అంతులేని విషాదం

Published: Mon, 28 Mar 2022 01:20:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అంతులేని విషాదంమృతదేహాలను ధర్మవరానికి తీసుకురాగా.. గుమికూడిన జనం

అంతులేని విషాదం

భాకరాపేట బస్సు ప్రమాదంతో 

చేనేత కుటుంబం ఛిద్రం

వరుడి ఇంట ఆరుగురి మృతి

మిన్నంటిన బంధువుల రోదనలు.. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు

ధర్మవరం, మార్చి 27: చిత్తూరు జిల్లా భాకరాపేట బస్సు ప్రమాదంలో ధర్మవరం వాసులు మరణించడంతో పట్టణంలో అంతులేని విషాదం అలుముకుంది. వరుడి కుటుంబంలోనే ఏకంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. ‘నిశ్చితార్థమని ఎంతో సంతోషంగా వెళ్లితిరే... అంతలోనే శవాలై తిరిగి వచ్చారే.. ఇక మాకు దిక్కెవరంటూ’ ఆ చేనేత కుటుంబసభ్యులు రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. విగతజీవులుగా తమ వారిని చూసి, ఆ కుటుంబం సొమ్మసిల్లింది. ఒక్కసారిగా ధర్మవరంలోని మారుతీనగర్‌కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆంబులెన్సలో నుంచి మృతదేహాలను బయటకు తీస్తుండగానే రోదనలు మిన్నంటాయి. బస్సు ప్రమాదంలో మొత్తం 9 మంది మృతిచెందగా.. అందులో పెళ్లికుమారుడి కుటుంబానికి చెందినవారు ఆరుగురు ఉన్నారు. దీంతో ఆ చేనేత కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. వివిధ ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురు కూడా మృతిచెందడంతో ఆయా కుటుంబికుల రోదనలు మిన్నంటాయి. నిశ్చితార్థానికి ధర్మవరం నుంచి బయల్దేరిన బస్సు చిత్తూరు జిల్లా భాకరపేట వద్ద శనివారం రాత్రి అదుపు తప్పి లోయలోకి పడిపోవడంతో ఒక్కసారిగా పట్టుకేంద్రం ఉలిక్కిపడింది. మృతిచెందిన వారికి తిరుపతిలోనే పోస్టుమార్టం నిర్వహించి, ఆదివారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో వారి వారి స్వస్థలాలకు తరలించి, అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా.. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పెళ్లికుమారుడు వేణు తండ్రి మలిశెట్టి మురళి (45), చిన్నాన్న మలిశెట్టి గణేశ (42), చిన్నమ్మ మలిశెట్టి కాంతమ్మ(38), మురళి చిన్నాన్న మలిశెట్టి వెంగప్ప(75), ఇతడి భార్య నాగలక్ష్మి (70), బుక్కపట్నం మండలం మారాలకు చెందిన ఆదినారాయణరెడ్డి(45), ధర్మవరం వాసి డ్రైవర్‌ నబీరసూల్‌(40), తనకల్లు మండలం గోవిందువారిపల్లికి చెందిన చందన (8), కదిరికి చెందిన క్లీనర్‌ షాకీర్‌ (20) ఉన్నారు. ధర్మవరానికి చెందిన మురళికి కుమారుడు వేణుతోపాటు కుమార్తె ఉన్నారు. పట్టణంలో కోమల శిల్క్‌హౌస్‌ నిర్వహిస్తుండేవాడు. మిగిలిన చేనేతలు పట్టుచీరల వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు.


పలువురి నివాళి

బస్సు ప్రమాద మృతులకు పలువురు నివాళి అర్పించారు. టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి.. మృతదేహాలను సందర్శించి, నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.2 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పట్టణంలోని చేనేత ప్రముఖులు, చేనేత కార్మికసంఘం నాయకులు,  మిత్రులు తదితరులు.. మృతదేహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.


బతుకుదెరువు కోసం వెళ్లి..

కదిరి అర్బన: భాకరాపేట ప్రమాదంలో బస్సు క్లీనర్‌, కదిరికి చెందిన షాకీర్‌ మృతి చెందాడు. ఇతడు బతుకుదెరువు నిమిత్తం ధర్మవరం వెళ్లి, అక్కడే స్థిరపడ్డాడు. ప్రైవేటు బస్సు క్లీనర్‌గా పనిచేస్తుండేవాడు. వివాహ నిశ్చితార్థానికి వెళ్తున్న బస్సుకు క్లీనర్‌గా వెళ్లాడు. ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఇతడికి భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధిత కుటుంబానికి టీడీపీ కదిరి నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్‌ రూ.25 వేలు ఆర్థికసాయం అందజేశారు.


కొక్కంటిక్రా్‌సలో పలకరించిన అత్త

తనకల్లు: బస్సు ప్రమాదంలో తనకల్లు మండలం గోవిందువారిపల్లికి చెందిన చందన అక్కడికక్కడే మృతి చెందింది. చంద్ర, పద్మావతి పట్టుచీరలు నేస్తూ జీవనోపాధికోసం ధర్మవరం వలస వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి బస్సులో బయల్దేరారు ప్రమాదంలో చందన దుర్మరణం చెందగా.. తండ్రి చంద్ర, తల్లి పద్మావతి, చెల్లెలు అశ్వని తీవ్రంగా గాయపడ్డారు. చందన మృతి విషయం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు బోరున విలపించారు. ఆదివారం రాత్రి మండలంలోని గోవిందువారిపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. ధర్మవరం నుంచి తిరుపతికి వెళ్తుండగా మేనత్త సుజాత కొక్కంటి క్రాస్‌లో తిరుపతికి వెళ్తున్న బస్సు ఆపి, తన మేనకోడళ్లకు పండ్లు, పూలు ఇచ్చి పంపిందని గ్రామస్థులు గుర్తు చేసుకుని, బోరున విలపించారు.


క్షతగాత్రులు వీరే..

స్విమ్స్‌కు తరలించిన వారు: మునుస్వామి, సరస్వతి, జి.నాగరాజు, తమయశ్రీ, కె.నాగరాజు, జె.చంద్ర, బి.నాగరాజు, భైరవి. 

బర్డ్‌కు తరలించిన వారు: రాము, విజయ్‌, పద్మావతి, యశశ్విని, వెంకటరమణ, లక్ష్మీనారాయణ. 

రుయాలో చికిత్స పొందుతున్న వారు: భాస్కర్‌, తిరుణయ్‌, గోపీచరణ్‌, మారుతి, ప్రేమ్‌కుమార్‌, కోమల, విజయలక్ష్మి, లక్ష్మి, చంద్రశేఖర్‌, లలిత, శశి, సునీత, చరణ్‌తేజ్‌, తిరుపాల్‌, అనిత, వేణుగోపాల్‌, కవిత, బాలకొండ, వేణు, లక్ష్మీనారాయణరెడ్డి, వెంకటేష్‌, లక్ష్మీదేవి, మురళి, రాయుడు, లత, తన్మయి, కోటమ్మ.అంతులేని విషాదంరోదిస్తున్న బంధువులు


అంతులేని విషాదంమురళి, గణేశ, కాంతమ్మ మృతదేహాలు


అంతులేని విషాదం


గంటలో వస్తామని.. 

పెళ్లికుమారుడు వేణు సోదరి హేమలత, బావ ధనంజయ రైలులో బయలుదేరి శనివారం రాత్రి 8.30 గంటలకు తిరుపతికి చేరుకున్నారు. ఆమె తన తల్లిదండ్రులకు ఫోన చేయ గా మరో గంటలో వస్తామని చెప్పారు. గంట దాటినా రాలేదు. ఫోనుచేసినా పనిచేయలేదు. దీంతో ఆందోళనగా ఉంటే.. ప్రమాదం జరిగిందని 10.30 గంటలకు తెలిసింది. ఆస్పత్రి వద్ద తమవారిని చూసి చలించిపోయింది. తమ వారిని తలచుకుని ఆస్పత్రి ముందు రోదిస్తోంది.

అంతులేని విషాదం

ఎవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు 

ఇంతటి దురదృష్టకరమైన పరిస్థితి ఎవరికీ రాకూడదు. మీరు వెళ్లండి వెనకే మేమూ వస్తామని చెప్పి పంపాము. గంటల వ్యవధిలోనే ఇంతటి విషాదం చూడాల్సి వస్తుందని అనుకోలేదు.

- జింకా నాగరాజు, వేణు బంధువు

అంతులేని విషాదం

భార్యాబిడ్డలను తలచుకుంటే.. 

నా భార్య కాంతమ్మ, బిడ్డలు తిరుణయ్‌, తన్మయిశ్రీ పరిస్థితిని తలుచుకుంటే దుఃఖం ఆగడంలేదు. ఎంతో ఆనందంగా వస్తున్న మా ఆనందం ఇలా నిమిషాల వ్యవధిలోనే విషాదంగా మారుతుందనుకోలేదు.

- మల్లిశెట్టి తిరుపాలు

అంతులేని విషాదం

ఈ దుఃఖం ఎప్పటికి తీరుతుందో..

మా కుటుంబానికి జరిగిన ఈ దుఃఖం ఎప్పటికి తీరుతుందో తెలియడంలేదు. ఇందుకు ఎవర్ని నిందించాలో తెలియడంలేదు. మాకు పెద్ద  దిక్కుగా ఉన్న మా అన్న లేకుండా పోయాడు. మిగిలిన వారి పరిస్థితి ఇలా ఉంది. 

- మునుస్వామి, వేణు చిన్నాన్న

అంతులేని విషాదం

ఈ పరిస్థితి నుంచి  కోలుకునేదెప్పుడో? 

వేణు మా అన్న కొడుకు. వాడు అనుకున్నట్లు గానే స్థిరపడి ఇప్పుడు పెళ్లి చేసుకునే సమయంలో ఇలా జరిగింది. వాళ్ల నాన్న చనిపోయిన విషయం కూడా వాడికి తెలీదు. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు కోలుకుంటాడో?

- వేణుగోపాల్‌, వేణు చిన్నాన్న

అంతులేని విషాదం

మా నాన్నను చూపించడంలేదు 

నాకు చిన్న దెబ్బ తగిలితేనే మా నాయన తట్టుకోలేడు. ఇప్పుడు ఇంత పెద్ద దెబ్బ తగిలినా ఆయన కనిపించలేదు. ఎక్కడని అడిగితే పక్క గదిలో ఉన్నాడని చెబుతున్నారు. అలా ఉంటే నన్ను చూడకుండా ఉండలేరు.

- చరణ్‌తేజ్‌, మృతుడు గణేష్‌ కుమారుడు

అంతులేని విషాదం

బావ లేడని ఎలా చెప్పాలి? 

మా బావ గణేష్‌ లేడని చికిత్స పొందుతున్న అక్క భైరవికి, పిల్లలు లక్ష్మి, చరణ్‌తేజ్‌కు ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు. చెబితే తట్టుకునే శక్తి వారికి లేదు. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావడంలేదు.

- బాల నరసింహ, గణేష్‌ బావమరిది


అంతులేని విషాదం

మా అక్క పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు 

మా అక్క లలిత ఇప్పుడిప్పుడే కొంచెం సంతోషంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బావ మురళి దూరమవడం జీర్ణించుకోలేని విషయం. ఆమె పరిస్థితి ఏంటో అర్థం కావడంలేదు. దేవుడిపై భారం వేసి చూస్తున్నాం.

- నరేష్‌, గుత్తి, లలిత తమ్ముడు

అంతులేని విషాదం

నా బిడ్డ పరిస్థితిని చూసి కన్నీరు ఆగడంలేదు 

నా బిడ్డకు పెళ్లి కుదుర్చుకోవడానికి అయిన వాళ్లతో ఆనందంగా బయలుదేరిన మా పరిస్థితి ఇలా అవుతుందని అనుకోలేదు. నా బిడ్డకు కూడా తీవ్రంగా దెబ్బలు తగిలాయని తెలిసింది. వాడికి ఎందుకు ఇలా జరిగిందో తెలియడంలేదు. వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కావడంలేదు. ఎవరికీ హాని చేయని మాకెందుకిలా జరిగిందో? 

- లలిత, వేణు తల్లి


అంతులేని విషాదం

ఆటకదరా ‘శివా’

మార్చురీలో శవాలుగా భార్యతోపాటు తోడపుట్టినోళ్లు. ఆస్పత్రిలో క్షతగాత్రులుగా పెళ్లీడుకొచ్చిన కుమార్తె, అన్నదమ్ముల పిల్లలు. ఆప్తుల ఓదార్పు, అధికారుల భరోసా ఆయనకు మనోధైర్యం ఇవ్వడంలేదు. దిగాలుగా మార్చురీ వైపు చూడడం తప్ప. పోస్టుమార్టం పూర్తిచేసుకుని తెల్లగుడ్డలు చుట్టుకుని తొలుత బయటకు తీసుకొచ్చిన భార్య మృతదేహాన్ని పట్టుకుని చూస్తూ ఉండిపోయాడు. కంటినుంచి చుక్కనీరు కారలేదు. మాట పెగల్లేదు. అలాగని అతడిలో ఆవేదన లేదని కాదు. గుండెల్లోని బడబాగ్నిని బయటకు రానివ్వకుండా దాచుకున్నట్టు కనిపించాడు. తన కుడిచేతితో భార్య నుదుటిని తాకి వాహనం ఎక్కించాడు. అంత్యక్రియల్లో పాల్గొనడమే అనివార్యమని చికిత్స పొందుతున్న బిడ్డలను వదిలేసి అంబులెన్సులో బయలుదేరాడు పెళ్లికుమారుడి చిన్నాన్న శివ.  

ఆగిన నిశ్చితార్థం

నారాయణవనం: భాకరాపేట ఘాట్‌ వద్ద ప్రమాదంతో నిశ్చితార్థం ఆగింది. నారాయణవనం మండలానికి చెందిన అమ్మాయితో ధర్మవరానికి చెందిన వేణుకు తిరుచానూరులో ఆదివారం ఉదయం నిశ్చితార్థం జరగాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో అమ్మాయి కుటుంబీకులు, బంధువులు విచారంలో మునిగిపోయారు. వీరు రుయా ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను విచారించారు.


అంతా క్షణాల్లో జరిగిపోయింది

‘ధర్మవరం నుంచి బస్సులో వస్తున్న మేము భాకరాపేట వద్ద టీ తాగి వెంటనే బయలుదేరాం. ఘాట్‌లో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పింది. క్షణాల్లోనే ఘోరం జరిగిపోయింది. బస్సు తునాతునకలైంది. చుట్టూ రాళ్లు, చెట్లు ఉన్నాయి. గాయాలతో ఒకటే ఆర్తనాదాలు’ అంటూ ప్రమాద ఘటనను గుర్తుచేసుకున్నారు రక్తం కారుతున్న బాధితుడు, ప్రత్యక్ష సాక్షి అయిన లక్ష్మణ్‌ రెడ్డి.


అమ్మ ఎక్కడంటే..చెప్పలేకపోతున్నా 

‘అమ్మ ఎక్కడని మా చెల్లి (లక్ష్మీకాంతమ్మ) కుమార్తె అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నా. ఆ అమ్మాయిని చూద్దామని వెళ్లాలంటే భయమేస్తోంది. మా కళ్లల్లో నీళ్లు చూసి గాబరాపడుతోంది. మా బంధువులు దెబ్బలతో పడుకుని ఉన్నారు. వారెవరికీ తెలియదు. చనిపోయినట్టు చెబితే షాక్‌లో ఏమన్నా అవుతుందని భయపడుతున్నాం. ఆఖరి చూపులేకనే అంత్యక్రియలు చేయాల్సి వస్తోంది’ అంటూ భద్రాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. 

- తిరుపతి, ఆంధ్రజ్యోతి


మృతుల్లో జర్నలిస్టు 


ధర్మవరానికి చెందిన ఆదినారాయణరెడ్డి ఓ దినపత్రికలో జర్నలిస్టు. పదేళ్లుగా పనిచేస్తుండేవాడు. బంధువులతో కలిసి పెండ్లి బృందంతోపాటు బస్సులో వచ్చిన ఇతడు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.

- ఎర్రావారిపాళెం


అంతా బాగానే ఉన్నారనుకుంటున్నా.. 

‘బస్సును వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగింది. నెమ్మదిగా వెళ్లమని నేను చెబుతూనే ఉన్నా. దేవుడి దయవల్ల అంతా బాగానే ఉన్నారని అనుకుంటున్నా’ అంటూ స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్న పెళ్లి కుమారుడు వేణు మీడియాకు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే.. నాన్న, చిన్నాన్న, చిన్నమ్మ, చినతాత, ఇతర బంధువులు మృతిచెందిన విషయాన్ని అతడికి తెలియనీయలేదని తెలుస్తోంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.