జెన్కో రక్షణకు తుదిశ్వాస వరకు పోరాటం

ABN , First Publish Date - 2022-05-19T04:51:33+05:30 IST

శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌కేంద్రం (జెన్‌కో) రక్షణ కోసం తుది శ్వాస వరకు పోరాడేందుకు సిద్ధమని విద్యుత్‌ ఉద్యోగుల సంఘం జేఏసీ, కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక జేఏసీ నాయకులు అన్నారు.

జెన్కో రక్షణకు తుదిశ్వాస వరకు పోరాటం
ఆందోళన చేస్తున్న జెన్‌కో కార్మికులు, ఉద్యోగులు

 ఉద్యోగులు,  కార్మిక సంఘ జేఏసీ నేతలు

ముత్తుకూరు, మే18:  శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌కేంద్రం (జెన్‌కో) రక్షణ కోసం తుది శ్వాస వరకు పోరాడేందుకు సిద్ధమని  విద్యుత్‌ ఉద్యోగుల సంఘం జేఏసీ, కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక జేఏసీ నాయకులు అన్నారు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నేలటూరులోని జెన్‌కో వద్ద ఉద్యోగులు, కార్మికులు జెన్‌కో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జెన్‌కో డైరెక్టర్లు ప్లాంట్‌ నిర్వహణకు సంబంధించి తప్పుడు లెక్కలు ప్రభుత్వానికి చూపించడం వల్లే ప్రైవేటీకరణ ప్రతిపాదన చోటు చేసుకుందన్నారు. నాసిరకం బొగ్గు కారణంగా థర్మల్‌కేంద్రంలో ఇబ్బందులు తలెత్తడంతో పాటు, విద్యుత్‌ ఉత్పత్తి వ్యయంలో తేడాలు వచ్చాయన్నారు. ఈ వాస్తవాలను వక్రీకరించి, నష్టాల సాకు చూపి థర్మల్‌కేంద్రాన్ని ప్రైవేటు రంగానికి అప్పజెప్పేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ఉద్యోగులు, ఇంజనీర్లు, కార్మికుల సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపడం దారుణమన్నారు. జెన్‌కో థర్మల్‌కేంద్రాన్ని ప్రైవేటు పరం కాకుండా రక్షించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. దశల వారీగా  ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. 


Updated Date - 2022-05-19T04:51:33+05:30 IST