యాత్రకొస్తేనే ‘ఉపాధి’

ABN , First Publish Date - 2022-05-27T08:33:21+05:30 IST

యాత్రకొస్తేనే ‘ఉపాధి’

యాత్రకొస్తేనే ‘ఉపాధి’

మస్టర్‌ వేసి మరీ కూలీల తరలింపు

రాకుంటే వేతనాలు వదులుకోవాల్సిందే

మంత్రుల యాత్ర కోసం ‘కూలీలు’, డ్వాక్రా

మహిళలకు అధికారులు, వైసీపీ నేతల హెచ్చరికలు

పలుగు, పార, తట్ట, మట్టి బట్టలతోనే తరలింపు

నీళ్లిచ్చే దిక్కూ లేక మధ్యలోనే వెళ్లిపోయిన కూలీలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) 

‘‘యాత్రకు రాకుంటే ‘హామీ’లో మీ పేర్లు ఉండవు. ఉపాధికి కోత వేస్తాం. వేతనాలు ఇవ్వం’’... ఉపాధి కూలీలకు అధికారుల, వైసీపీ నేతల బెదిరింపులు ఇవి. గురువారం మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర’ శ్రీకాకుళంలో ప్రారంభమయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన మంత్రులు మొత్తం 17 మంది ఈ యాత్రలో పాల్గొనాల్సి ఉంది. అయితే కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం, రవాణా మంత్రి పినిపె విశ్వరూప్‌ గైర్హాజరయ్యారు. శ్రీకాకుళంలో 9.30 గంటలకు మీడియా సమావేశంతో కార్యక్రమం ఆరంభమయింది. అక్కడ నుంచి చిలకపాలెం, రణస్థలం, పైడిభీమవరం మీదుగా యాత్ర విజయనగరం చేరుకునే సరికి సాయంత్రం గం.6.40 అయింది. శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్‌ వద్ద సభ ఏర్పాటు చేశారు. మండే ఎండలో శ్రీకాకుళం రూరల్‌, గార మండలాల నుంచి ఉపాధి కూలీలను మస్టరు వేసి తరలించారు. టెంటు నీడలో మంత్రులు మాట్లాడుతుంటే ఎండకు జనం అల్లాడిపోయారు. తమను తీసుకువచ్చిన నేతలను మంచినీళ్లు అడిగి విసిగిపోయిన కూలీలు, మహిళలు సభ మధ్యలోనే వెనుదిరిగారు.


రణస్థలంలోనూ అదే తంతు...

ఎచ్చెర్ల నియోజకవర్గంలోని చిలకపాలెం, రణస్థలం జాతీయ రహదారి వద్ద మంత్రులు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రణస్థలం సభకు జన సమీకరణ కోసం ముందురోజు నుంచి స్థానిక వైసీపీ నేతలు... ఉపాధి హామీ వేతనదారులు భారీగా హాజరయ్యేలా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలంటూ అప్రమత్తం చేశారు. నేతల ఉత్తర్వుల నేపథ్యంలో అధికారులు వేతనదారులపై బెదిరింపులకు దిగారు. యాత్రకు రాకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలిలోనూ ఇదే పరిస్థితి. దీంతో నేతలు సమకూర్చిన వాహనాల్లో పని కోసం తెచ్చుకున్న పలుగు, పార, తట్ట, బుట్టలతో ఉపాధి కూలీలు ఊసురోమంటూ బయలుదేరారు. మంత్రుల రాకకోసం మట్టికొట్టుకున్న దుస్తులతో, నెత్తిమీద తట్టలతో వారంతా దారిపొడవునా మండుటెండలో నిలబడ్డారు. వారిని తరలించిన అధికారులు కానీ, నేతలు కానీ వారికి ఎటువంటి సౌకర్యమూ కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. 


విజయనగరం సభకు వర్షం దెబ్బ

విజయనగరం జిల్లా కేంద్రంలో సామాజిక న్యాయ భేరి సదస్సు రద్దయింది. మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిన మంత్రుల బస్సు 6.40కి విజయనగరం చేరుకుంది. అప్పటికే భారీ వర్షం కురుస్తోంది. దీంతో వేదికపైకి వచ్చిన మంత్రులు అభివాదం చేస్తూ తిరిగి బస్సులోకి వెళ్లిపోయారు. అనంతరం విశాఖకు బయలుదేరారు. 


తరలింపునకు 100 ఆర్టీసీ బస్సులు

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈ సదస్సు కోసం సుమారు 100 బస్సులు వినియోగించారని సమాచారం. పెద్దఎత్తున డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలును వాటిలో తరలించారు. ‘మంత్రులూ గో బ్యాక్‌’ కార్యక్రమానికి సిద్ధమైన దళిత నాయకులను గురువారం ఉదయమే పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఎ్‌ఫఐ నేతలను కూడా ముందస్తుగా అరెస్టు చేశారు. 


‘సంక్షేమం’ కోసం తలొంచాల్సిన పనిలేదు

‘‘ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందుకునేందుకు లబ్ధిదారులు ఎవరివద్దా తలొంచే అవసరం లేదు. ఇదే గొప్ప మార్పు. బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు రాష్ట్రమంతా తిరిగారు. కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో అవినీతిపై ఒక్క ఆరోపణా చేయలేకపోయారు’’ అని రాష్ట్ర మంత్రులు అన్నారు. సిక్కోలు నుంచి రాష్ట్ర మంత్రులు తలపెట్టిన ‘సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర’ గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక ఏడు రోడ్ల జంక్షన్‌ వద్ద జరిగిన బహిరంగ సభలోనూ, అంతకు ముందు జరిగిన మీడియా సమావేశంలోనూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, అప్పలరాజు ప్రసంగించారు. ‘‘రాష్ట్రానికి సమకూరిన ఆర్థిక వనరుల పంపిణీలో 82 శాతం బడుగులు, వెనుకబడిన వర్గాలకు చేరుతోంది. బడుగు, బలహీన వర్గాలను పైకి తీసుకువచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుందని అంబేడ్కర్‌ చెప్పారు. రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అమలుచేస్తున్న నాయకుడు జగన్‌’’ అని పేర్కొన్నారు.





Updated Date - 2022-05-27T08:33:21+05:30 IST