ఖాళీ జాగా.. వేసేయ్‌ పాగా

ABN , First Publish Date - 2021-02-27T03:34:09+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ భూముల కబ్జా పరంపర కొనసాగుతోంది. విలువైన భూములపై కన్నేస్తున్న భూ మాఫియా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టిస్తూ కబ్జాలకు పాల్పడుతోంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో భూములు కబ్జాకు గురికాగా, తాజాగా జిల్లా కేంద్రంలో రూ.2 కోట్ల విలువ చేసే భూమిని కొందరు ఆక్రమించారు. ఏసీసీ కాలనీ సమీపంలోని పోచమ్మ గుడిని ఆనుకొని ఉన్న మంచిర్యాల శివారు సర్వే నెంబర్‌ 283లో సుమారు 18 గుంటల భూమిని రియల్టర్లు ఆక్రమించుకొని చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నారు.

ఖాళీ జాగా.. వేసేయ్‌ పాగా
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ స్థలం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ

రియల్టర్ల ఆధీనంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూములు 

జిల్లా కేంద్రంలో రెచ్చిపోతున్న భూ మాఫియా

తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో విక్రయాలు

నిలువునా మోసపోతున్న కొనుగోలు దారులు

మంచిర్యాల, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ భూముల కబ్జా పరంపర  కొనసాగుతోంది. విలువైన భూములపై కన్నేస్తున్న భూ మాఫియా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టిస్తూ కబ్జాలకు పాల్పడుతోంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో భూములు కబ్జాకు గురికాగా, తాజాగా జిల్లా కేంద్రంలో రూ.2 కోట్ల విలువ చేసే భూమిని కొందరు ఆక్రమించారు. ఏసీసీ కాలనీ సమీపంలోని పోచమ్మ గుడిని ఆనుకొని ఉన్న మంచిర్యాల శివారు సర్వే నెంబర్‌ 283లో సుమారు 18 గుంటల భూమిని  రియల్టర్లు ఆక్రమించుకొని చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నారు. అక్కడ భూమి విలువ గజం రూ.12వేల పై చిలుకు ఉంటుందని అంచనా. అలా సుమారు రూ.2 కోట్ల భూమికి ఎసరు పెట్టారు. అయితే ప్రభుత్వ భూమికి దస్తావేజులు ఎలా వచ్చాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. సదరు డాక్యుమెంట్లతో రెవెన్యూ రికార్డుల్లోనూ అమలు చేసినట్లు సమాచారం.  స్థానిక తిలక్‌నగర్‌ గర్మిళ్ల శివారు సర్వే నెంబర్‌ 334లో దాదాపు రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. జిల్లా కేంద్రంలో కొంత కాలంగా రెచ్చిపోతున్న భూమాఫియా అసైన్డ్‌, ప్రభుత్వ, చెరువు శిఖం, నాలా భూములను కబ్జా చేస్తూ రెచ్చిపోతున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. 

తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో....

ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వ్యక్తులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి విక్రయిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు.  సర్వే నెంబర్‌ 334లోని భూమికి 2010లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించగా 2014లో తహసీల్దార్‌ రద్దు చేశారు. అయినప్పటికీ ఇటీవల అందులో సుమారు ఒక ఎకరం 28 గుంటలను కొందరు వ్యాపారులు విక్రయించి సొమ్ము చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఈ నెల 16న 3వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ మజీద్‌ నేతృత్వంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. స్థలాన్ని అక్రమించింది అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ యువజన విభాగం నాయకుడు కావడంతో రెవెన్యూ అధికారులు ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 

పట్టా భూముల పేరుతో రిజిస్ట్రేషన్లు...

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న రియల్‌ వ్యాపారులు వాటికి పట్టా భూముల పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. అలా వాటిని పట్టా భూముల పేరుతో విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ల సమయంలో సదరు భూముల సమీపంలోని పట్టా భూములకు చెందిన సర్వే నెంబర్లు, హద్దులు వేస్తూ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి వాటిని కొనుగోలు చేసిన వారు తీరా రిజిస్ట్రేషన్లు పూర్తయి మోకాపైకి వెళ్లేసరికి ప్రభుత్వ భూమి అని తేలడంతో నష్టపోతున్నారు. 

ప్రహరీ నిర్మాణ పనులు నిలిపివేశాం

రాజేశ్వర్‌, తహసీల్దార్‌ 

ఏసీసీ ప్రాంతంలోని సర్వే నెంబరు 283లో స్థలాన్ని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సందర్శించారు. దస్తావేజులు పరిశీలిస్తున్నాం. అందులో జరుగుతున్న ప్రహరీ నిర్మాణాన్ని నిలిపివేయడం జరిగింది. అలాగే 334 సర్వే నెంబరులోని ప్రభుత్వ స్థలానికి నెల రోజులలోపు హద్దులు ఏర్పాటు చేసి, రక్షణ కల్పిస్తాం. ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2021-02-27T03:34:09+05:30 IST