జహంగీర్‌పురి హింసాకాండ కేసు నిందితునిపై మనీలాండరింగ్ కేసు

ABN , First Publish Date - 2022-04-23T17:40:34+05:30 IST

హనుమాన్ జయంతినాడు జహంగీర్‌పురిలో జరిగిన

జహంగీర్‌పురి హింసాకాండ కేసు నిందితునిపై మనీలాండరింగ్ కేసు

న్యూఢిల్లీ : హనుమాన్ జయంతినాడు జహంగీర్‌పురిలో జరిగిన హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడు అన్సార్ షేక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. ఆయన ఆస్తులకు మూలాలపై దర్యాప్తును ప్రారంభించింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా రాసిన లేఖ నేపథ్యంలో ఈడీ ఈ కేసును నమోదు చేసింది. 


న్యూఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 16న నిర్వహించిన శోభాయాత్రపై దారుణంగా దాడి చేసినవారిలో అన్సార్ షేక్ కీలక వ్యక్తి అని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈయనపైనా, ఈ కేసులో ఇతర నిందితులపైనా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వీరి ఆస్తులకు మూలాలను, అదేవిధంగా మత ఘర్షణల కోసం ఏమైనా నిధులను వినియోగించారా? అనే అంశాన్ని తెలుసుకునేందుకు ఈడీ దర్యాప్తు చేస్తుంది. 


విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, అన్సార్ షేక్‌కు పశ్చిమ బెంగాల్‌లోని హల్దియాలో భారీ భవంతి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు విదేశాల నుంచి నిధులు అందుతున్నట్లు కూడా సమాచారం. ఈ విషయాలు ఢిల్లీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. మత ఘర్షణలకు ముందు ఆయన ఎవరెవరితో మాట్లాడారో గుర్తించేందుకు ఆయన ఫోన్ కాల్స్‌ను ఢిల్లీ పోలీసులు పరిశీలిస్తున్నారు. 


అన్సార్ షేక్ స్క్రాప్ డీలర్. ఆయన తన కుటుంబంతో కలిసి జహంగీర్ పురిలో నివసిస్తున్నారు. ఆయనతోపాటు, మరో నలుగురిపై ఢిల్లీ పోలీసులు జాతీయ భద్రత చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. 


Updated Date - 2022-04-23T17:40:34+05:30 IST