నంద్యాలలో జిల్లా స్థాయి వైసీపీ ప్లీనరీలో ఖాళీ కుర్చీలు దర్శనం

ABN , First Publish Date - 2022-07-01T06:47:53+05:30 IST

మూడేళ్ల వైసీపీ పాలనలో నాయకులు, కార్యకర్తలకు ఏమి చేయలేకపోయామన్న బాధ ఉందని, రానున్న రెండేళ్లలో తప్పనిసరిగా వారికి న్యాయం చేస్తామని డిప్యూటీ సీఎం, నంద్యాల జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంజాద్‌బాషా అన్నారు.

నంద్యాలలో జిల్లా స్థాయి వైసీపీ ప్లీనరీలో ఖాళీ కుర్చీలు దర్శనం
ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్న కుర్చీలు

నంద్యాల (నూనెపల్లె), జూన్‌ 30: మూడేళ్ల వైసీపీ పాలనలో నాయకులు, కార్యకర్తలకు ఏమి చేయలేకపోయామన్న బాధ ఉందని, రానున్న రెండేళ్లలో తప్పనిసరిగా వారికి న్యాయం చేస్తామని డిప్యూటీ సీఎం, నంద్యాల జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంజాద్‌బాషా అన్నారు. వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం గురువారం ఎల్‌కేఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది. మంత్రులు అంజాద్‌బాషా, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఆర్థర్‌, కాటసాని రామిరెడ్డి, మాజీ మంత్రి, ప్లీనరీ పరిశీలకుడు రామసుబ్బారెడ్డి, జడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ రానున్న రెండేళ్లలో కార్యకర్తల అభివృద్ధికి పాటుపడతామని అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షం మీడియాను అడ్డం పెట్టుకొని అసత్య ప్రచారాలను చేస్తోందని అన్నారు. వైసీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, దీన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు పెరిగితే రాష్ట్రంలోనే పెరిగినట్టు బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటన్నారు. ఏపీలో మద్యం ధరలు కర్ణాటక, తెలంగాణలో కన్న తక్కువ ధరలకు లభిస్తున్నాయని చెప్పారు. ఆ తరువాత ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగానే కార్యకర్తలంతా వెళ్లిపోయారు. దీంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఆర్థికమంత్రి బుగ్గన మాట్లాడుతూ బయట చల్లగాలికి తిరుగుతున్న కార్యకర్తలంతా లోనికి రావాలని, లేకపోతే ప్లీనరీలో ఖాళీ కుర్చీలు ఉన్నాయంటూ ఆంధ్రజ్యోతిలో రాస్తారని పేర్కొనడం గమనార్హం. అయినా మంత్రి మాటలను ఎవరూ చెవికెక్కించుకోకపోవడంతో చివరకు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. 



Updated Date - 2022-07-01T06:47:53+05:30 IST