దేవదాయ శాఖలో కుర్చీలాట

ABN , First Publish Date - 2022-05-29T06:30:38+05:30 IST

అనకాపల్లి జిల్లా ఏర్పడి రెండు నెలలు కూడా కాక ముందే దేవదాయ శాఖ జిల్లా అధికారిగా ముగ్గురిని మార్చి నాలుగో వ్యక్తిని నియమించింది.

దేవదాయ శాఖలో కుర్చీలాట
బండారు ప్రసాద్‌

అనకాపల్లి జిల్లా దేవదాయ శాఖ అధికారిగా బండారు ప్రసాద్‌ నియామకం

అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తూ విశాఖలో ఐదు ఆలయాలు చూసుకోవాలి

రెండు నెలలు కాక ముందే ముగ్గురు అధికారుల మార్పు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


అనకాపల్లి జిల్లా ఏర్పడి రెండు నెలలు కూడా కాక ముందే దేవదాయ శాఖ జిల్లా అధికారిగా ముగ్గురిని మార్చి నాలుగో వ్యక్తిని నియమించింది. అనకాపల్లి జిల్లా దేవదాయ శాఖ అధికారి (డీఈఓ)గా గ్రేడ్‌-1 ఈఓ పీఎస్‌ఎన్‌ మూర్తి నియామకాన్ని రద్దు చేసి ఆ స్థానంలో అదే గ్రేడ్‌-1కు చెందిన బండారు ప్రసాద్‌ను శనివారం నియమించింది. ఉదయం ఉత్తర్వులు రాగానే ఆయన మధ్యాహ్నమే బాధ్యతలు స్వీకరించారు. ప్రసాద్‌ ప్రస్తుతం విశాఖపట్నంలో తనకున్న ఆలయాల బాధ్యతలు నిర్వహిస్తూనే అనకాపల్లి జిల్లా అధికారిగా వ్యవహరించాల్సి ఉంది. 

దేవదాయ శాఖలో చాలాకాలంగా పదోన్నతులు లేవు. కొత్త నియామకాలు లేవు. దాంతో ఒక్కో ఈఓ పదికి తక్కువ కాకుండా ఆలయాల బాధ్యతలు చూస్తున్నారు. డిప్యూటీ కమిషనర్లు కూడా లేకపోవడం వల్ల అసిస్టెంట్‌ కమిషనర్లనే ఆ స్థానాల్లో నియమిస్తున్నారు. అసిస్టెంట్‌ కమిషనర్లు ఉండాల్సిన స్థానంలో గ్రేడ్‌-1 ఈఓలను వేస్తున్నారు. అనకాపల్లి డీఈఓ పోస్టు ఆ విధంగానే భర్తీ అయింది. జిల్లా ఏర్పాటుచేసినప్పుడు విశాఖ జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. రెండు వారాల క్రితం సూపరింటెండెంట్‌ స్థాయి కలిగిన రాజారావుకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆ కుర్చీలో కూర్చోకుండానే సెలవుపై వెళ్లిపోయారు. ఈలోగా మునగపాక గ్రూపు దేవాలయాల ఈఓ పీఎస్‌ఎన్‌ మూర్తిని ఆ స్థానంలో నియమిస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు రాగా, ఆయన ఆగమేఘాలపై అదేరోజు రాత్రి విశాఖ ఏసీ కార్యాలయంలో బాధ్యతలు తీసేసుకున్నారు. అయితే ఆయన గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారని, ఆ  కేసు ఇంకా పూర్తి కాక ముందే జిల్లా అధికారిగా నియమించారంటూ  ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించడంతో ఉన్నతాధికారులు పెదవి కరుచుకున్నారు. ఆయనపై ఏసీబీ కేసు ఉందని తెలియగానే తక్షణమే తొలగించి శుక్రవారం ఉదయమే వేరే వారిని బాధ్యతలు తీసుకోవాలని కమిషనర్‌ ఆదేశించారు. కృష్ణా జిల్లాలో పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న ఓ అసిస్టెంట్‌ కమిషనర్‌(మహిళ)ను వెళ్లాల్సిందిగా సూచించారు. అయితే తనకు అనకాపల్లి బాగా దూరమవుతుందని, వెళ్లలేనని చెప్పడంతో వేరే అధికారి కోసం ప్రయత్నించారు. అక్కడికి వెళ్లేందుకు విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న పలువురు ఆసక్తి చూపించారు. అయితే విశాఖ శారదా పీఠాధిపతితో సదరు పీఎస్‌ఎన్‌ మూర్తి సిఫారసు చేయించుకోవడంతో వెనుకా ముందు ఆలోచించకుండా ఆయన్ను నియమించేశారు. 


ఇక్కడ...అక్కడ పనిచేయాల్సిందే!

బండారు ప్రసాద్‌ డీఈఓగా అనకాపల్లిలో బాధ్యతలు నిర్వర్తిస్తూ తాను ఈవోగా ఉన్న ఇసుకకొండ సత్యనారాయణ స్వామి, పోర్టు వెంకటేశ్వరస్వామి, కప్పరాడ వెంకటేశ్వర స్వామి, బర్మా క్యాంపు అమ్మవారు, నాయుడుతోటలో మరో ఆలయ బాధ్యతలు కూడా చూసుకోవలసి ఉంటుంది. విశాఖలో జిల్లా అధికారి ఆధీనంలో పనిచేస్తూ, అనకాపల్లి వెళ్లి అక్కడ జిల్లా అధికారిగా వ్యవహరించాలి. ఆ జిల్లాలో ఈఓల పనితీరు, ఆలయాల బాగోగులు చూసుకోవాలి. దీని వల్ల ఆయన అనకాపల్లి జిల్లాలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలరా?...అని ఆ శాఖ సిబ్బందే చర్చించుకుంటున్నారు.

Updated Date - 2022-05-29T06:30:38+05:30 IST