ముంపునకు లభించని ముగింపు

ABN , First Publish Date - 2022-01-22T04:28:44+05:30 IST

సగిలేరు వాగు నీటి ముంపు నుంచి గిద్దలూ రు పట్టణ ప్రజలకు విముక్తి లభించడం లేదు. ఎప్పట్నుంచో ఈ సమస్య వేధిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. టీడీపీ హయాంలో టెండర్లు పిలిచినా ప్రభుత్వం మారాక మళ్లీ పాతపాటే.. సగిలేరు ముంపు నుంచి ప్రజలను రక్షించేందుకు ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముంపునకు లభించని ముగింపు
పాండురంగారెడ్డి నగర్‌లో నీట మునిగిన రోడ్డు, కార్లు (ఫైల్‌)

సగిలేరు వాగు పొంగి ఇళ్లలోకి నీరు

ప్రతిపాదనలు, మంజూరుకే పరిమితం

గిద్దలూరు పట్టణ ప్రజలకు తప్పని ఇబ్బందులు

పట్టించుకోని ప్రజాప్రతినిధులు 


గిద్దలూరు, జనవరి 21 : సగిలేరు వాగు నీటి ముంపు నుంచి గిద్దలూ రు పట్టణ ప్రజలకు విముక్తి లభించడం లేదు. ఎప్పట్నుంచో ఈ సమస్య వేధిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. టీడీపీ హయాంలో టెండర్లు పిలిచినా ప్రభుత్వం మారాక మళ్లీ పాతపాటే.. సగిలేరు ముంపు నుంచి ప్రజలను రక్షించేందుకు ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాగు పొంగిందంటే వీధుల్లోకి, ఇళ్లలోకి ముంపు నీరు చేరి కోట్ల రూపాయల నష్టాన్ని మిగిలిస్తుండడం ఏటా ఆనవాయితీగా మారింది.

గిద్దలూరు పట్టణంలో నుంచి సగిలేరు నది వెళ్తోంది. నంద్యాల రోడ్డు లో సగిలేరుపై రోడ్డు బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి ఉండగా, పోరుమామిళ్ల రోడ్డులో మరో బ్రిడ్జి ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో వర్షాలు అధికంగా కురిసిన సందర్భాలలో ఒకే పర్యాయం సగిలేరు నదికి నీరు రావడం వల న బ్రిడ్జిలపై నుంచి కూడా నీరు ప్రవహించి ఇదే క్రమంలో పట్టణంలోకి ప్రవేశిస్తుంది. 


పూడిపోయి.. చిల్లచెట్లతో మూసుకుపోయి...

సగిలేరు చాలా వరకు పూడిపోయి, చిల్లచెట్లతో మూసుకుని పో యింది. కొన్నిచోట్ల ఆక్రమణలకు గురికావడం, మరికొన్ని చోట్ల వెడల్పు తక్కువగా ఉండడంతో భారీ వర్షాల సందర్భంలో నీరు ముందుకు వెళ్లలేక పొంగుతూ పట్టణంలోని ఇళ్లను ముంచుతుంది. ముంపు ప్రభావం కాలేజీ రోడ్డు, కొంగళవీడు రోడ్డు, డగ్లస్‌ చర్చి రోడ్డు, శ్రీనివాస థియేటర్‌ రోడ్డు, కుసుమ హరనాథ మందిరం రోడ్డు, వెస్ట్‌ పోస్టాఫీస్‌ రోడ్డు, 5వ వార్డులోని చాలా ప్రాంతాలు, కొప్పు వారివీధి, పాండురంగారెడ్డి నగర్‌, సీసీ స్కూలు, పాములపల్లి రోడ్లపై పడుతుంది. వాగులో నుంచి నీరు పొంగడం, ఆ రోడ్లలో ఉన్న ఇళ్లు, వ్యాపార సముదాయాలలోకి నీరు వెళ్లడంతో ప్రజలు భారీగా నష్టపోతున్నారు. ఇలా పలుమార్లు చోటుచేసుకుంటుండడంతో ఒక్కో ఇంటి యజమాని లక్ష నుంచి రూ.3లక్షల రూపాయల వరకు నష్టపోయిన సందర్భాలున్నాయి. ఇలా వందలాది గృహ యజమానులు నీటి ముంపునకు గురవుతున్నారు. సగిలేరు వాగును అభివృద్ధి చేసి ఆ నీరు పట్టణంలోకి రాకుండా చేసేందుకు వీలుగా పదేళ్ల కిందట అప్పటి ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఈలోగా ప్రభుత్వం మారడం, ఆ ప్రతిపాదనలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. 


వైసీపీ వచ్చాక సాగని పనులు

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ముత్తుముల అశోక్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో సగిలేరు నదిపై చెక్‌డ్యాంలు నిర్మించి పూడికతీసి రివిట్‌వాల్స్‌ను నిర్మిస్తే నీటిముంపును అరికట్టడమే కాకుండా భూగర్భజలాలు కూడా పెరుగుతాయని సమగ్ర ప్రతిపాదనలు తయారు చేయించారు. తదనుగుణంగా సుమారు రూ.15 కోట్లు మంజూరు చేయించారు. ఆ వెంటనే ప్రభుత్వం టెండర్‌ సైతం పిలిచింది. ఆ తర్వాత ఎన్నికల రావడం, వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పనుల ఊసే లేదు.  ప్రస్తుతం నిధుల కేటాయింపులేక యథాస్థితి కొనసాగుతోంది.


కొండపేట రోడ్డులో నల్లవాగు పొంగిన సందర్భంలోనూ అటు అండర్‌ బ్రిడ్జి వద్ద, కొంగళవీడు రోడ్డుపై నీరు ప్రవహించి ఆ ప్రాంతాలు ముంపునకు గురికావడం, రాకపోకలు ఆగిపోవడం జరుగుతున్నది. భారీ వర్షాలు కురిసిన సందర్భాలలో నల్లబండ బజారులోని పలు లోతట్టు వీధులు నీటి ముంపునకు గురై ఇళ్లలోకి నీరు చేరుతున్న సందర్భాలు చాలా పర్యాయాలు జరిగాయి. ఇలాంటి సందర్భాలలో నీటి ముంపు నుంచి కాపాడతామని ప్రజాప్రతినిధులు, అధికారులు ఇస్తున్న హామీలు గాలిలో కలిసి పోతున్నాయి. 

ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి సగిలేరు నది అభివృద్ధికి చర్యలు తీసుకుంటే అటు నీటి ముంపు నుంచి ప్రజలను కాపాడడమే కాకుండా భూగర్భ జలాలు పెరిగి నీటి సమస్య లేకుండా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.  

Updated Date - 2022-01-22T04:28:44+05:30 IST