వైద్యం లేని చోట..

Published: Sun, 22 May 2022 00:56:50 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వైద్యం లేని చోట..

ఓపీడీ బిల్డింగ్‌ పూర్తయ్యేదెన్నడో

కీలక వైద్యులు లేక ఇబ్బంది 

పదోన్నతిపై వెళ్లిన స్పెషలిస్టుల పోస్టులు ఖాళీ 

నత్తనడకన జీరియాట్రిక్‌, డీఈఐసీ భవన నిర్మాణాలు 

వైద్యం అందించలేని స్థితిలో జిల్లా వైద్యశాల


-నంద్యాల టౌన్‌

 

ఆస్పత్రి భవనాలు సరిగా లేకపోయినా... వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా నంద్యాల ప్రజలు సర్దుకుపోవాల్సి వస్తోంది. కొత్త జిల్లాలో పాత కష్టాలు తీరుతాయని అనుకున్నారు. ఆ ఆశ కనిపించడం లేదు. జిల్లా కేంద్రంగా మారిందన్న ఆర్భాటమే గాని వైద్య రంగంలో కనీస మార్పులు వస్తాయనే నమ్మకం కలగడం లేదు. స్పెషలిస్టుల దగ్గరి నుంచి ల్యాబ్‌ అసిస్టెంట్ల దాకా 106 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మూడేళ్లుగా సాగుతున్న ఓపీడీ బిల్డింగ్‌ అతీగతి లేదు. డీఈఐసీ భవనం, జీరియాట్రిక్‌ వార్డు పనులు పూర్తి కాలేదు. ఇదీ నంద్యాల జిల్లా వైద్యశాల వైనం. 


ఈ చిత్రం చూడండి. ఓపీడీ బిల్డింగ్‌ పరిస్థితి ఇది. మూడేళ్లుగా ఇలాగే ఉంది. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ వైద్య విధాన పరిషత్‌ ద్వారా ప్రత్యేకంగా ఓపీ కోసం రూ.5.50కోట్లతో భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2017జులై 13న రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిధులు మంజూరు చేసింది. భవన నిర్మాణానికి పిలిచిన టెండర్లలో కర్నూలుకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ 12.69 శాతం తక్కువ మొత్తానికి టెండర్‌ వేసి పనులు దక్కించుకున్నారు. పనులను పూర్తి చేసేందుకు 15 నెలల కాలం నిర్ణయించారు. 2019 సెప్టెంబర్‌ 12న కాంట్రాక్టర్‌ మృతి చెందారు. అప్పటికి రూ.1.60 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. ఇందులో కాంట్రాక్టర్‌కు రూ.60 లక్షలకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికీ ఆ కాంట్రాక్టర్‌ కుటుంబానికి బకాయిలు చెల్లించలేదని సమాచారం. జీప్లస్‌ 1 భవన నిర్మాణంలో భాగంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 9,870 చదరపు అడుగులు, మొదటి అంతస్తులో 6,850 చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనాన్ని పూర్తి చేయాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడేళ్లుగా ఈ పనులు మూలనపడ్డాయి. పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బిల్లులు రావేమోనన్న భయంతో ఆరుసార్లు రీ టెండర్లు పిలిచినా ఒక్కరూ టెండర్‌ దాఖలు చేయలేదు. వందలాది మంది రోగులకు ఓపీ సౌకర్యం కోసం తలపెట్టిన ఈ భవన నిర్మాణాన్ని వైసీపీ ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. 


సేవలు అందేది ఎప్పుడో...


నంద్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి చేపట్టిన పనులు ఇలా ఉన్నాయి. ఈ భవనాలు పూర్తయి ప్రజలకు వైద్య సేవలు ఎప్పటికి అందుతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఆస్పత్రిని 200 పడకల నుంచి 300 పడకల స్థాయికి గత ప్రభుత్వం పెంచింది. ఈ స్థాయికి తగ్గట్టు మౌలిక సదుపాయాల కల్పనలో మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.  ఆస్పత్రికి ప్రతిరోజు దాదాపు 1200మందికి పైగా అవుట్‌ పేషెంట్లు వివిధ ప్రాంతాల నుంచి వైద్యం కోసం వస్తారు. సరిహద్దుల్లోని కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాల నుంచి కూడా ఈ ఆస్పత్రికి రోగులు వస్తారు. కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి, నంద్యాల- గిద్దలూరు ప్రధాన రహదారుల్లో ఎక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగినా బాధితులను ఇక్కడికే తీసుకొని వస్తారు. ఆత్మహత్యాయత్నాలు, దాడులు, ప్రతిదాడుల్లో అత్యవసర వైద్యానికి ఇక్కడికే తీసుకొస్తారు. గుంటూరు - గుంతకల్లు రైలు మార్గంలోని నంద్యాల పరిధిలోకి వచ్చే ప్రాంతంలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇక్కడికే తరలిస్తారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. 


 గైనిక్‌ ఓపీకి ఇద్దరే


జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ విభాగం 100 పడకలతో ఉంది. నిత్యం దాదాపు 200 మంది మహిళలు వైద్యం కోసం వస్తారు. గర్భిణులు, బాలింతలతో పాటు స్త్రీ సంబంధిత వ్యాధులకు చికిత్స పొందేందుకు వచ్చే మహిళలను పరీక్షించేందుకు కేవలం ఇద్దరు గైనకాలజిస్ట్‌లు మాత్రమే ఉన్నారు. వీరు రోజుకు 200మంది మహిళలను పరీక్షించడం అసాధ్యం. ఇన్‌ పేషెంట్లుగాఉండే మహిళలను (బాలింతలు, డెలివరీ కోసం వచ్చిన మహిళలు, గర్భసంచి ఆపరేషన్ల కోసం వచ్చే మహిళలు) రౌండ్లకు వెళ్లి పరీక్షించడానికి ఇద్దరు గైనకాలజిస్టులు సరిపోరు. కానీ ఈ విభాగం కేవలం ఇద్దరు వైద్యులతోనే నడుస్తోంది. 


 వైద్యులు... సిబ్బంది కొరత 


నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. నాలుగు గైనకాలజిస్ట్‌ల పోస్టులు, జనరల్‌ మెడిసిన్‌ - 1, జనరల్‌ సర్జరీ - 1, ఆర్థో - 1, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు - 9తో పాటు ఫిజియోథెరపిస్ట్‌, సైకాలజిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ అసిస్టెంట్‌ తదితర 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో మొత్తం 106 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల భర్తీ ప్రతిపాదలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న జనరల్‌ సర్జరీ - 1, జనరల్‌ మెడిసిన్‌ - 2, అనస్థీసియా - 1, పిడియాట్రిక్‌ - 1, గైనకాలజిస్ట్‌ - 1 మొత్తం 6మంది డాక్టర్లు పదోన్నతిపై ఇక్కడి నుంచి రిలీవ్‌ అయ్యారు. వారి స్థానంలో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. విధుల్లో ఉన్న డాక్టర్లు పదోన్నతిపై వెళ్లడం, అంతకుముందు నుంచే కొనసాగుతున్న డాక్టర్ల కొరతతో రోగులకు వైద్య సేవలందించడంలో క్లిష్ట పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతిరోజూ జరిగే వివిధ రకాల ఆపరేషన్ల సంఖ్య 50 శాతానికి పడిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితిపై ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. 


సదుపాయాలు కల్పించాలి 


2019 ఫిబ్రవరి 13న నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి స్థాయిని 200 పడకల నుంచి 300కు పెంచుతూ వైద్యవిద్య శాఖ మంత్రిగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇప్పించాను. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రోగుల రద్దీకి అనుగుణంగా వైద్యసేవలను అందించేందుకు ఓపీడీ బిల్డింగ్‌కు నిధులు విడుదలయ్యాయి. మూడేళ్లుగా ఓపీడీ బిల్డింగ్‌ను పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణం. ప్రభుత్వంపై నమ్మకం లేకనే టెండర్లలో కాంట్రాక్టర్లు పాల్గొనడం లేదు. ప్రభుత్వమే పెండింగ్‌ పనులను ఏదైనా ప్రభుత్వ శాఖ ద్వారా పూర్తి చేయించాలి. వైద్యులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమిస్తే ఇదే ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్‌ కళాశాలను ప్రారంభించేందుకు అవకాశం కలుగుతుంది. ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిలో వైద్యకళాశాల ఏర్పాటు అంశం కోర్టులో ఉన్నందున స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి.             


 - ఎన్‌ఎండీ ఫరూక్‌, రాష్ట్ర వైద్యవిద్య శాఖ మాజీమంత్రి, ఎమ్మెల్సీ, నంద్యాల


మందులు బయటి నుంచే..


ప్రైవేటు ల్యాబులే దిక్కు 

వైద్యులు లేని కీలక విభాగాలు

డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రి దయనీయ స్థితి 


డోన్‌, మే 21:  డోన్‌ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు సరైన మందులు దొరకడం లేదు. వ్యాధి నిర్ధారణకు ల్యాబులు లేవు. ప్రైవేటు ల్యాబులే దిక్కవుతున్నాయి. కీలక విభాగాలకు డాక్టర్లు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ ఆసుపత్రిలో నిత్యం 400 ఓపీ ఉంటుంది. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ఆసుపత్రికి వస్తుంటారు. 


రోగులకు మందులేవీ..?


పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మందులకు కటకటగా ఉంది. ఆసుపత్రి ఆవరణలో జనరిక్‌ మెడికల్‌ షాపు ఉంది. ఆసుపత్రికి వచ్చే పేద, మధ్య తరగతి రోగులకు డాక్టర్లు రాసిచ్చే చీటీలను తీసుకుని వెళితే అక్కడ కొన్ని సాధారణ జబ్బులకు మాత్రమే మాత్రలు ఇస్తున్నారు. వారానికి సరిపడ మందులు రాసిస్తే.. కేవలం రెండు, మూడు రోజులకు మాత్రమే ఇస్తున్నారు. చీటీలను దుకాణం వారే తీసుకుని... రాసిచ్చిన ప్రకారం రోగులకు మందులు ఇచ్చినట్లు చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనేక రకాల జబ్బులకు జనరిక్‌ మెడికల్‌ దుకాణంలో మందులు దొరకడం లేదు. దీంతో రోగులు బయట మందుల షాపుల్లో అధిక ధరలకు కొనాల్సి వస్తోంది. 


 ప్రైవేటు ల్యాబులే దిక్కు  


ఈ ఆసుపత్రిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సౌకర్యం లేదు. డాక్టర్లు ప్రైవేటు ల్యాబులకు రెఫర్‌ చేస్తున్నారు. దీంతో రోగులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. గర్భిణులకు ఆపరేషన్‌ చేయడానికి అవసరమైన కిట్లను బయట కొని తెచ్చుకోవాల్సి వస్తోంది. గర్భిణిలు పరీక్షలు కూడా బయటే చేయించుకోవాల్సి వస్తోంది. శిశువులకు యాంటిబయాటిక్‌ ఇంజెక్షన్లు కూడా బయటి మెడికల్‌ షాపుల్లోనే తెచ్చుకోవాల్సి వస్తోంది. 


డాక్టర్లు లేక అవస్థలెన్నో


 డోన్‌ సీహెచ్‌సీనీ ఏరియా ఆసుపత్రిగా మార్చారు. అయినా కీలక విభాగాల్లో వైద్యులు లేరు. చిన్న పిల్లల వైద్య నిపుణులు లేరు. గర్భిణులు ప్రసవించాక శిశువులకు వైద్యం అవసరమైతే కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్‌ చేస్తున్నారు. ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్‌ సర్జన్‌, ఆర్థో స్పెషలిస్టు, నేత్ర, చర్మ వ్యాధుల నిపుణులు లేరు. 


మందుల కొరత లేకుండా చూడాలి

డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. పేద ప్రజలు డబ్బులు పెట్టి బయట మందులు ఎలా కొంటారు? పరీక్షలకు ప్రైవేటు ల్యాబులకు రెఫర్‌ చేయడం మానుకోవాలి. ఆసుపత్రిలోనే అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చూడాలి. 


 - రంగనాయుడు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి డోన్‌

వైద్యం లేని చోట..


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.