ఈ సమయంలో విద్యార్థులకు ధైర్యం చెప్పండి

ABN , First Publish Date - 2022-06-29T20:41:04+05:30 IST

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలైనందుకు మనస్తాపంతో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం నార్లకుంట తండాకు చెందిన

ఈ సమయంలో విద్యార్థులకు ధైర్యం చెప్పండి

ఆరుగురు ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య

కూసుమంచి / కడ్తాల్‌, జూన్‌ 28: ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలైనందుకు మనస్తాపంతో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం నార్లకుంట తండాకు చెందిన కేతావత్‌ రూప్‌సింగ్‌, అచ్చాలి దంపతుల కుమారుడు కేతావత్‌ ప్రవీణ్‌ నాయక్‌(17) మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ బైపీసీ సెకండియర్‌ చదువుతున్నాడు. పరీక్షల్లో ఫెయిలైనట్లు తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తండ్రి పొలం వెళ్లిన సమయంలో ఇంట్లో స్లాబ్‌ కొక్కానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా... ఖమ్మం జిల్లాలో మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కూసుమంచి మండలం జుజ్జులరావుపేట గ్రామానికి చెందిన సిరికొండ సాయి (17) ఇంటర్‌ ఫస్టియర్‌లో  మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాడు. దీన్ని అవమానంగా భావించి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పక్కనున్న ఓ వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 


ఇంకో ఘటనలో... ఖమ్మం నగరం పార్శీబంధం ప్రాంతానికి చెందిన కావూరి కార్తీక్‌ (16) ఫస్టియర్‌ సంస్కృతంలో ఫెయిల్‌ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు దుప్పటితో ఉరేసుకుని చనిపోయాడు. మరో ఘటనలో... హైదరాబాద్‌లోని చింతలబస్తీకి చెందిన ముత్యాల గౌతం కుమార్‌(18) ఫస్టియర్‌లో స్నేహితుల కంటే తక్కువ మార్కులు వచ్చాయని అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.... మీర్‌పేట పరిధిలోని అన్నపూర్ణనగర్‌లో నివాసముంటున్న అల్లంపల్లి ఠాగూర్‌ హరి (17) ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకో ఘటనలో... హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో నివాసం ఉంటున్న అర్వింద్‌ రెడ్డి ఇంటర్‌లో ఫెయిల్‌ కావడంతో ఇంటి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంపై పోలీసులు విద్యార్థి తండ్రిని ఆరా తీయగా... ఫిట్స్‌తో ఇంటిపైనుంచి కిందపడి చనిపోయాడని చెప్పినట్టు తెలిసింది.


తొందరపాటు చర్యలు వద్దు: మంత్రి సబిత 

ఇంటర్‌ పరీక్షల్లో పాస్‌ కాలేదని విద్యార్థులెవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఏడాది నష్ట పోకుండా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని మంత్రి గుర్తుచేశారు. ఈ సమయంలో విద్యార్థులకు ధైర్యం చెప్పాలని తల్లిదండ్రులను కోరారు. 


త్వరలో అడ్మిషన్ల షెడ్యూల్‌ విడుదల

కాగా, 2022-23 విద్యా సంవత్సరం కోసం ఇంటర్మీడియట్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌ను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఒకట్రెండు  రోజుల్లో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు కసరత్తును పూర్తిచేశారు. మరోవైపు ఇంటర్‌ సెకండియర్‌ క్లాసులను ఇప్పటికే ప్రారంభించారు. వచ్చే నెల 11నుంచి ఫస్టియర్‌ క్లాసులను కూడా ప్రారంభించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న టెన్త్‌ క్లాస్‌ ఫలితాలను ప్రకటించనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటర్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించాలని నిర్ణయించారు.

Updated Date - 2022-06-29T20:41:04+05:30 IST