నెల్లూరు చెరువులో భారీగా ఆక్రమణలు

ABN , First Publish Date - 2021-04-23T04:53:46+05:30 IST

నెల్లూరు చెరువు ఆక్రమణల వ్యవహారం ఇప్పుడు రెండు శాఖల అధికారులను నలిపేస్తోంది. తెరవెనుక రాజకీయ పట్టుదల తెరముందు రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులను ఇబ్బంది పెడుతోంది.

నెల్లూరు చెరువులో భారీగా ఆక్రమణలు
అంబాపురం, ఓగూరుపాడులో రొయ్యల గుంతలు


రోజురోజుకు కుచించుకుపోతున్న విస్తీర్ణం

తగ్గిన నిల్వ సామర్థ్యం.. హెచ్చరిస్తున్న ప్రమాదం

ఆక్రమణల తొలగింపునకు అడ్డంకులు

మంత్రి, ఎమ్మెల్యే వర్గాల ఒత్తిళ్లు

అడకత్తెరలో రెవెన్యూ, ఇరిగేషన్‌

సర్వేతో సరా!... స్వర్ణాలను సంరక్షిస్తారా? 


నెల్లూరు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : 

నెల్లూరు చెరువు ఆక్రమణల వ్యవహారం ఇప్పుడు రెండు శాఖల అధికారులను నలిపేస్తోంది. తెరవెనుక రాజకీయ పట్టుదల తెరముందు రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులను ఇబ్బంది పెడుతోంది. అసలు విషయాన్ని చెప్పలేక ఆక్రమణల తొలగింపు అంశాన్ని ఈ రెండు శాఖలు ఒకరిపై మరొకరు నెట్టుకుంటుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో అధికార, రాజకీయ వర్గాల్లో నెల్లూరు చెరువు వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. 


స్వర్ణాల చెరువుగా ప్రసిద్ధి చెందిన నెల్లూరు చెరువు విస్తీర్ణం సుమారు మూడు వేల ఎకరాలని రికార్డులు చెబుతున్నాయి. నిల్వ సామర్థ్యం 0.70 టీఎంసీలు. ఈ చెరువు కింద దాదాపుగా పది వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనితోపాటు నెల్లూరు నగరానికి ప్రధాన మైన తాగునీటి వనరుల్లో ఇది ముఖ్యమైనది. అలాంటి చెరువు రూపురేఖలు ఇప్పుడు ఆక్రమణలతో మారిపోయాయి. కొన్నేళ్లుగా విచ్చలవిడిగా చెరువు భూభాగాన్ని కబ్జా చేస్తున్నారు. నగరం వైపు కొందరు చెరువును ఆక్రమించి ఇళ్లు నిర్మించగా మరోవైపు భారీ స్థాయిలో వ్యవసాయం, రొయ్యలు, చేపల గుంతలు సాగు చేస్తున్నారు. అంబాపురం, అక్కచెరువుపాడు, ఓగూరుపాడు ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో చెరువును ఆక్రమించి సాగు చేస్తున్నారు. ఏడాదికేడాదికీ ఈ ఆక్రమణ పర్వం ఎక్కువవుతూ వస్తోంది. దీంతో చెరువు విస్తీర్ణం తగ్గిపోతోంది. ప్రస్తుతం అర టీఎంసీ నీటిని కూడా నిల్వ చేసుకోలేక పోతున్నట్లు ఇరిగేషన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో సాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని అంటున్నారు. ఈ చెరువులో నిర్మించిన సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ నుంచి నగరంలోని చాలా ప్రాంతాలకు తాగునీరు సరఫరా జరుగుతోంది. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో చెరువు నిల్వ సామర్థ్యం తగ్గితే తాగునీటి సమస్య ఏర్పడుతుందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. 


ఆక్రమణల తొలగింపునకు ఆదేశం

చెరువులో ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం ఆదేశించింది. సర్వేచేసి ఆక్రమణలను గుర్తించాలని ఉత్తర్వులిచ్చింది. దీంతో రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు సంయుక్తంగా నాలుగు రోజుల క్రితం సర్వే ప్రారంభించారు. మొదటి రోజే వారిపై రాజకీయ ఒత్తిళ్లు మొదలైనట్లు తెలిసింది. ఓ ప్రజాప్రతినిధి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో అధికారులు వెనక్కు తగ్గారని, అయితే మరోవైపు ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో సర్వే చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆయా శాఖల్లో చర్చించుకుంటున్నారు. ఏమీ చేయలేక.. ఎవరికీ చెప్పలేక.. హడావిడిగా సర్వేను పూర్తి చేసినట్లు తెలిసింది. ఎలాగోలా సర్వేను పూర్తి చేసిన అధికారులు, ఆక్రమణలను ఎలా తొలగించాలన్నదానిపై మల్లగుల్లా లు పడుతున్నట్లు సమాచారం. తెరవెనుక ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే రెండు వర్గాలుగా చేరి పట్టుదలకు వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకరేమో ఆక్రమణలు తొలగించాలని ఆదేశిస్తుండగా, మరొకరేమో అడ్డుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఆక్రమణల తొలగింపు  వ్యవహారాన్ని వాళ్లు చూసుకుంటారంటే.. వాళ్లు చూసుకుంటారంటూ రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలు నెట్టుకొస్తున్నాయి. ఆక్రమణలు తొలగించే అధికారం రెవెన్యూ శాఖకు ఉంటుందని, తాము కేవలం సాయం అందిస్తామని ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్వర్ణాల చెరువు ఆక్రమణల తొలగింపు ముందుకు సాగుతుందా.. లేదా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 


సర్వే పూర్తి చేశాం

- హుస్సేన్‌ సాహెబ్‌, నెల్లూరు ఆర్డీవో

నెల్లూరు చెరువులో ఆక్రమణలకు సంబంధించిన సర్వే పూర్తి చేశాం. ఆక్రమణల తొలగింపును ఇరిగేషన్‌ అధికారులు డిసైడ్‌ చేస్తారు. 



రెవెన్యూకు లేఖ రాస్తాం

- కృష్ణమోహన్‌, ఇరిగేషన్‌ సెంట్రల్‌ డివిజన్‌ ఈఈ

ఆక్రమణల సర్వే నివేదిక ఇంకా రెవెన్యూ అధికారుల నుంచి అందలేదు. అందిన వెంటనే ఆక్రమణలు తొలగించాల్సిందిగా రెవెన్యూ అధికారులకు లేఖ రాస్తాం. 

Updated Date - 2021-04-23T04:53:46+05:30 IST