వివిధ రాష్ట్రాల్లో బూటకపు కంపెనీలపై ఈడీ దాడులు

ABN , First Publish Date - 2022-05-06T17:40:32+05:30 IST

జార్ఖండ్‌లో చట్ట విరుద్ధ గనుల తవ్వకాలు, బూటకపు

వివిధ రాష్ట్రాల్లో బూటకపు కంపెనీలపై ఈడీ దాడులు

రాంచీ : జార్ఖండ్‌లో చట్ట విరుద్ధ గనుల తవ్వకాలు, బూటకపు కంపెనీలకు సంబంధించిన కేసుల్లో వివిధ రాష్ట్రాల్లోని 18 చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ఉదయం దాడులు ప్రారంభించింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఓ గని లీజు పొందినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆయన రాష్ట్ర గనుల శాఖ మంత్రి కూడా కావడం విశేషం. 


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, జార్ఖండ్, బిహార్, రాజస్థాన్, హర్యానా, దేశ రాజధాని నగరం ఢిల్లీలలోని 18 చోట్ల ఈడీ సోదాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి రాంచీ వచ్చిన ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సోదాలను ప్రారంభించారు. జార్ఖండ్ గనుల శాఖ కార్యదర్శి పూజ సింఘాల్, ఆమె భర్త ఆస్తులను కూడా ఈడీ అధికారులు తనిఖీ చేశారు. పూజ భర్తకు చెందిన ఓ ఆసుపత్రిలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారుల ఇళ్ళలో కూడా సోదాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రూ.18 కోట్ల మేరకు  గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగం నేపథ్యంలో మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పూజా సింఘాల్‌ గతంలో‌ కుంతి జిల్లా కలెక్టర్‌గా, గ్రామీణ ఉపాధి హామీ నిధులకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. 


ఇదిలావుండగా, ఎన్నికల కమిషన్ మే 2న ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు ఓ నోటీసును పంపించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9Aను ఉల్లంఘిస్తూ హేమంత్ పేరు మీద గనుల లీజు మంజూరు కావడంపై ప్రశ్నించింది. 


కుంతి జిల్లాలో జూనియర్ ఇంజినీరు, సెక్షన్ ఆఫీసర్‌గా పని చేసిన రామ్ బినోద్ ప్రసాద్ సిన్హాను 2020 జూన్‌లో ఈడీ అరెస్టు చేసింది. జార్ఖండ్ విజిలెన్స్ బ్యూరో నమోదు చేసిన 16 కేసుల ఆధారంగా ఈడీ ఆయనను అరెస్టు చేసింది. ఆయన రూ.18 కోట్ల మేరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. అనంతరం ఈడీ ఆయనపై ప్రాసిక్యూషన్ కంప్లయింట్‌ను దాఖలు చేసింది. ఆయనను విచారించినపుడు ఈ కుంభకోణంలో భాగస్వాములైన ఉన్నతాధికారుల వివరాలు బయటపడినట్లు తెలుస్తోంది. 


Read more