
దేశ ప్రయోజనాలకే భారత ప్రాధాన్యం
జీ-7 సదస్సులో ప్రధాని మోదీ అతిథి ప్రసంగం
తిరుగు ప్రయాణంలో యూఏఈ చీఫ్‌తో భేటీ
ఎలమావ్, జూన్ 28: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన భద్రత చాలా సవాలుతో కూడిన అంశంగా మారిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే భారత్ నిర్ణయం తీసుకుంటుందని నొక్కి చెప్పారు. జర్మనీలోని ఎలమావ్లో జరిగిన జీ-7 దేశాల సదస్సులోనూ, ఈ సందర్భంగా వివిధ దేశాధినేతలతో జరిపిన చర్చల్లోనూ రష్యా-ఉక్రెయిన్ పరిస్థితిపై భారత వైఖరిని మోదీ స్పష్టం చేశారు. సవాళ్ల సమయంలో అవసరం ఉన్న అనేక దేశాలకు ఆహారధాన్యాలను భారత్ సరఫరా చేసిందన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి నిరంతరం సాగే ప్రయత్నాల్లో భారత్ భాగస్వామ్యమవుతోందని, పరిష్కార ప్రదాతగా కనిపిస్తోందని తెలిపారు. కాగా.. పౌర సమాజంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం, భిన్నత్వాలను పరిరక్షించేందుకు బహిరంగ చర్చకు, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో స్వేచ్ఛగా సమాచార బదిలీకి కట్టుబడి ఉన్నామని జీ-7 దేశాల అధినేతలు, భారత్ సహా అతిథులుగా హాజరైన 5 దేశాల అధినేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు ‘2022 రీసైలెంట్ డెమోక్రసీస్ స్టేట్మెంట్’ పేరిట ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఆన్లైన్లో ఉగ్రవాద, హింసాత్మక అతివాద సమాచారాన్ని తొలగించేందుకు క్రీస్ట్‌చర్చ్ కాల్ పిలుపునకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఉక్రెయిన్‌కు జీ-7 దేశాల మద్దతు..
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆహారధాన్యాల ధరలు పెరిగిపోయిన దృష్ట్యా ఆహారభద్రత కోసం రూ.35,561 కోట్లు(4.5 బిలియన్ డాలర్లు) వెచ్చించేందుకు జీ-7 దేశాలు అంగీకరించాయి. ఇందులో తమ వాటాగా 21,811 కోట్లు(2.6 బిలియన్ డాలర్లు) ఇస్తామని అమెరికా ప్రకటించింది. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలవాలని జీ-7 దేశాలు నిర్ణయించాయి.
జీ-7 దేశాధినేతలకు మోదీ బహుమతులు..
భారతదేశ గొప్ప సాంస్కృతిక, కళాత్మక సంప్రదాయాలను ప్రతిబింభించేలా ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో వివిధ దేశాధినేతలకు బహుమతులు తీసుకెళ్తుంటారు. యూపీలోని వివిధ ప్రాంతాలు, అలాగే కశ్మీర్, ఛత్తీ్‌సగఢ్‌లలో వివిధ ప్రసిద్ధి చెందిన కళాకారులు తయారు చేసిన వస్తువులను జీ-7 దేశాధి నేతలకు బహుమతిగా ప్రధాని అందజేశారు. కాగా.. జీ-7 సదస్సు నుంచి తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) నూతన అధ్యక్షుడిగా నియమితులైన అబూదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిశారు.