ప్రోత్సాహం ఎప్పుడో..

ABN , First Publish Date - 2021-03-03T05:16:40+05:30 IST

ఏకగ్రీవ పంచాయతీల నజరాన కోసం కొత్త సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు.

ప్రోత్సాహం ఎప్పుడో..

 ఏకగ్రీవాల నజరా కోసం ఎదురుచూపులు

  జిల్లాలో 358  గ్రామ పంచాయతీలకు రూ. 23.50 కోట్లు బకాయి

 

చిత్తూరు కలెక్టరేట్‌,  మార్చి 2: ఏకగ్రీవ పంచాయతీల నజరాన కోసం కొత్త సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిసాయి. ఏకగ్రీవంగా సర్పంచ్‌లు, వార్డు మెంబర్లను ఎన్నుకుంటే భారీగా నజరాన అందిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది.   రెండువేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 5లక్షలు, రెండువేలు నుంచి ఐదు వేలున్న పంచాయతీలకు రూ. 10 లక్షలు, ఐదు వేల నుంచి పదివేల మంది జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 15లక్షలు, పది వేలు దాటిన పంచాయతీలకు రూ. 20 లక్షల నగదు ప్రోత్సాహం అదిస్తామని ప్రకటించింది. జిల్లాలో మొత్తం 1412లో 418 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కాగా ప్రభుత్వ నిబంధనల మేరకు 358 పంచాయతీలకు మాత్రమే ప్రోత్సాహకం వర్తించనుంది. మిగిలిన 60 పంచాయతీల్లో సర్పంచ్‌ స్తానాలు ఏకగ్రీవమైనా వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నజరాన రూపంలో రూ. 23.50 కోట్లు రావాల్సి ఉంది.  2013లో జరిగిన ఎన్నికల్లో మైనర్‌ పంచాయతీకి రూ. 7లక్షలు, మేజర్‌ పంచాయతీకి రూ. 20 లక్షలు చొప్పున అందిస్తామని ప్రకటించింది. అప్పట్లో 291 మేజర్‌, మైనర్‌ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనప్పటికీ నగదు ప్రోత్సాహకం ఇవ్వలేదని పలుసార్లు సర్పంచ్‌లు డిమాండ్‌ చేశారు. తాజాగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రభుత్వం ప్రకటించిన నజరాను విడుదల చేయాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-03-03T05:16:40+05:30 IST