స్వశక్తికి స్వస్తి

ABN , First Publish Date - 2022-08-17T09:02:25+05:30 IST

‘ప్రజా సంక్షేమమే మా ప్రాధాన్యం’.. ప్రభుత్వ పెద్దలు తరచూ చెబుతున్న మాట ఇది.

స్వశక్తికి స్వస్తి

  • స్వయం ఉపాధి పథకాలకు వైసీపీ ప్రభుత్వం మంగళం
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి గాలికి
  • గత ప్రభుత్వంలో ఉన్న పథకాలు రద్దు 
  • యువత భవిష్యత్తుకు లభించని భరోసా
  • అందని రుణాలు.. ప్రోత్సాహం కరువు 
  • ఆయా కులాల కార్పొరేషన్లతో సాయం ఏదీ? 
  • బడ్జెట్‌లోనే నిధులు.. నవరత్నాలకు మళ్లింపు
  • బుక్‌ అడ్జె్‌స్టమెంట్‌ సంస్థలుగా కార్పొరేషన్లు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘ప్రజా సంక్షేమమే మా ప్రాధాన్యం’.. ప్రభుత్వ పెద్దలు తరచూ చెబుతున్న మాట ఇది. ప్రజలకు పథకాలు అందించడానికి క్రమం తప్పకుండా ‘బటన్‌’ నొక్కుతున్నానని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. సంక్షేమమంటే పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి. బీసీలు, దళితులు, గిరిజనులు, ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీల అభివృద్ధికి దోహదపడాలి. యువత సొంతకాళ్లపై బతికేలా, స్వయం ఉపాధి పొందేలా సాయం చేయాలి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్వయం ఉపాధి అటకెక్కింది. అందినకాడల్లా అడ్డగోలుగా అప్పులు చేస్తున్నా.. గతంలో ఉన్న స్వయం ఉపాధి పథకాలకు మంగళం పాడేసింది. రాజ్యాంగబద్ధంగా వెలసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాలకు అందాల్సిన సహకారం పూర్తిగా ఆగిపోయింది. బడ్జెట్‌లో కార్పొరేషన్లకు నిధులు కేటాయించినా వాటిని నవరత్నాలకు మళ్లిస్తున్నారు. నవరత్నాల్లోనే స్వయం ఉపాధి, సంక్షేమం చూసుకోవాలంటూ సెలవిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత ఏటా రూ.2 వేల కోట్ల వరకు స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మూడేళ్లుగా వారికి ఎలాంటి ఆర్థిక సాయం చేయకుండా మొండి చేయి చూపింది. బడుగులు స్వశక్తితో ఎదిగేందుకు ఎలాంటి ప్రోత్సాహం అందివ్వడం లేదు. 


ఎస్సీ, ఎస్టీల స్వయం ఉపాధి కుదేలు

గత ప్రభుత్వంలో ఏటా వేలాదిమంది ఎస్సీ, ఎస్టీ యువత స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందేవారు. తమకు నచ్చిన రంగంలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు 60 శాతం దాకా సబ్సిడీ అందుకునేవారు. డ్రైవింగ్‌ వృత్తిలో ఉన్న యువతకు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు రుణాలు ఇప్పించి ఇన్నోవా కార్లు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పలు రకాల యంత్రాల కొనుగోలుకు సబ్సిడీ ఇచ్చి సహకారమందించారు. ఒక్కో యువకుడికి రూ.లక్ష నుంచి రూ.20 లక్షల దాకా బ్యాంకుల ద్వారా రుణసాయం చేశారు. బ్యాంకులు రుణాలివ్వని సందర్భంలో కొంత మందికి ఎన్‌ఎ్‌సఎ్‌ఫడీఎస్‌, ఎన్‌టీఎ్‌ఫడీఎస్‌ సహకారంతో నేరుగా ప్రభుత్వమే రుణాలందించింది.


ఏటా 50 వేల మంది ఎస్సీ, 5 వేల మంది ఎస్టీ యువత లబ్ధి పొందేవారు. పలు ఐటీడీఏ ప్రాజెక్టుల ద్వారా గిరిజనులకు అభివృద్ధి కార్యక్రమాలు గతంలో నిర్వహించేవారు. గొర్రెలు, బర్రెలు తదితర ఆర్థికాభివృద్ధి యూనిట్లను 90 శాతం సబ్సిడీతో అందించేవారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి వసతిని కూడా కల్పించారు. గిరిజన మత్స్యకారులకు వలలు, సైకిళ్లు, ఆటోలు, పెద్ద వాహనాలను 90 శాతం సబ్సిడీతో అందించారు. ఎస్టీ కార్పొరేషన్‌, ఐటీడీఏల ద్వారా పేద ఎస్టీ రైతులకు విద్యుత్‌ సౌకర్యం, బోర్లు, మోటార్లు, పైపులు తదితర సౌకర్యాలు కల్పించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్వయం ఉపాధి పథకానికే స్వస్తి పలికారు. కాంగ్రెస్‌ హయాంలో నిర్లక్ష్యం చేసిన ఎన్‌ఎస్‌‌టీఎఫ్‌డీసీని చంద్రబాబు ప్రభుత్వం పునరుద్ధరిస్తే... జగన్‌ సర్కారు వచ్చిన తర్వాత రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్రం ఆ నిధులను నిలిపేసింది. 


ముస్లిం, క్రిస్టియన్లకూ దక్కని రుణాలు

ముస్లింలలో ఎక్కువ మంది పట్టణాలు, మండల కేంద్రాల్లో వెల్డింగ్‌, మెకానిక్‌ షాపులు, పాత ఇనుమ సామానుల అంగడి, తదితర చిన్న చిన్న స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గత ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలు అమల్లోకి తెచ్చింది. పలు రకాల కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించింది. ఒక్కో యూనిట్‌కు రూ.3 లక్షలు చొప్పున రుణాలు ఇప్పించి, అందులో లక్ష రూపాయలు సబ్సిడీగా ఇచ్చింది. వయోపరిమితిని 21-45 ఏళ్ల నుంచి 21-55 ఏళ్లకు పెంచింది. చంద్రబాబు ప్రభుత్వంలో ముస్లిం, క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ల ద్వారా ఏటా 10 వేల మందికి స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు సాయం చేసింది. దుకాన్‌, మకాన్‌ పథకాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఏటా వెయ్యి మంది ముస్లిం యువతకు నివాసం, దుకాణం నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయం ఉపాధి యూనిట్లకు మంగళం పాడేసింది.


బీసీల సంక్షేమం గాలికి.. 

రాష్ట్రంలో బీసీలు దాదాపు 2.14 కోట్ల మంది ఉన్నారు. గత ప్రభుత్వం 137 రకాల బీసీ కులాలను కలుపుకొని 13 కార్పొరేషన్లు, 9 ఫెడరేషన్లు ద్వారా ప్రతి ఏటా రూ.1000 కోట్లకు పైగా స్వయం ఉపాధి యూనిట్లు అందజేసింది. ఆదరణ పనిముట్ల పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రజకులకు వాషింగ్‌మెషిన్లు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు సంబంధించిన పరికరాలు, టైలర్లకు సరికొత్త కుట్టుమిషన్లు అందజేసింది. ఏటా 60 వేల మంది బీసీలకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరుచేసి ఒక్కొక్కరికి రూ.లక్ష సబ్సిడీ ఇచ్చింది. ఐదేళ్లలో 3లక్షల మందికి పైగా బీసీలు ప్రయోజనం పొందారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయింది. కేవలం ఐదు  కులాలకు చెందిన 44 లక్షల మందికి తప్ప మిగతా 1.70 కోట్లమంది బీసీల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్న విమర్శలు వస్తున్నాయి. 4.37 లక్షల మందికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున అందజేసి, బీసీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది.


పేరుకే కార్పొరేషన్లకు కేటాయింపులు 

స్వయం ఉపాధి పథకాలకు నిధులు ఎండగట్టిన వైసీపీ  ప్రభుత్వం పేరుకే బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయించింది. 2021-22లో ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు రూ.754 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.240 కోట్లు, మైనారిటీ కార్పొరేషన్‌కు రూ.346 కోట్లు, బీసీ కార్పొరేషన్‌కు బదులుగా బీసీ-ఏ, బీ, సీ, డీ కులాల కార్పొరేషన్లు అంటూ సుమారు రూ.3000 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ అదేరీతిలో చూపించింది.  అయితే ఈ నిధులేవీ ఆయా కార్పొరేషన్లు ఖర్చు చేసే పరిస్థితి లేదు. ఆయా కులాలకు సంబంధించిన నవరత్నాలకు ఈ కార్పొరేషన్ల ద్వారా బుక్‌ అడ్జె్‌స్టమెంట్‌ చేస్తున్నారు. కార్పొరేషన్‌ చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ ఒక్క లబ్ధిదారుడిని కూడా ఎంపిక చేసే పరిస్థితి లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. దీంతో కార్పొరేషన్లన్నీ బుక్‌ అడ్జె్‌స్టమెంట్‌ సంస్థలుగా మారిపోయాయి.

Updated Date - 2022-08-17T09:02:25+05:30 IST