వీడని దారిదోపిడీ

ABN , First Publish Date - 2022-05-19T07:10:57+05:30 IST

నల్లమల అడవిలో జాతీయ రహదారిపై కారును అడ్డగించి దోపిడీకి పాల్పడ్డారు దుండగులు.

వీడని దారిదోపిడీ
దోపిడీ జరిగిన కారును పరిశీలిస్తున్న పోలీసులు

అపహరణకు గురైంది హవాలా డబ్బేనా?

రూ.3.5కోట్లు అని ప్రచారం

నిర్ధిష్టమైన ఫిర్యాదు ఇవ్వని బాధితులు

ఒంగోలు(క్రైం)/పెదదోర్నాల, మే 18: నల్లమల అడవిలో జాతీయ రహదారిపై కారును అడ్డగించి దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన ఈ నెల 16 రాత్రి పెదదోర్నాల మండలం యడవల్లి సమీపంలో జరిగింది. దోపిడీకి గురైంది రూ.3.5 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే కారులో ఉన్న ఇరువురు డ్రైవర్లు సక్రమంగా సమాధానం చెప్పడం లేదు. అంతేకాదు వారు దోపిడీ తర్వాత కారు వదిలేసి నడిచి వస్తుండగా అటవీ శాఖ అధికారులు కనిపించడంతో విషయం తెలిపారని, వారి సూచన మేరకు అక్కడ నుంచి పెదదోర్నాల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చినట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారం మేరకు గుజరాత్‌కు చెందిన డ్రైవర్లు కాలు రామ్‌, అరవింద్‌లు కోల్‌కత్తా నుంచి కర్ణాటకలోని హోస్పేటకు వెళుతున్నారు. యడవల్లి సమీపంలో వెనుకగా ఓ కారులో వచ్చిన దుండగులు కత్తులతో బెదిరించారు. బలిజేపల్లి వైపు కారు ను మళ్లించి అందులో ఉన్న నగదును అపహరించుకెళ్లారు.  కారు తాళాలు కూడా తీసుకొని దూరంగా చెట్లల్లో విసిరేశారు. అయితే కారులో ఎంత నగదు ఉంది ఎవరు, ఎక్కడికి పంపిస్తున్నారు అనేది డ్రైవర్లు చెప్పడం లేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మంగళవారం ఏఎస్పీ(క్రైం)శ్రీధరరావు ఆఽధ్వర్యంలో ఒంగోలు నుంచి సీసీఎస్‌ బృందంతో పాటుగా మార్కాపురం డీఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారులో వెనుకవైపు సీటు కింద ఓ కంటైనర్‌లాగా బాక్స్‌ ఉన్నట్లు గుర్తించారు. గుజరాత్‌కు చెందిన చౌదరి అనే వ్యక్తిని పిలిపించి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఇంత నగదు దోపిడీ జరిగితే సంబంధిత వ్యక్తులు స్పందించకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. ఇది హవాలా నగదు అని ప్రచారం జరుగుతోంది. కారు డ్రైవర్లు మాత్రం పొంతన లేని సమాధానాలు చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోంది. అక్కడ దోపిడీ జరిగిందా లేదా డైవర్లే నాటకమాడుతున్నారా అనేది మిస్టరీగా ఉంది. తెలంగాణ రిజిస్ర్టేషన్‌తో ఉన్న కారులో గుజరాతీయులు ప్రయాణించడం, పైగా నల్లమల అటవీ ప్రాంతం సమీపంలో కారును అడ్డగించి, వారిని బెదిరించి కేవలం రూ.లక్ష అపహరించుకుపోయినట్లు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వెనుక పెద్ద కఽథే నడిచి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.  


లోతుగా విచారిస్తున్నాం : ఎస్పీ మలికగర్గ్‌

ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ మలికగర్గ్‌ తెలిపారు. ఇప్పటికీ కేసు నమోదు చేయలేదన్నారు. అక్కడ ఏమి జరి గిందనేది రెండు రోజుల్లో స్పష్టంగా తెలుస్తుదన్నా రు. వాస్తవం తెలిసిన తర్వాత అవసరమైతే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేయమని వివరించారు. ఇప్పటికే ఏఎస్పీ(క్రైం) విచారణ చేస్తున్నారని చెప్పారు. 


Updated Date - 2022-05-19T07:10:57+05:30 IST