బియ్యం లారీలు ఖాళీ చేయరా?

ABN , First Publish Date - 2021-04-17T06:16:27+05:30 IST

బోధన్‌లో సీడబ్ల్యూసీ గోదాం వద్ద శుక్రవారం రెండో రోజు రైస్‌మిల్లర్‌లు ఆందోళన చేపట్టారు. సీడబ్ల్యూసీ గోదాం వద్ద లారీలను అడ్డుకొని ధర్నా నిర్వహించారు. సంబంధిత అధికారుల తీరును నిరసిస్తూ వారు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగానే అధికారులు రైస్‌మిల్లుల వద్ద డిప్యూటీ త

బియ్యం లారీలు ఖాళీ చేయరా?
సీడబ్ల్యూసీ గోదాం వద్ద లారీలను అడ్డుకున్న రైస్‌మిల్లర్‌లు

అధికారుల తీరుపై రైస్‌మిల్లర్‌ల ఆగ్రహం 

రెండో రోజూ లారీలను అడ్డుకున్న వైనం

బోధన్‌, ఏప్రిల్‌ 16: బోధన్‌లో సీడబ్ల్యూసీ గోదాం వద్ద శుక్రవారం రెండో రోజు రైస్‌మిల్లర్‌లు ఆందోళన చేపట్టారు. సీడబ్ల్యూసీ గోదాం వద్ద లారీలను అడ్డుకొని ధర్నా నిర్వహించారు. సంబంధిత అధికారుల తీరును నిరసిస్తూ వారు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగానే అధికారులు రైస్‌మిల్లుల వద్ద డిప్యూటీ తహసీల్దార్‌లు, వీఆర్వోలను ఉంచి వెంట వెంటనే ధాన్యం లారీలను ఖాళీ చేయిస్తున్నారని తాము సీడబ్ల్యూసీ గోదాంలకు పంపిన బియ్యం లారీలు మాత్రం 10, 15రోజులకు ఖాళీ కావడం లేదని, ఇదేక్కడి న్యాయమని ప్రశ్నించారు. రైస్‌మిల్‌లలో ధాన్యం లారీలను ఖాళీ చేయించడంలో అధికారులు చూపుతున్న ఉత్సాహం.. సీడబ్ల్యూసీ గోదాంల వద్ద బియ్యం లారీలను ఖాళీ చేయించడంలో ఎందుకు చూపడం లేదని వారు ప్రశ్నించారు. రైస్‌మిల్లులో గోదాంలు ఖాళీ కావడం లేదని తాము ధాన్యం లారీలను ఏలా ఖాళీ చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ గోదాంల వద్ద రోజుల తరబడి తమ బియ్యం లారీలు నిలిచిపోతే ఎవరు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అంతేకాకుండా, కామారెడ్డి నిజామాబాద్‌ జిల్లాలు వేరుబడి సంవత్సరాలు గడుస్తున్న కొత్త గోదాంల నిర్మాణాలు చేపట్టిన కామారెడ్డి జిల్లా బియ్యం నిల్వలను బోధన్‌ సీడబ్ల్యూసీ గోదాంలకు ఎందుకు పంపుతున్నారని, ఇక్కడ ఎందుకు నిల్వ చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ జిల్లా బియ్యాన్ని ఆ జిల్లా గోదాముల్లోనే నిల్వ చేయాలని డిమాండ్‌ చేశారు. బోధన్‌ డివిజన్‌లో రైస్‌మిల్లుల సంఖ్య పెరిగి పోయిందని తాము బియ్యం నిల్వలను ఎక్కడ నిల్వ చేసేదని ప్రశ్నించారు. బోధన్‌ డివిజన్‌లోని రైస్‌మిల్లుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని తాము బియ్యం లారీలను పంపుతే సీడబ్ల్యూసీ గోదాంల వద్ద ఖాళీ కాక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని మండిపడ్డారు. సీడబ్ల్యూసీ గోదాంల వద్ద కామారెడ్డి జిల్లాకు చెందిన లారీలను రెండవ రోజు అడ్డుకున్నారు.  

Updated Date - 2021-04-17T06:16:27+05:30 IST