డీజిల్ ఇంజిన్ ఆవిష్కర్త మరణంపై నేటికీ వీడని సస్పెన్స్.. ఇంతకీ ఆరోజు ఏం జరిగింది?

ABN , First Publish Date - 2022-01-17T15:45:36+05:30 IST

నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా యంత్రాలు..

డీజిల్ ఇంజిన్ ఆవిష్కర్త మరణంపై నేటికీ వీడని సస్పెన్స్.. ఇంతకీ ఆరోజు ఏం జరిగింది?

నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా యంత్రాలు, వాహనాలు డీజిల్‌ ఆధారంగానే నడుస్తున్నాయి. రుడాల్ఫ్ డీజిల్ ఆవిష్కరించిన డీజిల్ ఇంజిన్ రవాణా ప్రపంచంలో నూతన విప్లవాన్ని తీసుకొచ్చింది. అయితే 1913 సెప్టెంబరు 29న రుడాల్ఫ్ డీజిల్ అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించాడు. రుడాల్ఫ్ డీజిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడనే కథనాలు వినిపించాయి. బెల్జియం నుండి హార్విక్ (ఇంగ్లండ్)కి వెళుతుండగా రుడాల్ఫ్ డీజిల్.. డ్రెస్డెన్ అనే ఓడ నుంచి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత 1913 అక్టోబరు 10న ఉత్తర సముద్రంలో ఒక మృతదేహం తేలుతూ కనిపించింది. విచారణ అనంతరం అది డీజిల్ ఇంజిన్ ఆవిష్కర్త రుడాల్ఫ్ డీజిల్ మృతదేహమని నిర్థారణ అయ్యింది. అయితే అతను ఎలా చనిపోయాడనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. రుడాల్ఫ్ డీజిల్ ఆత్మహత్య చేసుకున్నాడని అధికారికంగా ప్రకటించారు. అయినప్పటికీ నేటికీ రుడాల్ఫ్ డీజిల్ మృతిపై అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. రుడాల్ఫ్ డీజిల్ హత్యకు గురై ఉంటాడనే ఆరోపణలున్నాయి. కాగా 1892, ఫిబ్రవరి 28న రుడాల్ఫ్ డీజిల్ తన 'కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్'పై పేటెంట్ పొందాడు. మొదట్లో ఈ ఇంజిన్ వేరుశెనగ నూనెతో పనిచేసేది. తర్వాత రుడాల్ఫ్ దానికి ఒక సిలిండర్‌ని జోడించాడు. అనంతరం పెట్రోల్‌కు భిన్నమైన ద్రవ ఇంధనాన్ని ఉపయోగించాడు. ఇంజిన్‌లో ఈ ఇంధనం  పోసిన వెంటనే ఆ ఇంజిన్ శక్తివంతంగా పనిచేయడం ప్రారంభించింది. ఈ ఇంజిన్‌లో కంప్రెస్డ్ ఎయిర్, ఫ్యూయల్‌తో రన్నింగ్ చాలా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆవిరి యంత్రానికి పెద్ద సవాలుగా నిలిచింది.


ఆవిరి ఇంజిన్‌లో 90 శాతం శక్తి వృథా అవుతుందని రుడాల్ఫ్ తెలిపాడు. తాను రూపొందించిన ఇంజిన్ వ్యర్థాలను బాగా తగ్గిస్తుందని చెప్పాడు. రుడాల్ఫ్ రూపొందించిన ఈ ఇంజిన్‌కు డీజిల్ ఇంజిన్ అని పేరు పెట్టారు. ఈ ఇంధనానికి డీజిల్ అని పేరు వచ్చింది. 1912 నాటికి ప్రపంచవ్యాప్తంగా 70 వేల డీజిల్ ఇంజన్లు పనిచేస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత డీజిల్ ఇంజన్లు రవాణాకు ఉపయోగపడ్డాయి. సరుకు రవాణాలో మరింత వేగం పెరిగింది. అదే సమయంలో రవాణా మరింత చౌకగా కూడా మారింది. 1913 సెప్టెంబరులో రుడాల్ఫ్ ఒక ముఖ్యమైన పర్యటన కోసం ఇంగ్లండ్‌కు వెళ్లాడు. అక్కడ నూతన డీజిల్ ఇంజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ నేపధ్యంలో అతను బ్రిటిష్ నావికాదళ అధికారులను కలవాల్సి ఉంది. అయితే బ్రిటిష్ నావికాదళం తమ జలాంతర్గామిని కోసం ప్రత్యేక తరహా డీజిల్ ఇంజిన్‌ను తయారుచేయాలనుకుంది. ఈ నేపధ్యంలోనే వారు రుడాల్ఫ్‌ను ఓడలో నుంచి నీటిలోకి తోసి వేసివుంటారనే కథనాలు వినిపించాయి. కాగా బ్రిటిష్ నావికాదళ అధికారులు రుడాల్ఫ్‌పై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని మరికొందరు చెబుతుంటారు. ఏదిఏమైనప్పటికీ రుడాల్ఫ్ మృతి నేటికీ మిస్టరీగానే మిగిలింది. 



Updated Date - 2022-01-17T15:45:36+05:30 IST