కూత ఎప్పుడో..!?

ABN , First Publish Date - 2021-07-24T06:03:37+05:30 IST

జిల్లా జనాభా 30 లక్షలకు పైమాటే. ఇక్కడి నుంచి బెంగళూరుకు రైలులో ప్రయాణించాలంటే తిరుపతికి వెళ్లి అక్కడి నుంచి వెళ్లాల్సి వస్తుంది. లేదంటే రోడ్డు మార్గమే శరణ్యం. సాఫ్ట్‌వేర్‌ వంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఉన్నత విద్య, ఉపాధి కోసం బెంగళూరు వెళ్తున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

కూత ఎప్పుడో..!?
కడప-పెండ్లిమర్రి మధ్య నిర్మించిన రైలుమార్గం

కడప-బెంగళూరు రైల్వేలైన నిర్మాణంలో అంతులేని జాప్యం

13 ఏళ్లుగా ఎదురుచూపులు

ముందుకు సాగని పనులు

బడ్జెట్లో అరకొర కేటాయింపులే


కడప-బెంగళూరు రైలు మార్గం ఎన్నో ఏళ్ల స్వప్నం. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు ముందుకు మూడడుగులు.. వెనక్కి ఆరడుగులు అన్నట్లుగా మారాయి. ఈ రైల్వేలైన పూర్తతే నిత్యం బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 2008-09లో రూ.1,000.23 కోట్లతో 255.40 కి.మీల రైలు మార్గానికి శ్రీకారం చుట్టారు. 13 ఏళ్లలో పాతిక కి.మీలు కూడా పూర్తికాలేదు. ఈ మార్గంలో రైలు కూత పెట్టాలంటే ఇంకెన్నేళ్లు నిరీక్షించాలో..? ఆలస్యం కారణంగా నిర్మాణ అంచనా వ్యయం రూ.1,000 కోట్ల నుంచి రూ.3,500కోట్లకు చేరుకుంది. జిల్లావాసి అయిన సీఎం జగన ప్రత్యేక చొరవ తీసుకొని రైల్వేలైన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. నూతన రైల్వేలైన నిర్మాణంలో నిర్లక్ష్యంపై ప్రత్యేక కథనం.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లా జనాభా 30 లక్షలకు పైమాటే. ఇక్కడి నుంచి బెంగళూరుకు రైలులో ప్రయాణించాలంటే తిరుపతికి వెళ్లి అక్కడి నుంచి వెళ్లాల్సి వస్తుంది. లేదంటే రోడ్డు మార్గమే శరణ్యం. సాఫ్ట్‌వేర్‌ వంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఉన్నత విద్య, ఉపాధి కోసం బెంగళూరు వెళ్తున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రైలు రవాణా లేకపోవడంతో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులపై ఆధార పడాల్సి వస్తోంది. రోడ్డు రవాణా ద్వారా ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులకు గురౌతున్నారు. కడప-బెంగళూరు మధ్య నూతన రైల్వేలైన నిర్మించాలనే ప్రజల విన్నపం మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 255.40 కి.మీల నూతన రైలు మార్గం నిర్మాణానికి 2008-09లో అంచనా వ్యయం రూ.1,000.23 కోట్లతో చేపట్టారు. భారత రైల్వేశాఖ 50 శాతం నిధులు సమకూరిస్తే.. మిగిలిన 50 శాతం నిధులు ఆంధ్రప్రదేశ, కర్ణాటక ప్రభుత్వాలు చెల్లించాలి. రెండు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజకరమైన రైల్వేలైన పనులకు 2010 సెప్టెంబరు 2న కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కేహెచ మునియప్ప శంకుస్థాపన చేశారు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారాయి.


ఆరు దశల్లో నిర్మాణం

కడప, పెండ్లిమర్రి, రాయచోటి, మదనపల్లి నుంచి నేరుగా బెంగళూరుకు రైలు మార్గం నిర్మించేలా మొదట్లో డిజైన చేశారు. ఆ తరువాత కోలార్‌కు మార్చి అక్కడి నుంచి బంగారుపేట-బెంగళూరు రైల్వేలైనకు అనుసంధానం చేసేలా అలైన్మెంట్‌లో మార్పు చేశారు. ఫేజ్‌-1 కింద 0.00 నుంచి 21.80 కి.మీల వరకు (కడప-పెండ్లిమర్రి), ఫేజ్‌-2 కింద 21.80 నుంచి 101.00 కి.మీలు (పెండ్లిమర్రి-రాయచోటి) వరకు, ఫేజ్‌-3 కింద రాయచోటి నుంచి వాల్మీకిపురం స్టేషన వరకు, ఫేజ్‌-4 కింద వాల్మీకిపురం స్టేషన నుంచి మడగట్ల వరకు నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అక్కడి నుంచి రెండు దశల్లో బెంగళూరు వరకు ఈ లైన నిర్మిస్తారు. ఏ ఏ దశలో ఎంత ఖర్చు చేయాలన్నది భారత రైల్వేశాఖ బడ్జెట్‌ వివరాలు పింక్‌ బుక్‌లో స్పష్టంగా వివరించారు.


సా..గుతున్న పనులు

కడప, పెండ్లిమర్రి, రాయచోటి, మదనపల్లి, కోలార్‌ మీదుగా బెంగళూరుకు 260.40 కి.మీల రైలు మార్గం ఇది. మధ్యలో కలిసే పాత లైన్లుపోనూ 255.40 కి.మీలు నిర్మించాలి. ఏపీలో కడప, చిత్తూరు అనంతపురం జిల్లాల్లో గుంతకల్లు రైల్వే డివిజన ఇంజనీర్ల పర్యవేక్షణలో 205 కి.మీలు, కర్ణాటక పరిధిలో బెంగళూరు రైల్వే డివిజన ఇంజనీర్లు 50.40 కి.మీలు నిర్మించాలి. ఇప్పటి వరకు ఫేజ్‌-1 కింద కడప-పెండ్లిమర్రి మధ్యలో 21.80 కి.మీల రైలు మార్గం, రైల్వే స్టేషన్లు మాత్రమే పూర్తి చేశారు. ఈ రైల్వేలైనను రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభాకర్‌ ప్రభు, గత సీఎం చంద్రబాబు రిమోట్‌ వీడియో లింక్‌ ద్వారా ప్రారంభించారు. అనంతరం నిధుల కొరత, పాలకుల్లో చిత్తశుద్ధి లోపించడం, సకాలంలో ఏపీ ప్రభుత్వం వాటా నిధులు సమకూర్చకపోవడం వెరసి కడప వాసులకు ఎంతో కీలకమైన రైల్వేలైన పనులు నత్తడకన సాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారుగా రూ.165 కోట్లకు మించి ఖర్చు చేయలేదని గుంతకల్లు రైల్వే డివిజన అధికారులు పేర్కొన్నారు. 


రూ.3,500 కోట్లకు చేరిన అంచనా

జిల్లా వాసులకు స్వప్నంగా ఉన్న కడప-బెంగళూరు రైల్వేమార్గం నిర్మాణ అంచనా వ్యయం ఏడాదికేడాది పెరుగుతోందే తప్పా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. 2008-09లో అంచనా వ్యయం రూ.1,000.23 కోట్లు. ఈ తరువాత రివైజ్డ్‌ ఎస్టిమేట్‌ వేస్తే రూ.1,732.19 కోట్లకు చేరింది. మళ్లీ సవరించిన ప్రతిపాదనల మేరకు రూ.2,132.77 కోట్లకు చేరితే.. తాజా అంచనా ప్రకారం రూ.3,500 కోట్లకు చేరుతుందని అధికారులు అంటున్నారు. పింక్‌బుక్‌ బడ్జెట్‌ అంకెలు పరిశీలిస్తే.. 2017-18, 2018-19 మినహా ఏయేడు కూడా సగటున రూ.25-30 కోట్లు కూడా కేటాయించలేదని తెలుస్తోంది. ఇలా అయితే నిర్మాణం పూర్తి అవ్వడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో..? అంటూ ప్రజలు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం వాటా నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం కూడా కారణమని ఇంజనీర్లు అంటున్నారు. తాజాగా ఏపీ వాటా నిధులు రూ.200 కోట్లు ఇవ్వాలని సీఎం జగన అధికారులకు సూచించినట్లు సమాచారం.


నిర్మాణ లక్ష్యం

పెండ్లిమర్రి-నందిమండలం మధ్య 12.46 కి.మీలు 2022-23లో పూర్తి చేయాలని లక్ష్యం. అలాగే.. వాల్మీకిపురం - కోనా మధ్య 29.46 కి.మీలు 2023-24లో, రాయచోటి - కోనా మధ్య 26 కి.మీలు 2024-25లో, మదనపల్లి-మడగట్ట మధ్య 60.27 కి.మీలు 2025-26లో, నందిమండలం-రాయచోటి మధ్య 66.24 కి.మీలు 2026-27 సంవత్సరంలో పూర్తి చేయాలని గుంతకల్లు రైల్వే డివిజన అధికారులు లక్ష్యాలను నిర్దేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులు సకాలంలో విడుదల చేస్తేనే ఈ లక్ష్యాల మేరకు నిర్మాణాలు జరుగుతాయి. నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం చేస్తే లక్ష్యం గడువు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.


కడప-బెంగళూరు రైల్వేలైన వివరాలు

రైల్వేలైన నిర్మాణం పొడవు : 255.40 కి.మీలు

2008-09 అంచనా వ్యయం : రూ.1,000.23 కోట్లు

ప్రస్తుతం అంచనా వ్యయం : సుమారుగా రూ.3,500 కోట్లు

రైల్వే స్టేషన్లు : 25

నిర్మించాల్సిన బ్రిడ్జిలు : 278

పెద్ద వంతెనలు : 38

ఆర్‌ఓబీ/ఆర్‌యూబీలు : 6

నిర్మాణ గడువు : 8 ఏళ్లు

ఇప్పటి వరకు చేసిన ఖర్చు : సుమారుగా రూ.165 కోట్లు

నిర్మించిన రైలు మార్గం : 21.80 కి.మీలు 


బడ్జెట్‌ కేటాయింపులు

-------------------------------

సంవత్సరం కేటాయింపులు

(రూ.కోట్లల్లో)

--------------------------------

2008-09 1

2009-10 34

2010-11 40

2011-12 50

2012-13 20

2013-14 50

2014-15 --

2015-16 15

2016-17 15

2017-18 90

2018-19 75

2019-20 2

2020-21 2

2021-22 36

Updated Date - 2021-07-24T06:03:37+05:30 IST