చిన్న పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం

ABN , First Publish Date - 2022-10-01T06:59:22+05:30 IST

చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఇందులో భాగంగానే పారిశ్రామిక వేత్తలకు ప్రొత్సాహాన్ని అందిస్తున్నామని పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

చిన్న పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం
జ్యోతిప్రజ్వలన చేసి వర్క్‌షాప్‌ను ప్రారంభిస్తున్న మంత్రి అమర్‌నాథ్‌

   మంత్రి అమర్‌నాథ్‌

అనకాపల్లి, సెప్టెంబరు 30: చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఇందులో భాగంగానే పారిశ్రామిక వేత్తలకు  ప్రొత్సాహాన్ని అందిస్తున్నామని పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. అనకాపల్లిలోని పెంటకోట కన్వెన్షన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వాణిజ్యాభివృద్ధి ఉత్పత్తి ఆవిష్కరణ, సాంకేతిక అభివృద్ధి వర్క్‌షాప్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న పరిశ్రమల ఏర్పాటు వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందన్నారు. చిన్న పరిశ్రమలకు ఇప్పటి వరకు ప్రభుత్వం రెండు విడతలుగా రాయితీలను విడుదల చేసిందని, మూడో విడతగా రూ.1300 కోట్లను ఇస్తున్నట్టు చెప్పారు. అక్టోబరు తొమ్మిదే తేదీన అనకాపల్లి పక్కన కోడూరులో 75 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు ఆటోనగర్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. విశాఖ కేంద్రంగా ఐటీ డెస్టినేషన్‌  ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముందుగా ప్రముఖ సంస్థ ఇన్ఫోసిస్‌ శనివారం నుంచి వెయ్యి మందితో పనిచేయడం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అనకాపల్లి ఎంపీ, ఎంఎస్‌ఎంఈ సభ్యురాలు బీవీ సత్యవతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిన్న పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి మాట్లాడుతూ పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగులకు సంబంధించిన శిక్షణ ఇచ్చే విధంగా ప్రణాళిక తయారు చేస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈ అదపు అభివృద్ధి కమిషనర్‌ డి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ సూక్ష్మ, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నప్రోత్సాహకాలు, రాయితీలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ విశాఖ సహాల సం చాలకులు జీవీఆర్‌ నాయుడు, అధ్యక్షుడు ఎ.కె.బాలాజీ,  నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ ఇంజినీరింగ్‌ (ముంబయి) ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి.కోటేశ్వరరావు నాయక్‌, ఏపీ స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌ ఫర్‌ ఐపీఆర్‌ఎస్‌ (ఆంధ్ర యూనివర్సిటీ) డాక్టర్‌ పురుషోత్తం, ఎంఎస్‌ ఎంఈ సీనియర్‌ రీజనల్‌ మేనేజర్‌ బిజయ్‌ సాహు, డైరెక్టర్‌ నదియా, ప్రతినిధులు చంద్రశేఖర్‌, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T06:59:22+05:30 IST