ముగిసిన కార్తీక మాసోత్సవాలు

ABN , First Publish Date - 2021-12-04T04:36:55+05:30 IST

మహానంది క్షేత్రంలోని కార్తీక మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. కామేశ్వరిదేవి అమ్మవారికి ఆలయవేదపండితులు, రుత్వికులు లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని వేదమంత్రాలతో నిర్వహించారు.

ముగిసిన  కార్తీక మాసోత్సవాలు
కామేశ్వరిదేవి ఆలయంలో లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్న వేదపండితులు


మహానంది, డిసెంబరు 3: మహానంది క్షేత్రంలోని కార్తీక మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. కామేశ్వరిదేవి అమ్మవారికి ఆలయవేదపండితులు, రుత్వికులు లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని వేదమంత్రాలతో నిర్వహించారు. అమ్మవారిని అర్చకులు వనిపెంట ప్రకాశంశర్మ ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో వేదపండితులు రవిశంకర్‌ అవధాని, నాగేశ్వరశర్మ, హనుమంతరాయ్‌శర్మ విశేషపూజలతో పాటు ఘనంగా కుంకుమార్చన, వేదశాస్త్ర సమర్పణం, నీరాజనమంత్ర పుష్పం పూజలను నిర్వహించారు. అంతకుమందు దాతలతో గురువారం మహానందీశ్వరుడికి నిర్వహించిన లక్ష బిల్వదళాలను పరిసరాల్లోని విష్ణుగుండం పుష్కరిణిలో రుత్వికులు నిమజ్జనం చేయించారు.  కార్యక్రమంలో దాతలతో పాటు ఆలయ ఏఈఓ ఎర్రమల్ల మధు దంపతులు, భక్తులు పాల్గొన్నారు.

-  మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి  శాంతి కల్యాణాన్ని రుత్వికులు, ఆలయ వేదపండితులు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల విగ్రహాలను మేళతాళాలతో కల్యాణ మంటపం వద్దకు తీసుకొచ్చి కళ్యాణాన్ని జరిపారు.

Updated Date - 2021-12-04T04:36:55+05:30 IST