ఇంజినీరింగ్‌లో నూతన సిలబస్‌ కోసం ప్రత్యేక కమిటీ

ABN , First Publish Date - 2022-05-07T14:48:25+05:30 IST

ఇంజినీరింగ్‌ విద్యలో ఉపాధి అవకాశాలు పెరిగేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించామని ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి

ఇంజినీరింగ్‌లో నూతన సిలబస్‌ కోసం ప్రత్యేక కమిటీ

పెరంబూర్‌(చెన్నై): ఇంజినీరింగ్‌ విద్యలో ఉపాధి అవకాశాలు పెరిగేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించామని ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి పొన్ముడి వెల్లడించారు. శాసనసభ సమావేశాల్లో శుక్రవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాబోయే విద్యా సంవత్సరం (2022-23)లో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సీట్ల సంఖ్య పెరిగే అవకాశం లేదని తెలిపారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలలు ఒక్కొక్కటి మూత పడుతున్నాయని తెలియజేశారు. ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సుమారు 2 లక్షల సీట్లుండగా, వాటిలో 1,28,000 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే 71,934 ఖాళీలున్నాయని, ఆ ప్రకారం రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థుల చేరిక పెరిగే అవకాశం లేదన్నారు. అందువల్ల విద్యార్థుల అడ్మిషన్లు పెంచేలా ఉపాధి అవకాశాలతో కూడిన పాఠ్యప్రణాళిక ప్రవేశపెట్టాలని నిర్ణయించామని వివరించారు. మహిళలకు ప్రత్యేక కళాశాల ప్రారంభించడం కన్నా, పురుషులు -మహిళలు కలసి చదువుకోవడంలో తప్పు లేదన్నారు. స్వయంప్రతిపత్తి కళాశాలలు స్వతంత్రంగా పనిచేసేందుకు వీలులేదని, అన్ని కళాశాలలు విశ్వవిద్యాలయ అనుమతులతోనే పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు.

Read more