
నవీన నాగరికతల ఇంధన అవసరాలు అపరిమితమైనవి. వాటిని మనం తీర్చుకునే క్రమంలోనే వాతావరణ మార్పు ఉత్పన్నమయింది. బొగ్గు, చమురు, సహజవాయువు మొదలైన శిలాజ ఇంధనాల దగ్ధ ప్రక్రియల నుంచి వెలువడే ఉద్గారాలు నేడు ప్రపంచాన్ని ఒక ప్రమాదకర పరిస్థితిలోకి తీసుకువెళ్ళాయి. భూమి అంతులేకుండా వేడెక్కి పోతోంది. మానవాళికి పెను విపత్తు ముంచుకొస్తోందని ‘వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందం’ (ఐపీసీసీ) తాజా నివేదిక మరింత స్పష్టంగా హెచ్చరించింది.
ధరిత్రి మాత్రమే దహించుకుపోవడం లేదు, ఇంధన విపణి సైతం ఉడికిపోతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందే చమురు మొదలైన ఇంధన వనరుల ధరలు నింగిలోకి దూసుకువెళ్లాయి మరి ఈ ధరల పెరుగుదల అయినా హరిత, స్వచ్ఛ ఇంధన భవిష్యత్తు దిశగా మన గమనాన్ని వేగవంతం చేస్తుందా? అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. అలా కాకుండా, ఇప్పటికీ విశ్వసనీయంగా ఉన్న శిలాజ ఇంధనాలను మరింతగా ఉపయోగించుకోవడంపై ప్రభుత్వాలు తమ దృష్టిని కేంద్రీకరిస్తాయా? పెరిగిన ధరల బెడద గతించిన కాలంలోని ఇంధన వాణిజ్యానికి కొత్త ఊపిరిలు పోయనున్నదా?
ఐరోపా, ముఖ్యంగా జర్మనీ ఈ ప్రశ్నలకు తావిస్తోంది. పునరుత్పాదక ఇంధన అభివృద్ధికి జర్మనీ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టింది. అయితే తన విద్యుత్ అవసరాలకు సహజ వాయువు దిగుమతులపై కూడా బాగా ఆధారపడుతోంది. జర్మనీ దిగుమతి చేసుకునే సహజ వాయువులో 40 శాతం రష్యా నుంచి వస్తోంది. ఉక్రెయిన్‌లో యుద్ధంతో ఈ సరఫరాలకు ఎనలేని ఇబ్బందులు ఏర్పడ్డాయి. జర్మనీ, ఆ మాట కొస్తే యూరోపియన్ దేశాలన్నీ తమ ఇంధన అవసరాలకు అత్యధికంగా రష్యా పైనే ఆధారపడివున్నాయి. ఈ కారణంగా రష్యాతో తమ వాణిజ్య సంబంధాలను నిలిపివేసుకునే ప్రసక్తి లేదని జర్మన్ ఛాన్సలర్ కొద్ది రోజుల క్రితం స్పష్టం చేశాడు.
అయితే ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని అధిగమించేందుకు నిర్ణయాత్మకంగా వ్యవహరించి తీరాలని ఐరోపాపై ఒక పక్క అమెరికా నుంచి, మరో పక్క ఉక్రెయిన్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇది కొట్టివేయలేని వాస్తవం. జర్మన్ ఛాన్సలర్ ప్రకటన వెలువడిన రోజునే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఒక గమనార్హమైన ప్రకటన చేశాడు. రష్యా నుంచి ఇంధన దిగుమతులపై నిషేధం విధించే విషయమై తమ యూరోపియన్ మిత్ర దేశాల సహకారానికి ఎదురు చూస్తున్నామనేది ఆ ప్రకటన సారాంశం. బ్లింకెన్ ప్రకటన మార్కెట్లను భయపెట్టడమే కాదు, బ్యారెల్ (దాదాపు 159 లీటర్లు) చమురు ధరను 139 డాలర్ల (వీటి మారకం విలువ రూ.10,000కు పైగా ఉంటుంది)కు పైగా పెంచింది. ఉక్రెయిన్‌లో యుద్ధం పెచ్చరిల్లితే పరిస్థితులు ఎలా పరిణమిస్తాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
వాతావరణ మార్పును ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో ఇంధన భద్రతను సమకూర్చుకోవడం కూడా ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు అంత ముఖ్యమైపోయింది. విధాన నిర్ణేతలు అందరూ ఇంధన భద్రతకు అమిత ప్రాధాన్యమిస్తున్నారు. మార్కెట్లలో అంతరాయం ‘ఎనర్జీ ట్రాన్సిషన్’ (21వ శతాబ్ది ద్వితీయార్ధానికల్లా ప్రపంచ ఇంధన రంగాన్ని శిలాజాధారితం నుంచి కార్బన్ ఉద్గారాలకు తావులేనిదిగా మార్చేందుకు అంతర్జాతీయ సమాజం నిర్దేశించుకున్న మార్గం. వాతావరణ మార్పును పరిమితం చేసేందుకు బొగ్గుపులుసు వాయువు ఉద్గారాలను తగ్గించడమే దీని లక్ష్యం) దిశగా గమనాన్ని అడ్డుకుంటుందా లేక వేగవంతం చేస్తుందా? అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులను వేధిస్తున్న ప్రశ్న.
తన ఇంధన సరఫరాలకు రష్యాపై ఆధారపడని దేశాలలో బ్రిటన్ ఒకటి. అయితే వచ్చే నెలలోనే ఇంధన ధరలు రెట్టింపు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ఫలితంగా చమురు, గ్యాస్ ధరలు పెరుగుతాయి. ఫలితంగా బ్రిటిష్ ప్రజలపై పెద్ద ఆర్థిక భారం పడనున్నది. ప్రజల ఆర్థిక స్థితిగతులు క్షీణించడం ఖాయం. వాతావరణ మార్పును అడ్డుకునేందుకు శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని ప్రపంచానికి ధర్మ బోధలు చేసిన బ్రిటన్ ఇప్పుడు తానే తన సొంత శిలాజ ఇంధన పరిశ్రమను అభివృద్ధి పరచుకోవడానికి పూనుకున్నది. రెండు సంవత్సరాల కొవిడ్ విలయంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. తత్ఫలితంగా ఇంధన వనరులకు డిమాండ్ తగ్గిపోయింది. ఆ రంగంలో మదుపులు కూడా తగ్గిపోయాయి. కొత్త సామర్థ్యం సంచితమవలేదు. అయితే లాక్డౌన్ల ఎత్తివేత మూలంగా సమస్త దేశాలలోనూ ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకున్నాయి. చమురు, గ్యాస్, విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. ఇది ధరల పెరుగుదలకు దారితీసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఈ పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసింది. కార్బన్ ఉద్గారాలకు తావులేని ప్రపంచ ఇంధన వ్యవస్థను ఈ శతాబ్ది ద్వితీయార్ధంలోగా నెలకొల్పుకోవడమనేది సాధ్యంకాని లక్ష్యమనే కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. వీటి వెనుక ఉన్న శక్తులు ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక ఆచరణాత్మక, సమతుల్య ప్రణాళికను రూపొందించుకుని అమలు పరచటమే అన్ని విధాల శ్రేయస్కరమని ఆ కథనాలు ఉద్భోదిస్తున్నాయి. ఇదే, సంప్రదాయ ఇంధన వాణిజ్యం పునరుజ్జీవనం వెనుక ఉన్న తర్కం. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుత ఇంధన సంక్షోభం మనలను మళ్లీ శిలాజ ఇంధనాలను ఉధృతంగా ఉపయోగించుకునే దిశగా తీసుకువెళ్ళనున్నది. అనేక సంవత్సరాలుగా భూతాపానికి ఏవైతే కారణమని ఆక్షేపిస్తూ వచ్చామో వాటినే మళ్లీ వినియోగించుకోవల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడ్డాం. శిలాజ ఇంధనాలను ఉపయోగించుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాల నుంచి మనం ఏమీ పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు. మన పచ్చని ధరిత్రిని కాపాడుకునేందుకు అసలే సమయం మించిపోతున్న దశలో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడడం ఎంతైనా కలవరం కలిగిస్తోంది.

సునీతా నారాయణ్
(‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’
డైరెక్టర్ జనరల్, ‘డౌన్ టు ఎర్త్’ సంపాదకురాలు)