పోలీసులకు సవాల్‌గా మారిన ఇంజనీర్‌ శ్వేత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-07T00:36:09+05:30 IST

చిల్లకల్లు ఊరచెరువులో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జాస్తి శ్వేత (Jasti Swetha) కేసు మిస్టరీ పోలీసులకు సవాలుగా మారింది.

పోలీసులకు సవాల్‌గా మారిన ఇంజనీర్‌ శ్వేత ఆత్మహత్య

విజయవాడ: చిల్లకల్లు ఊరచెరువులో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జాస్తి శ్వేత (Jasti Swetha) కేసు మిస్టరీ పోలీసులకు సవాలుగా మారింది. ఆత్మహత్య (suicide) చేసుకొని నాలుగు రోజులు గడుస్తున్నా మిస్టరీ వీడలేదు. ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శ్వేత స్నేహితురాలి నుంచి కీలక సమాచారాన్ని పోలీసుల సేకరించినట్లు తెలుస్తోంది. శ్వేత ఫోన్‌ (Phone)ను పరిశీలించి కాల్‌డేటాను తీశారు. అందులో ఓ స్నేహితురాలి నంబర్‌ను పోలీసులు గుర్తించారు. ఆమెను సంప్రదించి దాని ప్రకారం దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌ డేటింగ్‌ యాప్‌ (Social Dating App) స్నాప్‌చాట్‌లో ఓ యువకుడితో ఏర్పడిన పరిచయమే శ్వేత ఆత్మహత్యకు దారితీసినట్టు తెలుస్తోంది. అతడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు.


రెండు, మూడు నెలల నుంచి అతడితో శ్వేత చాటింగ్‌ చేసినట్టు సమాచారం. చాటింగ్‌ ద్వారా ఏర్పడిన పరిచయంతో అతడు అడిగిన మొత్తాన్ని బ్యాంక్‌ ఖాతాకు సరఫరా చేసిందని తెలిసింది. ఇచ్చిన డబ్బును రెట్టింపు చేసి ఇస్తానని నమ్మించడంతో ఈ మొత్తాన్ని శ్వేత పంపినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి రెట్టింపు డబ్బుల విషయాన్ని పక్కన పెడితే ఇచ్చిన అసలు కూడా రాకపోవడంతో ఆమె కొద్దిరోజులుగా మానసిక సంఘర్షణకు లోనైనట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని స్నేహితురాలి వద్ద ప్రస్తావించిందని సమాచారం. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు ఇవ్వడంతో శ్వేత ఆందోళన చెందింది. శ్వేత డబ్బులు జమ చేసిన బ్యాంక్‌ ఖాతా వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఆ బ్యాంక్‌ కేరళకు చెందిందిగా గుర్తించారు. పోలీసుల దర్యాప్తుకు స్నాప్‌ చాట్ కాల్‌ డేటా  కీలకంగా మారింది. శ్వేత ఫోన్‌ నెంబరు ఆధారంగా సైబర్‌ చాట్‌ చేసిన ఐపీ అడ్రస్‌ సేకరించే పనిలో సైబర్‌ నిపుణులు పడ్డారు. 


నిందితుడు దొరికేనా?

శ్వేతను స్నాప్‌చాట్‌ యాప్‌లో పరిచయం చేసుకున్న వ్యక్తి ఎవరు? అసలు అతడు పోలీసులకు చిక్కడం సాధ్యమేనా? అన్న ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. దీనికి కారణంగా యాప్‌ నిర్వహణలో ఉన్న లోపమే. స్నాప్‌చాట్‌ అనేది సోషల్‌ డేటింగ్‌ యాప్‌. దీన్ని యూరప్‌ దేశాల్లో రూపొందించారు. నిర్వహణ మాత్రం అమెరికా నుంచి జరుగుతోంది. ఈ యాప్‌ను ఎక్కువగా యువతీ యువకులు ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌లో ఆటో వైపింగ్‌ సదుపాయం ఉండటంతో సైబర్‌ నేరాళ్లూ దీన్ని ఉపయోగిస్తున్నారు. యాప్‌లో చేసిన చాట్‌ గానీ, పోస్ట్‌ చేసిన ఫొటోలు గానీ పదిసెకన్లలో డిలీట్‌ అయిపోయితాయి. దీన్నే సాంకేతికంగా ఆటోటో వైపింగ్‌గా వ్యవహరిస్తారు. ఈ సదుపాయం ఉన్న స్నాప్‌చాట్‌లో శ్వేత, అజ్ఞాత వ్యక్తి చేసుకున్న చాట్‌ ఎప్పుడో డిలీట్‌ అయిపోయి ఉంటుంది. జగ్గయ్యపేట పోలీసులు, విజయవాడ సైబర్‌ పోలీసులు దీన్ని చేధించే దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు. శ్వేతకు సంబంధించి మొత్తం వివరాలను ఇవ్వాలని స్నాచ్‌చాట్‌ సంస్థకు పోలీసులు లేఖలు రాశారు.

Updated Date - 2022-07-07T00:36:09+05:30 IST