దొంగ ఓట్లపై ఈసీ చర్యల కోసం ముగిసిన నిరీక్షణ

ABN , First Publish Date - 2021-04-21T06:35:43+05:30 IST

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌లో వెల్లువెత్తిన దొంగ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందన కోసం ప్రధాన రాజకీయ పార్టీల నిరీక్షణ ముగిసింది

దొంగ ఓట్లపై ఈసీ చర్యల కోసం ముగిసిన నిరీక్షణ

హైకోర్టులో బీజేపీ అభ్యర్థి రిట్‌ పిటిషన్‌

టీడీపీ తదుపరి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి


తిరుపతి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌లో వెల్లువెత్తిన దొంగ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందన కోసం ప్రధాన రాజకీయ పార్టీల నిరీక్షణ ముగిసింది. గత శనివారం పోలింగ్‌ జరిగిన నేపధ్యంలో ఆదివారం సెలవు కావడంతో మరో రెండు రోజులు వేచి చూద్దామని టీడీపీ భావించగా బీజేపీ ఆ రెండు రోజులు కూడా నిరీక్షించలేదు. ఆ పార్టీ అభ్యర్థి రత్నప్రభ మంగళవారం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు తదుపరి నిర్ణయం ఎలా వుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది.ఈ నెల 17వ తేదీన తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా తిరుపతి సెగ్మెంట్‌లో అధికార పార్టీ భారీ ఎత్తున ఇతర ప్రాంతాల నుంచీ బస్సులు, కార్లు, జీపుల్లో వేలాదిమందిని తిరుపతికి రప్పించి వారితో దొంగ ఓట్లు వేయించడాన్ని మీడియా వెలుగులోకి తీసుకురావడం,విపక్షాల నేతలు దొంగ ఓటర్లను నిలదీయడం జరిగింది. టీడీపీ, బీజేపీ నేతలు పలు వాహనాలను అడ్డుకుని కొన్నింటిని పోలీసులకు పట్టించారు కూడా. పోలింగ్‌ కేంద్రాల వద్ద కూడా దొంగ ఓటర్లను నేతలు గుర్తించి అడ్డుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన కళ్యాణమండపంలో పెద్ద సంఖ్యలో అపరిచితులు, వాహనాలు వుండగా టీడీపీ నేతలు వెళ్ళి ఆందోళనకు దిగి అరెస్టయ్యారు కూడా. పోలింగ్‌ రోజు తమకు లభ్యమైన ఆధారాలతో స్థానిక టీడీపీ, బీజేపీ నేతలు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ నేతలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. అయితే వీటిపై ఏ స్థాయిలోనూ చర్యలు లేకపోవడం ఆఽశ్చర్యం కలిగించింది. శనివారం పోలింగ్‌, ఆదివారం సెలవు కావడంతో సోమ, మంగళవారాల్లో రెండు పని దినాలు గడువు ఇచ్చి చూద్దామన్న ధోరణితో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించారు. బీజేపీ తరపున మంగళవారం ఆ పార్టీ అభ్యర్థి, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి రత్నప్రభ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఇదివరకే చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే బుధవారం శ్రీరామనవమి కావడంతో బహుశా గురువారం కోర్టు తలుపు తట్టే అవకాశముంది.ఈ పరిస్థితుల్లో కోర్టు ఆదేశాలు ఎలా వుంటాయి? అవి తిరుపతి ఉప ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నదానిపై రాజకీయవర్గాల్లోనూ, జనంలోనూ పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. 

Updated Date - 2021-04-21T06:35:43+05:30 IST