే అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఉపాధి పనులతోపాటు పలు ప్రభుత్వ శాఖల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నరేగా సాఫ్ట్‌వేర్‌ ద్వారానే బిల్లుల అప్‌లోడ్‌, నిధుల విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ర్టాల్లో అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని ప్రైవేటు కంపెనీలకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఉపాధి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కంపెనీతో రూపొందించిన రాగాస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఉపాధి నిధులతో చేపట్టే పనులకు సంబంఽధించి వర్క్‌ ఐడీలు క్రియేట్‌ చేయడం, బిల్లుల చెల్లింపు ప్రక్రియ సాగుతోంది. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను అమలులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలకు చెబుతున్నా.. పాత సాఫ్ట్‌వేర్‌నే కొనసాగిస్తున్నారు. ఏపీలో ఉపాధి నిధుల వినియోగంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఆది నుంచీ బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర బృందం పర్యటనలో జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉపాధి పనుల్లో డొల్లతనం బయటపడింది. జిల్లాలో పర్యటించిన బృందం సభ్యులు.. ఉపాధి పనుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని సాఫ్ట్‌వేర్‌కు బదులుగా కేంద్రం నరేగా సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయనుంది. మూడు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను బంద్‌ చేశారు. రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ను తెరపైకి తెచ్చారు. ఈనెల 21వ తేదీదాకా కొత్త సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌లో పెట్టినట్లు డ్వామా అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 22వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. పాత పద్ధతిలో మండల, జిల్లాస్థాయి కంప్యూటర్‌ కేంద్రాలు, ఐడబ్ల్యూఎంపీ బిల్లులను వేర్వేరుగా పాస్‌ చేస్తూ వస్తున్నారు. కొత్త విధానంలో కేవలం మండలస్థాయి కంప్యూటర్‌ కేంద్రం ద్వారానే అన్నిరకాల బిల్లులు అప్‌లోడ్‌ చేయడంతోపాటు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డబ్బు చెల్లించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.


డ్వామా యంత్రాంగంలో గుబులు

కేంద్ర ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ అమలుతో డ్వామా యంత్రాంగంలో గుబులు మొదలైంది. మూడు రోజుల క్రితం పాత సాఫ్ట్‌వేర్‌ బంద్‌ అయ్యేదాకా అవెన్యూ ప్లాంటేషన, డ్రైల్యాండ్‌ హార్చికల్చర్‌, ట్రీగార్డ్‌ తదితర పలు రకాల బిల్లులను ఆగమేఘాలపై అప్‌లోడ్‌ చేసి, పాస్‌ అయ్యేలా జాగ్రత్త పడినట్లు తెలిసింది. కొత్త సాఫ్ట్‌వేర్‌లో ఏ విధంగా ఉంటుందోనన్న అనుమానాలతో ముందస్తుగా బిల్లులు పాస్‌ చేసుకున్నట్లు తెలిసింది. ఇందులో డ్వామా పీడీ కార్యాలయంలో పనిచేసే కొందరు అధికారులు చక్రం తిప్పినట్లు సమాచారం.

Updated Date - 2021-11-17T06:26:35+05:30 IST