ఖద్దరు పెత్తనం!

ABN , First Publish Date - 2021-10-10T05:28:27+05:30 IST

కీలకమైన రెవెన్యూతో సహా జిల్లాలో ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులపై అధికారులకు పట్టు సడలిపోతోంది.

ఖద్దరు పెత్తనం!

ఉద్యోగుల బదిలీలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే..

క్రమశిక్షణ చర్యలు వారిష్టమే..

ప్రజా ప్రతినిధులు కరుణిస్తేనే పోస్టింగ్‌లు

ఉద్యోగులపై సడలుతున్న అధికారుల పట్టు



గుంటూరు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): కీలకమైన రెవెన్యూతో సహా జిల్లాలో ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులపై అధికారులకు పట్టు సడలిపోతోంది. ఉద్యోగుల బదిలీలు, క్రమశిక్షణ చర్యలు వంటివన్నీ అధికార వైసీపీ ఖద్దరు చొక్కాల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. పోస్టింగ్‌ల కోసం నేతల వద్దకు వెళ్లి లేఖలు తెచ్చుకోవాల్సిన పరిస్థితికి చేరుకొంది. అంతేకాకుండా చివరికి ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల విషయంలోనూ వారు తలదూరుస్తుండటం పరాకాష్టగా మారింది. రెవెన్యూలో వీఆర్‌ఏ/వీఆర్‌వోలు మొదలుకొని తహసీల్దార్‌ స్థాయి అధికారి వరకు ఎమ్మెల్యే లేఖల మీదనే జరుగుతున్నాయన్న విషయం బహిరంగ రహస్యమే. పంచాయతీరాజ్‌, మునిసిపల్‌, గ్రామీణాభివృద్ధి వంటి శాఖల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల బదిలీలు పూర్తిగా వారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఏడాదిన్నర క్రితం జిల్లాలో వీఆర్‌వోల క్యాడర్‌ బలం కంటే ఎక్కువ బదిలీలు చేసి అప్పటి ఉన్నతాధికారులు అభాసుపాలయ్యారు. ఒక్కో వీఆర్‌వోకి నెలకో పోస్టింగ్‌ ఇచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. వాటిపై ఆడిట్‌ అభ్యంతరాలు రావడంతో జీతాలు నిలిచిపోయాయి. దీనిపై భూపరిపాలన శాఖ రాష్ట్ర ముఖ్య కమిషనర్‌ కార్యాలయం కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించింది. అయినప్పటికీ ఆగడం లేదు. బదిలీలపై నిషేధం ఉండటంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు తమకు ఇష్టం లేని అధికారులను వేరే మండలాలకు డిప్యూటేషన్‌ చేసి తాము సూచించిన వారికి నియోజకవర్గంలో పోస్టింగ్‌లు కల్పించాలని లేఖలు పంపుతున్నారు. వీఆర్‌వోలు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు ఎమ్మెల్యేల లేఖలతో తమకు ఇష్టమైన ప్రాంతాల్లో పోస్టింగ్‌లు కోరుకొంటున్నారు. 

గతంలో తహసీల్దార్‌ అంటే ఎంతో విలువ ఉండేది. ఎమ్మెల్యేలే వారి కార్యాలయాలకు వెళ్లేవారు. అలాంటిది నేడు డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారులు కూడా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళుతున్నారు. జిల్లాలో తాజాగా ఒక వీఆర్‌వోపై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నారు. దీని వెనక ఎమ్మెల్యే ఆదేశాలు ఉన్నాయన్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఒక వీఆర్‌వో తప్పుదోవ పట్టిస్తే తహసీల్దార్‌ గుడ్డిగా సంతకాలు చేస్తారా అన్న విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒక తహసీల్దార్‌ సస్పెన్షన్‌ విషయంలోనూ ఎమ్మెల్యే ఆదేశాలనే అమలు చేశారు. ఆ తర్వాత సబ్‌ కలెక్టర్‌ ద్వారా విచారణ జరిపించారు. గతంలో  ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఒక ఎంపీపీ ఏకంగా తహసీల్దార్‌ని శాసించారు. తహసీల్దార్‌ ఆఫీసుకు రావడానికి వీల్లేదని తాళాలు వేయించారు. ఇలాంటి సంఘటనలు ఆయా శాఖలపై అధికారుల అజమాయిషీ లేకుండా ఖద్దరు పెత్తనాన్ని పెంచుతున్నట్లు కళ్లకు కడుతున్నాయి.  



=============================================================================

Updated Date - 2021-10-10T05:28:27+05:30 IST