విశాఖ వృద్ధికి పెద్దాయన ప్రోత్సాహం

ABN , First Publish Date - 2021-12-05T06:12:35+05:30 IST

నిగర్వి, నిరాడంబరుడు, అజాత శత్రువు...కొణిజేటి రోశయ్య. ఆయన అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్సీ నుంచి ముఖ్యమంత్రి వరకు ఎన్ని పదవులు అలంకరించినా...విశాఖపట్నానికి మాత్రం కుమార్తెను ఇచ్చిన తండ్రిగానే వచ్చేవారు.

విశాఖ వృద్ధికి పెద్దాయన ప్రోత్సాహం

పారిశ్రామిక అభివృద్ధికి సహకారం

బ్రాండిక్స్‌ రావడానికి మూలకారణం

ఆయన చేతులమీదుగానే ప్రారంభం

ఐటీ పార్కులో సింబియోసిస్‌...

రోశయ్య పేరుతో ‘గీతం’లో రూ.లక్ష అవార్డు

సిటీ సెంట్రల్‌ పార్కు, బాలచెరువు-గంగవరం పోర్టు ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన

విలువలతో పెంచారు: కుమార్తె రమాదేవి


విశాఖపట్నం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి):

నిగర్వి, నిరాడంబరుడు, అజాత శత్రువు...కొణిజేటి రోశయ్య. ఆయన అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్సీ నుంచి ముఖ్యమంత్రి వరకు ఎన్ని పదవులు అలంకరించినా...విశాఖపట్నానికి మాత్రం కుమార్తెను ఇచ్చిన తండ్రిగానే వచ్చేవారు. 


విశాఖకు పారిశ్రామిక ప్రోత్సాహం

ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో విశాఖపట్నంలో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో సహకరించారు. ఆయన చేతుల మీదుగా ప్రారంభమైన సంస్థలు దినదిన ప్రవర్థమానమై నేడు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అందులో ఒకటి అచ్యుతాపురంలోని రెడీమేడ్‌ దుస్తుల తయారీ కంపెనీ బ్రాండిక్స్‌ కాగా మరొకటి రుషికొండ ఐటీ పార్కులోని సింబియోసిస్‌ టెక్నాలజీస్‌. బ్రాండిక్స్‌ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో ఓ యూనిట్‌ పెట్టాలని ఆసక్తి చూపించినప్పుడు ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నారు. అదే హోదాలో శ్రీలంక వెళ్లి బ్రాండిక్స్‌ కంపెనీని చూసి, అలాంటి సంస్థ రాష్ట్రానికి వస్తే ఉపాధి అవకాశాలు బాగుంటాయని నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి వివరించారు. విశాఖపట్నం జిల్లాలో భూమి మంజూరుచేయాలని సిఫారసు చేశారు. ఆ సంస్థ ప్రారంభ సమయానికి రాజశేఖర్‌రెడ్డి చనిపోవడంతో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో ఆయన చేతుల మీదుగానే అచ్యుతాపురంలో బ్రాండిక్స్‌ అపెరల్‌ సిటీ ప్రారంభమైంది. నేడు ఆ సంస్థలో 22 వేల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.


రోశయ్య రాకతో బీచ్‌ రోడ్డుకు వెలుగులు

రోశయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం అందించారు. రుషికొండ ఐటీ పార్కులో (2010)లో రూ.20 కోట్లతో నెలకొల్పిన సింబియోసిస్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఆయన చేతులు మీదుగానే ప్రారంభమైంది. ఆయన ప్రారంభోత్సవానికి వస్తున్నారని తెలిసి జిల్లా యంత్రాంగం ఆ మార్గంలో రెండు కల్వర్టులను యుద్ధ ప్రాతిపదికన నిర్మించింది. బీచ్‌రోడ్డులో రుషికొండ వరకు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుచేసింది. ఇప్పుడు ఈ సంస్థకు వివిధ ప్రాంతాల్లో సుమారు రెండు వేల మంది వరకు పనిచేస్తున్నారు. 


రోశయ్య పేరుతో గీతంలో రూ.లక్ష అవార్డు

గీతం విశ్వవిద్యాలయంలో రోశయ్య పేరుతో ఏటా ఒక ఎంబీఏ విద్యార్థికి లక్ష రూపాయలు ఇవ్వాలని సింబయోసిస్‌ టెక్నాలజీస్‌ సీఈఓ ఓ.నరేశ్‌కుమార్‌ రూ.10 లక్షలు అందజేశారు. ‘రోశయ్య అవార్డ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ పేరుతో గత పదేళ్లుగా దీనిని అందిస్తున్నారు. నిరాడంబరంగా జీవించడం, చిత్తశుద్ధితో కష్టపడి పనిచేయడం వంటి సుగుణాలు ఆయనలో ఉన్నాయని, అలాంటివి అలవరుచుకోవాలని సూచిస్తూ ఈ అవార్డును ఇస్తున్నారు.


కీలకమైన పనులకు శంకుస్థాపనలు

రోశయ్య చేతులు మీదుగా విశాఖపట్నంలో కీలకమైన పనులకు శంకుస్థాపనలు జరిగాయి. అందులో ఒకటి పాత సెంట్రల్‌ జైలు స్థలాన్ని సిటీ సెంట్రల్‌ పార్కుగా అభివృద్ధి చేయడమైతే, మరొకటి గాజువాకలో బాలచెరువు రోడ్డు నుంచి గంగవరం పోర్టు వరకు ఫ్లైఓవర్‌ నిర్మాణం. ఆ తరువాత గవర్నర్‌గా పనిచేసినప్పుడు పలుమార్లు నగరానికి రాగా కేజీహెచ్‌లో రోగులకు అవసరమైన తాగునీటి ఆర్‌ఓ ప్లాంట్లను ప్రారంభించారు. మద్దిలపాలెంలోని సీఎంఆర్‌ సెంట్రల్‌లో ఐనాక్స్‌ థియేటర్లు కూడా ఆయన చేతుల మీదుగానే ప్రారంభమయ్యాయి. 


విలువలతో పెంచారు

రమాదేవి, రోశయ్య కుమార్తె

నాన్నకు నా చేతి వంటలంటే ఇష్టం. ఏ పని మీద విశాఖపట్నం వచ్చినా తప్పనిసరిగా ఇంటికి వచ్చి భోజనం చేసేవారు. ఆయన అందరితోను మంచిగానే ఉండేవారు. మమ్మల్ని కూడా అలాగే వుండాలని చెప్పేవారు. మంచి విలువలతో పెంచారు. రాజకీయంగా ఎన్నో శిఖరాలను అధిరోహించినా ఇంట్లో మాత్రం ఏనాడూ రాజకీయాల గురించి మాట్లాడేవారు కాదు. నాయకులను ఇంటికి తీసుకువచ్చేవారు కాదు. ఆయనకు మా వల్ల ఏమైనా చెడ్డపేరు వస్తుందేమోనని మేము ఎవరం రాజకీయాల్లోకి వెళ్లలేదు. తాను ఎవరినీ నొప్పించరు. ఎవరైనా నొప్పిస్తే తట్టుకోలేరు. అంతటి మృధుస్వభావి. ఆయన మరణం మాకు తీరని లోటు.  


తండ్రి కన్నా ఎక్కువ

పైడా కృష్ణప్రసాద్‌, రోశయ్య అల్లుడు

రోశయ్య పేరుకు మామయ్యే గానీ తండ్రి కంటే ఎక్కువ. ఆయన దగ్గర నాకు చనువు ఎక్కువ. ఏ పనిచేసినా ఆయనకు ముందుగానే చెప్పేవాడిని. మంచిచెడ్డలు వివరించేవారు. ప్రోత్సహించేవారు. ఆయన ఆర్యవైశ్య సమాజానికి ఎంతో అండగా నిలిచారు. ఆ సామాజిక వర్గంలో మళ్లీ అలాంటి నాయకుడు రావడం కష్టం.



Updated Date - 2021-12-05T06:12:35+05:30 IST